సనాతన ధర్మం ప్రకారం, మనం ఈ లోకంలోకి రాగానే అనేకమందికి రుణపడి ఉంటామని శ్రీమద్భాగవతం వివరిస్తుంది. దేవతలు, రుషులు, ఇతర జీవులు, మానవ సమాజంతో పాటు, మన జీవితాలను, కుటుంబ సంప్రదాయాలను పరిరక్షించిన పూర్వికులకు కూడా మనం రుణపడి ఉంటాం. ఈ పితృ రుణాన్ని తీర్చకపోతే పాపులమై, పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుందని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఈ రుణాలు తీర్చుకోవడానికి యజ్ఞాలను నిర్వహించడం, కృతజ్ఞతను వ్యక్తం చేయడం మార్గాలు. పితృదేవతలకు జల తర్పణం ఇచ్చే పితృయజ్ఞం మొదలైనవి వేదాలు సూచించాయి. దేవతలు, రుషులు, పితృదేవతలు, జీవులు, సామాన్య మానవులకు ఉన్న ఐదు రకాల రుణాలను ఈ యజ్ఞాలు తీరుస్తాయి. పితృపక్షంలో ఈ కర్మలను ఆచరించడం.. పూర్వికుల పట్ల మన బాధ్యతను నెరవేర్చడమే.
శ్రాద్ధ కర్మలో శ్రీగోవిందుని (విష్ణువు) దివ్యకటాక్షం అత్యవసరం. అన్ని యజ్ఞాల అంతిమ లక్ష్యం శ్రీవిష్ణువును సంతృప్తి పరచడమే. శ్రీవిష్ణువుకు సమర్పించిన ప్రసాదాన్ని పితృదేవతలకు అర్పించడం వల్ల వాళ్లకు ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి. శ్రాద్ధ కర్మ ఉద్దేశం శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడం. తద్వారా ఆ ప్రసాదాన్ని పూర్వికులకు సమర్పించి వారిని సంతోషపరచడమే. పితృలోక నివాసులు పుణ్య కార్యాలు చేసినవారై ఉంటారు, వారి వారసులు విష్ణు ప్రసాదాన్ని సమర్పించినంత కాలం వాళ్లు అక్కడ ఉండగలుగుతారు. అయితే, వారి పుణ్యఫలాలు క్షీణించినప్పుడు తిరిగి భూలోకానికి రావాలి. కనుక, పితృదేవతల ఉత్తమ గతికి శ్రీగోవిందుని కృప కీలకం.
ఈ కలియుగంలో యజ్ఞాలు నిర్వహించడం కష్టం, ఖర్చుతో కూడుకున్నది. శ్రీకృష్ణుడికి శరణాగతి పొంది, సంకీర్తన యజ్ఞాన్ని (హరేకృష్ణ మహామంత్ర జపం) నిర్వహించడమే అత్యంత సులభమైన, ప్రభావవంతమైన ఆధ్యాత్మిక మార్గమని బోధిస్తుంది శ్రీమద్భాగవతం. ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ అనే మహామంత్రాన్ని బిగ్గరగా జపించడం ద్వారా సంకీర్తన యజ్ఞం చేయవచ్చు. ఈ భక్తి సేవ ద్వారా, శ్రీకృష్ణుడికి సంపూర్ణంగా శరణాగతి పొందిన వ్యక్తి అన్ని రుణాల నుంచి విముక్తుడవుతాడన్నది నిస్సందేహం.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, 96400 86664