ఉగాది ఉషస్సు ఒక్కరోజుకు పరిమితం కాదు! కొత్త ఏడాది రాకతో పలకరించే వసంతం రెండు నెలలు కొనసాగుతుంది. చైత్ర హాసం నెల రోజులు లాస్యం చేస్తుంది. ఈ వసంతంలో చిగురించే ఆధ్యాత్మిక శోభ నవరాత్రులూ భక్తి తరంగాలను ప్రసరింపజేస్తుంది. శరన్నవరాత్రులకు ఎంతటి ప్రాశస్త్యం ఉన్నదో.. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఉండే… వసంత నవరాత్రులకూ అంతే ప్రాధాన్యం కనిపిస్తుంది.
మనం ఏడాదిలో మూడుసార్లు నవరాత్రులు చేసుకుంటాం. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు. రెండోది భాద్రపదంలో వచ్చే గణేశ నవరాత్రులు. మూడోది ఆశ్వయుజంలో శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రుల్లో లలితాదేవి ఉపాసన చేసే సంప్రదాయం ఉంది. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులు శ్రీరామచంద్రుడి ఆరాధనలు విశేషంగా జరుగుతాయి. భద్రాచలంతోపాటు దేశవ్యాప్తంగా రామాలయాల్లో నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు నిర్వహించడం కనిపిస్తుంది.
శ్రీరామచంద్రుడు జన్మించిన నవమి నాడు.. సీతారాముల కల్యాణోత్సవాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహిస్తారు. సాధకులు ఈ తొమ్మిది రోజులు అధ్యాత్మ రామాయణం, సుందరకాండ పారాయణాలు చేస్తుంటారు. మరికొందరు భక్తులు రామకోటి రాస్తూ భక్తిని చాటుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నిత్య సంకీర్తనం చేపడతారు. అమ్మవారి ఉపాసకులు లలితాదేవి ఉపాసన చేస్తారు. దేవీ నవరాత్రుల మాదిరిగా లలితాంబకు నిత్య అలంకారాలు, కైంకర్యాలు నిర్వహిస్తారు. ‘శ్రీరామో లలితాంబిక’ అని పురాణాలు చెబుతున్నాయి. రామచంద్రుడిలో లలితాపరాభట్టారికను దర్శించి తరిస్తుంటారు.
రామాయణంలో కీలక ఘట్టాలు చైత్ర మాసంలో జరిగినట్టుగా తెలుస్తున్నది. శ్రీరాముడు జన్మించింది చైత్రంలోనే. రాముడు వనవాసానికి వెళ్లడం, దశరథుని నిర్యాణం, ఆంజనేయుడు సీతమ్మను లంకలో దర్శించిన సందర్భం, రామపట్టాభిషేకం తదితర ముఖ్యమైన ఘట్టాలన్నీ చైత్రంలోనే జరిగాయని పురాణ కథనాల ద్వారా తెలుస్తున్నది. ఇక చైత్ర పౌర్ణమి నాడు ఉత్తరాదిలో హనుమత్ జయంతి జరుపుకొంటారు. దక్షిణాదిలో హనుమత్ విజయోత్సవంగా చేసుకుంటారు. ఇలా ఎన్నో ప్రాధాన్యాలను ఇముడ్చుకున్న చైత్రం కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికింది. మోడును కూడా చిగురింపజేసే వసంత రుతువు… మనుష్యులలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరియడానికి దోహదం చేస్తుంది అనడంలో సందేహం లేదు.
– శ్రీ