మానవ జీవితం మహత్తరమైంది. దాన్ని పరిపూర్ణంగా సద్వినియోగ పరచుకొని, జీవన పరమావధి చేరుకున్నప్పుడే ఆ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. లేకపోతే అథోగతి పాలవుతుంది. మనిషి జీవితం వైవిధ్య భరితం. ఒకటి ఉత్తమ ఆత్మ లోకం. రెండోది భౌతిక బాహ్య ప్రపంచం. ఈ రెండిటికీ పడదు. కానీ, ఈ రెండూ ముడివేసుకుంటేనే ఉన్నతమైన జీవితం. బాహ్యానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఆత్మకూ కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మానవునికి ప్రభువు కొన్ని భాగ్యాలు దయ చేశాడు. అవి ఎనిమిది. అందుకే వాటికి అష్ట భాగ్యాలు అని పేరు. అవేంటంటే..
మొదటిది.. విర్రవీగకుండా అణిగిమణిగి దీనంగా ప్రవర్తించడం, ఆత్మ విషయంగా దీనత్వంగా ఉండటం. అలాంటి వారికే పరలోక రాజ్యం లభిస్తుందన్నాడు ప్రభువు. రెండోది… దుఃఖం వచ్చింది కదా అని కన్నీటిని ఖర్చు పెట్టకూడదు. వారే చివరికి ఓదార్పు పొందుతారని ప్రకటించాడు. మూడోది.. సాత్వికులు ధన్యులు. వారి సత్వ గుణాలతోనే భూలోకాన్ని వశపరుచుకోగలరు. నాలుగోది నీతి కోసం ఆకలిదప్పులు భరించేవారు ధన్యులు. వారికి ఎన్నటికైనా తృప్తి లభిస్తుంది. ఐదోది కనికరం కలవారు అదే కనికరాన్ని పొందగలుగుతారు. ఆరోది హృదయ పవిత్రత. పవిత్రమైన హృదయం కలవారికే దైవాన్ని చూసే భాగ్యం లభిస్తుందని స్పష్టం చేశాడు.
ఏడోది సమాధానపరిచే వారు దైవ కుమారులు అవుతారని పేర్కొన్నాడు. ఎనిమిదోది.. నీతి నిమిత్తం ఎంతటి హింసనైనా భరించేవారికి పరలోక రాజ్యం ప్రాప్తిస్తుందని ప్రభువు తెలియజేశాడు. ఈ అష్ట భాగ్యాలు ఆచరించేవారు మహా భాగ్యవంతమైన జీవితాన్ని పొందుతారని క్రీస్తు పేర్కొన్నాడు. ఆత్మ అనేది శరీరానికి రథ సారధి. అందుకే అంతశ్శుద్ధికి, అంతఃకరణ బుద్ధికి ప్రభువు ప్రాధాన్యం ఇచ్చాడు. మనిషిని మేల్కొల్పడానికి అష్ట భాగ్యాలనూ సూచించాడు. ఇది మానవుడికి భరోసాగా క్రీస్తు ప్రకటించిన అనుగ్రహం!
..? ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024