ప్రతి క్షణం విలువైనదే! దానిని ఎంత గొప్పగా ఉపయోగించుకుంటే.. అంత గొప్ప ఫలితం కలుగుతుంది. ప్రతి రోజూ ఓ అతిథిలాంటిదే అంటారు హసన్ బస్రీ (ర.అ.). ఒకసారి ఆయన ‘ఓ ఆదమ్ పుత్రా! ఈ రోజు అనేది నీ దగ్గరకు అతిథిగా వస్తుంది. దానితో మంచిగా ప్రవర్తించు. నువ్వు మంచిగా ప్రవర్తిస్తే అది నిన్ను పొగుడుతూ వెళ్తుంది. చెడుగా ప్రవర్తిస్తే నిన్ను నిందిస్తూ వెళ్తుంది. రాత్రి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అంతేకాదు ఆ వచ్చే ప్రతి రోజూ నీ పనులకు సాక్షి. దానిని సద్వినియోగం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు.
ఆరోగ్యం, తీరిక సమయం ఇవి రెండూ దేవుడు ప్రసాదించిన రెండు గొప్ప వరాలు. వీటి విషయంలో మనిషి ఏమరుపాటుకు, నష్టానికి గురవుతాడు. పై వాక్యాలు సమయం విలువను, కాలం గొప్పతనాన్ని తెలియజెప్పేవే. సెకన్లు, నిమిషాలు, గంటల సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న వారు తీవ్ర నష్టానికి గురవుతారని ఖురాన్ హెచ్చరిస్తున్నది. ఇస్లామీయ ఆరాధనలన్నీ సమయపాలనను నేర్పుతాయి. ఐదు పూటలా నమాజు వేళ ప్రకారం చేయాలి. మక్కా యాత్రను జిల్ హజ్ నెలలో చేస్తేనే హజ్ క్రతువు పూర్తవుతుంది. ఉపవాసాలు రమజాన్ నెలలో పాటిస్తేనే వాటి ఉద్దేశం నెరవేరుతుంది.
ఇలా ప్రతీ ఆరాధనా సమయపాలనను, సమయ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాయి. అంతేకాదు, తిరిగిరాని సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే.. అంత గొప్ప జీవితం ఉంటుంది. దాన్ని తప్పుడు పనులకు వెచ్చిస్తే అది మనిషిని నాశనం చేస్తుంది. గడిచిపోయిన కాలాన్ని గురించి చింతిస్తూ కూర్చోకుండా, రాబోయే భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకు దొరికిన ప్రతి క్షణాన్నీ దైవాదేశాలకు కట్టుబడి వెచ్చిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది.
– ముహమ్మద్ ముజాహిద్, 96406 22076