ఖలీఫా హారూన్ రషీద్ తన ఇద్దరు పిల్లలకు ఇంట్లోనే చదువులు చెప్పించేవారు. ఇమామ్ కసాయి చెప్పే పాఠాలను ఖలీఫా ఇద్దరు పిల్లలు మామూర్, అమీన్ ఎంతో బుద్ధిగా వినేవారు. గురువు గారికి పరమ విధేయులుగా ఉండేవారు. ఒకరోజు గురువుగారు చదువు చెప్పి ఇంటికి బయల్దేరబోయారు. అంతలో అన్నదమ్ములిద్దరూ లేచి గురువు గారికి తానంటే తాను మేజోళ్లు తొడిగిస్తానని పోటీపడ్డారు. ఇద్దరిమధ్య స్వల్ప గొడవ మొదలైంది. ఇంతలో గురువుగారు కలగజేసుకుని ‘చెరో చెప్పు తొడిగించండి’ అని చెప్పడంతో ఇద్దరి గొడవ సద్దుమణిగింది.
ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఖలీఫాను కలుసుకున్నారు గురువు. ‘అత్యంత గౌరవనీయుడు ఎవరు?’ అని ఇమామ్ కసాయిని ప్రశ్నించాడు ఖలీఫా హారూన్ రషీద్. దానికి ఆయన ‘ఖలీఫా కంటే ఆదరణీయుడు, గౌరవనీయుడు ఇంకెవరుంటారు ప్రభూ’ అన్నాడు. దానికి ఖలీఫా హారూన్ రషీద్ ‘ఖలీఫా కొడుకులు ఎవరికైతే చెప్పులు తొడిగించారో అతను గౌరవనీయుడు’ అన్నారు. గురువులను ప్రవక్తల వారసులుగా అభివర్ణించారు ప్రవక్త మహనీయులు. జ్ఞానాన్ని నేర్పే వారికోసం సముద్రంలో చేపలు, భూమికింద కీటకాలు, ఆకాశంలో పక్షులు వేడుకుంటాయని ప్రవక్త (స) చెప్పారు. జ్ఞాన సంపన్నులైన గురువులకు అల్లాహ్ మహోన్నత స్థానాలు ప్రసాదిస్తాడని ఖురాన్ పేర్కొన్నది.