అగ్నే నయ సుపథారాయే అస్మాన్
విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జు హురాణమేనో
భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ॥
(ఈశావాస్య ఉపనిషత్తు)
‘అగ్నిదేవా! మమ్మల్మి మంచి మార్గంలో నడిపించు. నీకు అన్ని కర్మలూ తెలుసు. మా పాపాలు విడిపించు. నీకు నమస్కారం..’ అని పై ఉపనిషత్ శ్లోకానికి భావం. బ్రహ్మజ్ఞానానికి అగ్ని ఉపాసన చాలా ముఖ్యం.
అరుణాస్పదపురంలో అందగాడు, శీలవంతుడు అయిన ప్రవరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించిన ఒక సిద్ధుడు ‘ఈ పాదలేపంతో ఎక్కడికైనా వెళ్లవచ్చు’ అని ఒక పసరు ప్రవరుని పాదాలకు పూశాడు. ప్రవరుడు హిమాలయం చూడాలనుకున్నాడు. మరుక్షణంలో అక్కడికి చేరుకున్నాడు. అనేక పవిత్ర ప్రదేశాలు దర్శించుకున్నాడు. ఇంటికి వెళ్దామనుకుంటే… మంచు వల్ల పసరు కరిగిపోయింది. దిక్కు తోచక హిమగిరుల్లో సంచరిస్తున్న ప్రవరుడికి దూరం నుంచి ఏదో గానం వినిపించింది. ఆశ్రమం అనుకొని అటుగా వెళ్లాడు. ఒక భవనాన్ని, ఉద్యానవనాన్ని, మధురంగా వీణ మీటుతూ పాడుతున్న దేవకాంతను చూశాడు. ‘నన్ను ప్రవరుడు అంటారు. దారి తప్పాను. మా ఊరికి వెళ్లే మార్గం చెప్పి పుణ్యం కట్టుకో!’ అని ఆ దేవకాంతను అడిగాడు. ఆమె పేరు వరూధిని. అందచందాల ప్రవరుణ్ని చూడగానే ఆమె అతణ్ని మోహించింది.
మరోవైపు తన అగ్నిహోత్రానికి ఆలస్యం అవుతుందని బాధపడుతున్నాడు ప్రవరుడు. ‘ఈ ఇసుక తిన్నెలలో, పొదరిళ్లలో నాతో స్వర్గసుఖాలు అనుభవించు’ అని ప్రవరుడితో అన్నది వరూధిని. ‘నా తల్లిదండ్రులు వృద్ధులు. ఆకలితో నిరీక్షిస్తారు. నన్ను త్వరగా ఇల్లు చేర్చండి’ అని బతిమలాడు ప్రవరుడు. ‘ఇంద్రియాల సుఖమే పరబ్రహ్మం’ అన్నదామె. ఐహిక సుఖాలపట్ల వైముఖ్యాన్ని, వైదిక కర్మల ధర్మపరత్వాన్ని వినిపించుకోలేదు. పైగా కౌగిలించుకోబోయింది. ప్రవరుడు ‘హరి హరీ’ అని ఆమెను పక్కకు తోసేశాడు. వరూధిని పరాభవంతో విలపించింది. ఆమె హత్తుకోబోతే అంటిన సుగంధ ద్రవ్యాలను ప్రవరుడు కోనేటిలో కడుక్కొని పవిత్రుడై ఇలా ప్రార్థించాడు.
‘హవ్యవాహనా! నేను దాన జపాగ్ని హోత్రాలు తప్పనివాడినైతే త్రికరణ శుద్ధిగా నీ భక్తుడినైతే పరసతులను కోరని వాడినైతే నన్ను పొద్దువాలక ముందే సగౌరవంగా ఇంటికి చేర్చు’ అని వేడుకున్నాడు. మరుక్షణంలో అగ్నిహోత్రుడు దివ్య తేజస్సు ప్రసాదించాడు. క్షణంలో ప్రవరుడు తన ఇంట్లో ఉన్నాడు. నిత్యకర్మలు నిర్విఘ్నంగా నిర్వర్తించుకున్నాడు. అగ్నిని ఆరాధించే నిష్ఠాగరిష్ఠులు ఇలా ఉంటారని ప్రవరుడి వృత్తాంతం
తెలియజేస్తుంది.
– డా॥ వెలుదండ సత్యనారాయణ