అది గలెలియా ప్రాంతం. సుఖారను ఊరు. ఊరి వెలుపల ఒక బావి. గ్రామంలోని స్త్రీలు ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకొని వెళ్తుండేవారు. ఓసారి అదే ప్రాంతంలో తిరుగాడుతూ అలసిపోయిన ప్రభువు ఆ బావి దగ్గర కూర్చుండిపోయాడు. అంతలో ఒక సమరయా స్త్రీ కూడా అక్కడికి వచ్చింది. దాహంతో ఉన్నాడేమో ప్రభువు ఆ స్త్రీని ‘కాస్త నీళ్లు ఇవ్వమ్మా’ అని అడిగాడు. ఆమెలో సహజంగా మాతృ హృదయం ఉప్పొంగినా, తన హీన దీన స్థితి గుర్తొచ్చి, తమను ఆనాటి సంఘం బహిష్కరించడం వల్ల కాస్త సందేహించింది. ‘మేము సమరేయులం. నీవు చూస్తే యూదుడవు. మమ్మల్ని నీళ్లు ఇవ్వమని అడగడం భావ్యమా ప్రభూ!’ అని ఉన్నమాటే అన్నది.
అందుకు ప్రభువు ‘తల్లీ! నువ్విచ్చే ఈ నీళ్లు తాగితే మళ్లీ మళ్లీ దాహం అవుతుంది. కానీ నేనిచ్చే ఈ జీవజలం ఒక్కసారి తాగితే చాలు దాహానికి తావు లేదు’ అంటాడు ప్రభువు. అందుకామె ‘అయితే, ఆ నీళ్లు నాకు అనుగ్రహించు’ అని కోరింది. ఆమెకు ఈ జీవజలాన్ని ప్రసాదించాడు ప్రభువు. ఆమె గతాన్నీ దర్శించి ఆత్మీయంగా పలకరించాడు. ఆ మహిళపట్ల ప్రభువు చూపిన కరుణ కేవలం ఆమెకు మాత్రమే వర్తించేది కాదు, విశ్వజనులందరికీ సుమా!! ఇదే ప్రభు ప్రేమలోని విశ్వజనీనత!!!