వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. ‘మహాభారతం’లో ధర్మరాజు సూర్యారాధన చేసి, భాస్కరుడి నుంచి అక్షయపాత్రను పొందిన రోజు ఇదేననీ, అందువల్ల ఈ పర్వదినం ‘అక్షయ తృతీయ’గా ప్రసిద్ధి పొందిందనీ కొందరి విశ్వాసం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అక్షయమైన సంపదలు కలుగుతాయన్న విశ్వాసం ఉంది. అయితే, దీనికి శాస్త్ర ప్రమాణం కనిపించదు. ఈరోజు చేసే పుణ్యకార్యాలు, జపతపాలు, దానధర్మాలు అక్షయమైన ఫలితాలు ఇస్తాయని శాస్త్ర వచనం. దానాలలో స్వర్ణదానం శ్రేష్ఠమైనదని చెబుతారు. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం దానమివ్వాలి కానీ, కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే!
పార్వతీదేవికి అక్షయ తృతీయ ప్రత్యేకతను వివరించిన పరమేశ్వరుడు ‘ఈ పర్వదినం నాడు అక్షయ స్వరూపుడైన దైవాన్ని ఆరాధిస్తే అనంతమైన అనుగ్రహం కలుగుతుంద’ని వివరించాడట. పరమ పవిత్రమైన గంగానది దివినుంచి భువికి దిగివచ్చిన రోజు ఇదేనని పురాణ కథనం. అంతేకాదు, కుచేలుడు శ్రీకృష్ణ దర్శనంతో అక్షయమైన సంపదలు పొందిన రోజు ఇదేనని కొందరి భావన. ఒకపేదరాలు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి, ఆమె దాన గుణాన్ని గుర్తించి ఆదిశంకరులు అమ్మవారిని ‘కనకధారా స్తోత్రం’తో ప్రార్థించి ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే అని చెబుతారు.
ఈ రోజు ఆచరించే మంచి పనులు ఏవిధంగా అయితే ఉత్తమ ఫలితాలను ఇస్తాయో, దుష్కార్యాలు చేస్తే వాటి ప్రభావం కూడా అక్షయంగా వెంటాడుతుందని పెద్దల మాట. అందుకే, ఉన్నంతలో పేదలకు దానం ఇవ్వడం, భగవన్నామ స్మరణ వల్ల దైవానుగ్రహం అనంతంగా పొందగలుగుతాం.