ఓ గ్రామంలోని రైతుకు పాటలు పాడుతూ భజనలు చేయడమంటే చాలా ఇష్టం. అయితే అతనెప్పుడూ ఊళ్లో జరిగే భజనల్లో పాల్గొనే వాడు కాదు. గ్రామస్తులు ఎవరైనా భజన చేస్తూ ఉంటే దూరంగా నిల్చుని వింటూ ఆనందించే వాడు. ఈ విషయాన్ని భజన బృందం నాయకుడు గమనించాడు. ఒక పౌర్ణమి నాడు ఊళ్లో రాములవారి గుడి దగ్గర జరుగుతున్న భజనకు రైతు కూడా వచ్చాడు. తన్మయత్వంతో కళ్లు మూసుకుని కూర్చున్న రైతుతో, భజన బృందం నాయకుడు ‘నువ్వు కూడా పాటలు నేర్చి భజనలో పాల్గొనవచ్చు కదా’ అని అడిగాడు.
‘నాకు భజన చేయడమంటే చాలా ఇష్టం. భజనలో పాల్గొనడం అంటే మరీ ఇష్టం. కానీ, దేవుడే ఆ విషయం మరిచాడు. నాకు భజనలంటే ఇష్టమని దేవుడికి తెలిసి ఉంటుంది కదా. ఎందుకనో దేవుడు నన్ను భజనలు చేసే వైపు తీసుకెళ్ల లేదు’ అన్నాడు. రైతు మాటలకు బృంద నాయకుడు చిన్నగా నవ్వి ‘మీ ఇంట్లో ఆవులు ఉన్నాయా?’ అని అడిగాడు.
‘లేకేమి, దండిగా ఉన్నాయి’ అని బదులిచ్చాడు రైతు.
‘నీ ఆవుల మందలో, ఏ ఆవు అయినా నువ్వు ఇంట్లో ఉంటే… దగ్గరికి వచ్చి తనకు తానుగా నీకు పాలు ఇచ్చిందా?’ అని అడిగాడు.
‘అదెలా ఇస్తుంది? ఇవ్వదు గాక ఇవ్వదు’ అని గట్టిగా సమాధానం ఇచ్చాడు రైతు.
‘ఇది కూడా అంతే. దేనికైనా మన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నిస్తేనే ఫలితం ఉంటుంది. అన్నీ దేవుడే చేస్తాడు అనుకుంటే జరుగదు. ఎంత మంచి ఆవు అయినా తనకు తానుగా వచ్చి మనకు పాలు ఇవ్వదు. మనం ఆవు దగ్గరికి పోకుండా, పాలు పితక్కుండా ఇంట్లోనే కూర్చుంటే పాలు మన దగ్గరికి రావు. ఆవుకు మంచి ఆహారం, గడ్డి, నీళ్లు పెట్టాలి.
పాలు పిండే ముందు దూడను ఆవు దగ్గరికి పంపాలి. దూడ కొన్ని పాలు తాగాక మిగిలిన పాలు పితకడానికి మనం దాని దగ్గరికి వెళ్లాలి. అంతేకాదు, అది తన్నే ఆవు అయితే వెనుక కాళ్లను తాడుతో కట్టి పాలు పితకాలి. మనం చేసేది చేస్తూ దైవ సహాయం తీసుకుంటే మరింతగా ఎదుగుతాం. కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా మా భజన బృందంలో చేరు. భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెంచు’ అని సలహా ఇచ్చాడు. ‘నిజమే.. మనవంతు ప్రయత్నం లేకుండా.. ఏదీ జరగదు’ అని గుర్తించిన రైతు చిన్నగా భజన బృందం వైపు నడిచాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821