ఆషాఢం వస్తున్నదంటే అటు మహిళల్లో గోరింటాకు సంబురం, ఇటు రైతుల్లో పంటలు వేసే సమయం, దీక్షాపరులకు చాతుర్మాసానికి అనువైన సందర్భం. వర్షాకాలం ఆరంభంలోనే వచ్చే మాసం ఆషాఢం. హిందూ సంప్రదాయం ప్రకారం ఇది శూన్యమాసమే అయినా ఆధ్యాత్మికంగా పలు దీక్షలకు, సంబురాలకు అనువైన తరుణం కాగా శాస్త్రీయంగా మానవాళి జాగరూకతతో మెలగాల్సిన సందర్భంగా పెద్దలు చెప్తారు. ఆచారవ్యవహారాలకు పెద్దపీట వేసే మన సంప్రదాయంలో ప్రతీ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది.
తొలకరి జల్లులతో ప్రకృతి శోభను అందించే వేళ వచ్చే ఆషాఢంలో శుభకార్యాలకు అవకాశం లేకపోయినా ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. స్థానిక పండుగలతో నెలంతా సందడిగా సాగే ఈ సమయంలో చేసే దానం, స్నానం, జపం, పారాయణం విశేష ఫలితాన్ని ఇస్తాయని పెద్దలు చెబుతారు. చాతుర్మాస్య దీక్షలతో స్వామీజీలు ఈ సమయంలో దీక్షలలో నిమగ్నమవుతారు.
ఇది శూన్యమాసమే కానీ ఈ మాసంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక సంబురమే. ఆషాఢం ప్రారంభంలోనే వారాహి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. వీటితో మొదలయ్యే ఆధ్యాత్మిక సంరంభం మాసం చివరి వరకూ కొనసాగుతుంది. ఆ తర్వాత అతిపెద్ద పండుగగా ఒక్క ఒడిశాలోనే కాకుండా అన్ని రాష్ర్టాల్లోనూ ఆషాఢ శుద్ధ విదియ నుంచి పూరీ జగన్నాథుని రథయాత్ర కోలాహలం మొదలవుతుంది. షష్ఠిరోజు స్కంద వ్రతం చేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలిఏకాదశి అంటారు. ఈ రోజు శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారని, ఈరోజు నుంచి యోగులు చాతుర్మాస్యం ప్రారంభం చేస్తారు.
ఇదే మాసంలో ఆషాఢ పౌర్ణమి వేళ అమ్మవారి ఆలయాలలో కాయగూరలతో అలంకరించి శాకంబరీ ఉత్సవాలు జరుపుకొంటారు. ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాస జయంతిని పురస్కరించుకుని వ్యాస పౌర్ణమిగా, త్రిమూర్తి స్వరూపుడైన గురువును పూజించే గురు పౌర్ణమిగా జరుపుకొంటారు. ఆషాఢ బహుళ సప్తమి భోగ సప్తమిగా చెట్లను పూజించి వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలంటూ పొలాల్లో జాతరలు నిర్వహిస్తారు. ఈ మాసంలోనే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం మొదలవుతుంది. తెలంగాణలో బోనాలు చేసుకునే సమయమిది. సంప్రదాయబద్దంగా భక్తిశ్రద్ధలతో మహంకాళి అమ్మవారి కోసం తయారుచేసే భోజనాన్ని బోనం అంటారు. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు. సమస్త జగత్తుకు కారణమైన అమ్మవారిని అన్నం, బెల్లం, పెరుగు, పసుపు, నీళ్లు, వేపాకులతో కూడిన బోనంతో అర్చించడం తెలంగాణ గ్రామీణ ప్రాంతాలతోపాటు భాగ్యనగరంలోనూ సంప్రదాయంగా వస్తున్నది. వ్యాధులనుంచి తమను రక్షించమని కోరుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకుతెలంగాణ ప్రాంతమంతా సిద్ధమైంది.
ఆషాఢం అంటే కర్షకుడు ఏమరుపాటు లేకుండా ఒళ్లు వంచే కాలం. భారతదేశానికి వెన్నెముక రైతు.. వ్యవసాయాధారిత దేశం కావడంతో అనాదిగా రైతులకు సంబంధించిన సమయాన్ని బట్టే చాలా పండుగలు నిర్ణయమవుతున్నాయి. ఈ సమయంలో రైతులు తమ వ్యవసాయ పనులు మొదలు పెట్టడంతో నెల మొత్తం తీరిక లేకుండా ఉంటారు. ఆషాఢంలో రైతులు సాగుపనుల్లో సందడిగా ఉన్నప్పుడు తమకు సంబంధించిన వ్యక్తిగత సంబురాలను వాయిదా వేస్తారు. అందుకోసమే ఈ సమయంలో వివాహం, గృహప్రవేశం తదితర కార్యాలు చేయరు. కాగా, రైతులు పనులు చేసే సమయంలో వారి ఇంటి మహిళలు నీటిలో చేతులుపెట్టి పనులు చేస్తారు కాబట్టి వారి చేతులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం మొదలైంది. గోర్ల ద్వారా వ్యాధులు సంక్రమించకుండా ఉండేలా రాత్రివేళల్లో గోరింటాకు పెట్టుకోవడం మొదలైంది.
కొత్తగా పెండ్లయిన దంపతులు ఈ మాసంలో దూరంగా ఉండాలనే నియమం తెలుగురాష్ర్టాలతో పాటు కర్ణాటకలోనూ పాటిస్తారు. ఈ మాసమంతా అత్తాకోడళ్లు, అత్తాఅల్లుళ్లు ఒకే గడపలో ఉండకూడదని పెద్దలు చెప్పి ఈనాటికీ నవదంపతులు పాటించేలా సూచిస్తున్నారు. ఇందుకు సాగుపనుల్లో క్షణం తీరికలేకుండా ఉండే సమయం కావడంతో కొత్త అల్లుడికి మర్యాదల విషయంలో లోటు వస్తుందని, మరోవైపు పెండ్లయిన తమ పిల్లలు ఇంటిధ్యాసతో పనులను వదిలేసే పరిస్థితి లేకుండా ఈ నెల రోజులూ పుట్టింటికి నవ వధువులను పంపే ఆచారం వచ్చింది. ఇక్కడ మరో శాస్త్రీయమైన అంశం ఏంటంటే ఆషాఢంలో కొత్త దంపతుల కలయిక వల్ల గర్భం ధరిస్తే చైత్ర, వైశాఖ మాసంలో పిల్లలు పుడుతారు. అంటే ఏప్రిల్, మే నెలల్లో నవజాత శిశువులు, బాలింతలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆషాఢంలో నెలరోజుల పాటు కొత్తజంటలకు ఎడబాటు సూచించేలా ఈ ఆచారం ఏర్పాటు చేశారు పెద్దలు.
ఈ మాసాన్ని శుచిమాసంగా భావిస్తూ ఈ సమయంలో తమ ఇళ్లల్లో ఉన్న కంచు, ఇత్తడి పాత్రలను శుభ్రపరుచుకుంటారు. వీటితో పాటు బంగారు, వెండి ఆభరణాలకు కంసాలి వాళ్లతో మెరుగు పెట్టించుకోవడం కూడా ఇప్పుడే చేస్తారు. ఈ మాసంలో కురిసే తొలకరి వర్షాల కారణంగా నదుల్లో, చెరువుల్లో కొత్త నీరు వచ్చి చేరడంతో అవి తాగి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని పూర్తిగా స్వీయనియంత్రణలో ఉంచుకోమంటూ నియమాలు పాటించడానికి దీక్షా సమయంగా చెప్తారు. మొత్తమ్మీద కర్షకులకు, ఉపాసకులకు, కర్మయోగుల కార్యసాధనకు అనువైన సమయం ఆషాఢం.
– రంగనాథ్ మిద్దెల, 9866573461