రంగడు వెలిసిన పుణ్యధామం పండరీపురం. ఆ పుండరీక వరదుడు కొలువుదీరిన అపర పండరి మన తెలంగాణలోనూ ఉంది. అదే సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాండురంగ ఆశ్రమం. భక్తులకు కొంగుబంగారమై విలసిల్లుతున్న ఆశ్రమం ఇప్పుడు శతకోటి రామనామ సంకీర్తనోద్యమానికి కేంద్రమైంది. ఈ నాదోపాసనలో పల్లెలన్నీ పల్లవిస్తున్నాయి. ఊరూరా ఆధ్యాత్మిక తరంగిణులు ఊరుతున్నాయి. ఒక్క గ్రామంతో మొదలైన భజనోత్సవంలో ఇప్పుడు వంద పల్లెలు భాగమయ్యాయి. రామనామామృతంలో పరవశిస్తున్నాయి.
తెలంగాణ పండరిగా పేరొందిన పాండురంగ ఆశ్రమాన్ని వందేండ్లకు పూర్వం యతివర భావానంద భారతీ స్వామివారు నెలకొల్పారు. శతాబ్దం కిందట స్వామివారు ‘రామనామ’ సంకీర్తన ఉద్యమాన్ని నిర్విరామంగా నిర్వహించారు. స్వామివారి భక్తుడు రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి నేతృత్వంలో వంద భజన సంఘాలు ఏర్పడి, ఆనాడు భక్తి ఉద్యమాన్ని కొనసాగించాయి. తర్వాతి కాలంలో స్వామివారి పూర్వాశ్రమ కుమారుడు మహాత్మ అప్పాల విశ్వనాథ శర్మ ‘భగవత్ సేవా సమాజం’ సంస్థను స్థాపించి నామ సంకీర్తనను కొనసాగించారు. ఆ మహితాత్ములు ఏర్పరచిన దారుల్లో ఇప్పుడు భక్తి ఉద్యమం మళ్లీ పురుడు పోసుకున్నది. లోక కల్యాణం కోసం ఆశ్రమ నిర్వాహకులు సంకల్పించిన ‘శతకోటి హరేరామ నామ జపయజ్ఞం’లో అశేష సంఖ్యలో భక్తులు భాగమవుతున్నారు. జగదేవపూర్ గ్రామంతో మొదలైన సంకీర్తన ఉద్యమం ఇప్పడు వంద ఊళ్లలో నిర్విఘ్నంగా కొనసాగుతున్నది.
ప్రతి ఏకాదశికి సామూహిక నామ సంకీర్తన నిర్వహిస్తున్నారు. ఏకాదశి వేకువ జామునే ఆయా గ్రామాల్లోని భక్తులంతా ఒక్కచోటుకు చేరుకుంటారు. చిరుతలతో కొందరు, తాళాలతో ఇంకొందరు. అందరూ భక్తిభావంతో ‘నగర సంకీర్తన’కు కదులుతారు. ‘హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే॥’ మహామంత్రాన్ని మనోహరంగా ఆలపిస్తూ ముందుకుసాగుతారు. ఊరంతా తిరిగి రాములవారి కోవెల దగ్గరో, అంజన్న ఆలయం దగ్గరో కాసేపు ఆగి భజన నిర్వహిస్తారు. పాండురంగ ఆశ్రమం సంకల్పంతో సిద్దిపేట జిల్లా జగదేవపూర్ నుంచి మొదలైన ‘నగర సంకీర్తనం’ ప్రస్తుతం చేర్యాల, మునిగడప, మర్కూకు, ఎర్రవల్లి, రాజపేట, ప్రజ్ఞాపూర్, దామరకుంట, యాదగిరిగుట్ట, చుంచనకోట, బైరాన్పల్లి ఇలా 100 గ్రామాల్లో కొనసాగుతున్నది. దాదాపు మూడేండ్లుగా సాగుతున్న ఈ భక్తి ఉద్యమంలో ప్రతి ఏకాదశికి ఓ కొత్త గ్రామం వచ్చి చేరుతున్నది. హైదరాబాద్లోని మదీనాగూడలోనూ ప్రతి ఏకాదశికి ‘నగర సంకీర్తన’ జరుగుతుండటం విశేషం. మేఘాలు గర్జిస్తున్నా, ఎముకలు కొరికే చలి ఉన్నా.. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే భక్తులంతా నగర సంకీర్తనకు ఉద్యుక్తులు అవుతారు. రామనామాన్ని మనసారా ఆలపిస్తూ భక్తి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
ఏకాదశి నగర సంకీర్తనకు తోడుగా.. వేలాది మంది ఆశ్రమ భక్తులు నిత్య జపం చేస్తున్నారు. ‘హరేరామ.. హరేకృష్ణ’ మంత్రాన్ని జపం చేసి, ప్రతి రోజూ సాయంత్రానికి జప సంఖ్య నిర్వాహకుల వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తారు. ఇప్పటివరకు జప సంఖ్య 116 కోట్లు పూర్తయింది. శతకోటి సంకీర్తన సంకల్పం.. భక్తుల ఉత్సాహంతో ద్విగుణీకృతమై ద్విశతకోటికి చేరుతున్నది. రానున్న ఫాల్గుణ మాసంలో ఏడు రోజులపాటు జపహోమం నిర్వహించాలని సంకల్పించారు. ఈ భజన ఉద్యమంలో అందరూ భాగస్వాములే. రమ్యమైన రామనామాన్ని మనసారా ఆలపిద్దాం! హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే॥
ఏటా ఆషాఢ శుక్ల ఏకాదశి (తొలి ఏకాదశి) సందర్భంగా పాండురంగ ఆశ్రమంలో ఆషాఢి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో లక్షమంది వరకు భక్తులు ఇక్కడికి వస్తారు. ఏకాదశి నాడంతా భగవన్నామం చేస్తారు. ద్వాదశి నాడు విశేష అన్నదానం జరుగుతుంది. భావానంద స్వామివారి నినాదం ‘నాదం-సాదం’. సదా భగవన్నామం చేయాలన్నది వారి ఆదేశం. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే సాదం. ఆయన సంకల్పం నేటికీ ఆశ్రమంలో కొనసాగుతున్నది. ఆశ్రమంలో నిత్యం అఖండ భగవన్నామం కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులకు అన్నదానం రోజూ జరుగుతూనే ఉంటుంది.