Medaram Jatara | అడవి బిడ్డలే అందరి తల్లులై!
జీవ పరిణామ క్రమం కోతి నుంచి మనిషి దగ్గర ఆగిపోయిందని డార్విన్ సిద్ధాంతం. మనిషి దైవంగా మారడమే నిజమైన జీవ పరిణామ క్రమంగా సనాతన రుషులు అభివర్ణించారు. మానవుడిగా జన్మించి దైవత్వాన్ని పొందిన వారు ఎందరో పురాణాల్లో కనిపిస్తారు.
- ఈ నెల 21-24 మేడారం జాతర
జీవ పరిణామ క్రమం కోతి నుంచి మనిషి దగ్గర ఆగిపోయిందని డార్విన్ సిద్ధాంతం. మనిషి దైవంగా మారడమే నిజమైన జీవ పరిణామ క్రమంగా సనాతన రుషులు అభివర్ణించారు. మానవుడిగా జన్మించి దైవత్వాన్ని పొందిన వారు ఎందరో పురాణాల్లో కనిపిస్తారు. చరిత్రలో వెదికితే.. సామాన్య మనుషులుగా పుట్టి దైవత్వాన్ని పొందిన సమ్మక్క, సారలమ్మ కథ కనిపిస్తుంది. వనసీమలో వెలసిన ఈ తల్లీకూతుళ్లు.. నమ్ముకున్న వారి కోసం నడుం బిగించారు. దురహంకారాన్ని దునుమాడారు. అయిన వారి కోసం అసువులు బాసి దేవతలయ్యారు. మేడారం జాతరకు వేల్పులుగా నిలిచారు. పసుపు, కుంకుమల రూపంలో నేటికీ అనుగ్రహిస్తున్నారు. బంగారంతో వచ్చి శరణు జొచ్చినవారికి బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తున్నారు. జాతర వేళ ఈ వనదేవతల త్యాగాన్ని మరోసారి స్మరించుకుందాం..

Medaram Jatara | నమ్ముకున్న వాళ్ల కోసం ప్రాణార్పణం చేసిన వారిని దేవతలుగా కొలిచే పండుగ మేడారం జాతర. గిరిజనులగా పుట్టి, పెరిగి, వారి కోసమే పోరాడిన సమ్మక్క, సారలమ్మ ఆదివాసీలకు దేవతలు అయ్యారు. కాలక్రమంలో అందరికీ అమ్మలయ్యారు. మనుషులే దేవతలుగా మారిన వైనం జాతరకు కారణం. ఇక్కడ నమ్మకాలే పూజలు. ఆచారాలే ఆరాధనలు. దేవతలు గద్దెల పైకి రావడం ఓ ఉత్సవం. అమ్మలు వచ్చిన వేళ.. జాతరకు పూనకం పుడుతుంది. భక్తితో ఊగిపోతుంది. పారవశ్యంతో పొంగిపోతుంది. టన్నులకొద్దీ బంగారం (బెల్లం) మొక్కులు, రాసుల కొద్దీ కాసుల వర్షం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేండ్ల పండుగకు ముస్తాబైంది. పక్షం రోజుల ముందు నుంచే.. భక్తుల కోలాహలం మొదలైంది. నాలుగు రోజులపాటూ జరిగే అసలు జాతర తెలంగాణ సంస్కృతికి సిసలైన నిర్వచనం చెబుతుంది.
జాతరలో భాగంగా మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువస్తారు. సారలమ్మ గద్దె పైకి రాకముందే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును అటవీమార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండో రోజు సాయంత్రం వడ్డెలు (పూజారులు) మేడారంలోని చిలుకలగుట్ట పైకి వెళ్లి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మకను తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. సమ్మక రాకతో మేడారం పులకించిపోతుంది. మూడోరోజు గద్దెలపై సమ్మక, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఉంటారు. ఇద్దరు అమ్మలున్న నాడు మేడారం భక్తులతో కిక్కిరిసిపోతుంది. నాలుగోరోజు సమ్మకను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.

మేడారం జాతర గిరిజన సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. సమ్మక, సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. రెండు గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక గద్దె, మరొకటి సారలమ్మ గద్దె. ప్రతి గద్దె మధ్యలో ఉండే చెట్టు కాండాలే (కంకమొదళ్లు) వన దేవతలు. దేవతామూర్తులను తోడొని వచ్చే వడ్డెలు (పూజారులు)… తమ పైనుంచి దాటుకుంటూ వెళితే జన్మ సార్థకమవుతుందని భక్తుల నమ్మకం. సమ్మక కుమారుడి పేరుతో ఉన్న జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత గద్దెల దగ్గరికి పోయి అమ్మలను దర్శించుకుంటారు. చాలా మంది మగవాళ్లు అమ్మవారి రూపం(మహిళగా)లో మొహానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడిబియ్యం), ఎదురుకోళ్లు (దేవతను తీసుకు వచ్చేటప్పుడు ఎదురుగా కోళ్లను గాల్లోకి ఎగురవేయడం), లసిందేవమ్మ మొకు (గుర్రం ఆకారపు తొడుగును మొహానికి కట్టుకుని వచ్చి దాన్ని అమ్మవారికి సమర్పించడం) వంటి మొకులు ఇకడ ఉంటాయి.
సమ్మక-సారలమ్మలను దర్శించుకునే భక్తులు వనదేవతలకు మొక్కుగా వారి బరువుకు సమానంగా బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. మేడారం జాతరలో బెల్లమే ప్రసాదం. కోటి మంది వరకు వచ్చే జాతర ప్రాంతం దుమ్ముధూళితో నిండిపోతుంది. ఆరోగ్య సమస్యలు… ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు రాకుండా బెల్లం పనిచేస్తుంది. అందుకే ఇక్కడ బెల్లాన్ని ప్రసాదంగా పెట్టారని గిరిజనులు చెబుతుంటారు. మేడారం జాతర ఆదివాసీలదే. వీరంతా పేదలే కాబట్టి ఇక్కడ కానుకల మొక్కుల సంప్రదాయం లేదు. ఇది అచ్చమైన గిరిజన జాతర. మద్యం, మాంసం ఈ జాతరలో మమేకం. జాతరకు వచ్చే భక్తులకు శుద్ధి, నియమాలు ఉండవు. త్యాగాల తల్లులను కొలిచే మేడారం జాతరకు ప్రతి మహిళా రావచ్చు. అంటు, ముట్టు అనే పదాలు ఇకడ చెల్లవు.
– పిన్నింటి గోపాల్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

