ఒకానొక వ్యాపారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ‘నాకు డబ్బు అవసరముంది. ఈ బంగారు నగ ఉంచుకొని కొంత డబ్బు ఇవ్వండి. నెలరోజుల్లో డబ్బు చెల్లించి నగను తీసుకువెళ్తాను’ అన్నాడు. వ్యాపారి డబ్బు ఇవ్వడానికి తటపటాయించాడు. అతను ఎంతగానో ప్రాధేయపడటంతో డబ్బు ఇవ్వడానికి అంగీకరించాడు. అయితే ఏడాది గడిచినా నగ తాకట్టు పెట్టిన వ్యక్తి తిరిగి రాలేదు.
లాభం లేదనుకొని ఆ నగను తీసుకొని పట్టణానికి వెళ్లాడు వ్యాపారి. బంగారం దుకాణానికి వెళ్లి నగను అమ్మజూశాడు. కానీ, దుకాణ యజమాని దానిని పరీక్షించి.. ‘ఇది పుత్తడి కాదు.. ఇత్తడి’ అనడంతో వ్యాపారి కంగుతిన్నాడు. చేసేది లేక నిరాశతో ఇంటిముఖం పట్డాడు. ఏడాదిపాటు తన బంగారు నగలతోపాటు దాచి ఉంచిన ఆ గిల్టు నగను పాత సామాన్ల పెట్టెలో పడేశాడు వ్యాపారి.
మన స్థానాన్ని మనమే నిర్ణయించుకుంటాం. మనం పుత్తడి మనుషులమో, ఇత్తడి మనుషులమో మన ప్రవర్తనే నిర్ణయిస్తుంది. ‘మాటమీద నిలబడేవారు పుత్తడి లాంటి మనుషులు. మాట తప్పేవారు ఇత్తడి మనుషుల’ని ఉలేమాలు పైకథను చెబుతుంటారు. మాట ఇచ్చి నిలుపుకోకపోవడం, చేసిన అప్పు తీర్చకుండా ఎగ్గొట్టడం అల్లాహ్ శాపానికి కారణాలు అవుతాయని ముహమ్మద్ ప్రవక్త (స) హెచ్చరించారు.
ఇలాంటివారికి పరలోకంలోనే కాదు, లౌకిక జీవితంలోనూ ఎలాంటి విలువా ఉండదు. మాటకు కట్టుబడే వ్యక్తులంటే అల్లాహ్కు ఎంతో ఇష్టమని ఖురాన్ పేర్కొన్నది. ‘మాట ఇచ్చి, తరువాత బొంకేవాడు ధర్మం లేనివాడ’ని ప్రవక్త తరచూ చెప్పేవారు. స్వర్గప్రవేశం చేసేవారిలో వాగ్దానానికి కట్టుబడేవారే ఉంటార’ని ఖురాన్ పేర్కొంటున్నది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఒప్పందం జరిగినప్పుడు దానిని తప్పకుండా నెరవేర్చాలన్నది ప్రవక్త బోధన.
…?ముహమ్మద్ ముజాహిద్, 96406 22076