అసలు దేవుడు ఉన్నాడా?… ఉంటే ఈ చర్మచక్షువులకు కనిపిస్తాడా? అన్న సందేహాలతో తపించిపోతున్న పద్దెనిమిదేళ్ల యువకుడు అతను. ఏ మేధావి కూడా ఆయనకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వటం లేదు. చివరకు ఆ నోటా, ఈ నోటా ఓ ఆలయపూజారి పేరు వినిపించింది; వారు ఎలా స్పందిస్తారో చూద్దామని, ఆ యువకుడు పరీక్షగా వెళ్లాడు. అందరినీ అడిగినట్లే ‘మహాశయా! మీరు భగవంతుడిని చూశారా?’ అని ప్రశ్నించాడు. ఆ మహాచార్యులు చాలా స్పష్టంగా, చాలా దృఢంగా ‘చూశాను! నిన్ను చూసినంత స్పష్టంగా చూశాను! విశ్వాసముంటే నీకు కూడా చూపగలను!’ అన్నారు. ఆ విధాత ఉనికిని స్వానుభవ అనుభూతితో చెప్పగలిగిన గురువరేణ్యులు దొరికారని ఆ యువకుడు సంతృప్తిచెందాడు. తదనంతరం ఒకరినొకరు ఎన్నో విధాలుగా పరీక్షించుకున్నారు. తుట్టతుదకు మానవాళి చరిత్రలోనే అనుపమానమైన, అజరామరమైన గురుశిష్యులుగా ప్రతిఫలించారు. ఆ యువకుడే స్వామి వివేకానంద; ఆ గురుదేవులే శ్రీరామకృష్ణ పరమహంస.
భారతీయ ఆధ్యాత్మిక సంపదను. సనాతన ధార్మికవారసత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన యుగపురుషుడు స్వామి వివేకానంద. వేల వత్సరాల భారతీయ సనాతన జ్ఞానతేజానికి ప్రతీక. అలాంటి ప్రవక్త కలకత్తాలో 1863 జనవరి 12న విశ్వనాథ దత్తా, భువనేశ్వరీదేవి అనే దంపతులకు పుణ్యఫలంగా జన్మించారు. నరేంద్రనాథ్ దత్తగా ఈ ప్రపంచానికి పరిచయమైన ఆ యువకుడు బాల్యం నుంచే విశేష లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు. తన పద్దెనిమిదవ ఏట భగవదన్వేషణలో భాగంగా దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణ పరమహంస కడకు చేరారు. అలా ఆ పరమాచార్యుల అవతార లక్ష్యానికి ప్రధాన ఉపకరణంగా నరేంద్రనాథ్ తనను తాను మలచుకున్నారు. స్వామి వివేకానందగా లోకానికి
ప్రసిద్ధులయ్యారు.

శ్రీరామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక వారసత్వానికి, సాధనాసంపత్తికి ప్రధానవారసుడిగా వివేకానంద పరిపూర్ణతను సంతరించుకున్నారు. ఆ గురువరేణ్యులు మహాసమాధికి ముందు తన శక్తినంతా స్వామీజీకి ధారపోసి ‘నా నుంచి సంక్రమించిన ఈ శక్తిసంపత్తుల ద్వారా నువ్వు మహోన్నత కార్యాలను నిర్వహించగలుగుతావు’ అని ఆశీస్సులందించారు. అలా ఆ జగద్గురువుల ఆశీర్వచనాలతో స్వామి వివేకానంద.. తదనంతర కాలంలో తన ఆధ్యాత్మిక జైత్రయాత్రను ఆరంభించారు. ఒక్కమాటలో చెప్పాలంటే శ్రీరామకృష్ణ పరమహంస మూలవిరాట్టు అయితే; స్వామి వివేకానంద ఆ శక్తిని పరివ్యాప్తం చేసే ఉత్సవ విగ్రహమని నిర్వచించుకోవచ్చు. పరివ్రాజక సన్యాసిగా భారతావని నాలుగు చెరగులా పర్యటించారు. భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస మహాభినిష్క్రమణ అనంతరం శ్రీశారదాదేవి మార్గదర్శకత్వంలో స్వామి వివేకానంద ఆధ్యాత్మిక శిఖరంగా ఎదిగారు.
ఆ నేపథ్యంలో 1893 సెప్టెంబరు 11న చికాగో సర్వమత మహాసభ స్వామి వివేకానంద ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. మహర్షులు వరప్రసాదమైన భరతభూమి ధార్మిక, ఆధ్యాత్మిక సంపదకు ప్రతినిధిగా ఆనాడు స్వామీజీ చేసిన ప్రసంగం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒకేఒక్క రోజులో ఆయన పేరు ప్రపంచ పత్రికలన్నింటిలో మారుమోగిపోయింది. ఆ క్షణం నుంచి స్వామి వివేకానంద వ్యక్తి కాదు, ఒక శక్తి అని తేటతెల్లమైంది. ఆ రోజు ప్రారంభమైన ఆ మహాపురుషుడి ప్రసంగ పరంపర అప్రతిహతంగా కొన్నేళ్ల పాటు దేశ, విదేశాల్లో ప్రతిధ్వనించింది. ఆ ధీరవాణి మూమూలు ప్రజానీకాన్నే కాదు మేధావి వర్గాన్ని కూడా కదలింప చేసింది.
అటు ధార్మికవేత్తలనే కాదు; దేశభక్తులను, సామాజికవేత్తలతోపాటు సామాన్య జనులను కూడా జాగృతపరిచింది వివేకవాణి. సిద్ధాంతపరంగా భిన్నధృవాలుగా కనిపించే గాంధీజీ, నేతాజీలు కూడా స్వామీజీ వచనాలకు ప్రభావితులైనవారే! అందుకే మహాత్మాగాంధీ ‘వివేకానంద సాహిత్యాన్ని చదివిన తరువాత నా మాతృదేశం పట్ల నాకున్న ప్రేమ వెయ్యిరెట్లు అధికమైంది’ అన్నారు. ఆధునిక భారతదేశ రూపురేఖల్ని దర్శించి, నవతరంపై కోటి ఆశలు పెంచుకున్న స్వామి వివేకానంద, ఈతరానికి మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పారు. ముక్కోటి దేవతలపై మీకు విశ్వాసం ఉన్నా, మీపై మీకు విశ్వాసం లేకపోతే మిమ్మల్ని ఎవరూ ఉద్ధరించలేరని హెచ్చరించారు. ‘లేవండి… మేల్కొనండి… గమ్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి’ అంటూ భావిభారత పౌరులను తన ధీరవాణితో మేల్కొలుపుతూనే ఉన్నారు.
మతాన్ని, వేదాంతాన్ని ఆధ్యాత్మికతను ఆలంబనగా చేసుకొని భారతదేశ పునరుజ్జీవనానికి పునాదిని వేశారు. యావత్ ప్రపంచం కూడా ఆ మార్గాన్ని అనుకరించి, అనుసరించే రీతిలో సుసంపన్నం చేశారు. సైద్ధాంతిక మౌఢ్యం, మూఢవిశ్వాసాలు, సంకుచిత భావనలు నిండుకున్నది ‘మతం’ కాదని; విశాలత్వం, పవిత్రత, పరమత సహనమే నిజమైన ఆధ్యాత్మికత అని సౌభ్రాతృత్వాన్ని పెంచేదే మతమని ప్రపంచానికీ పునరుద్ఘాటించారు. ఆయన భావనలు నాటికి, నేటికే కాదు భవిష్యత్కాలాలలో కూడా జనావళికి కరదీపికలై దారిచూపుతాయి. అందుకే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘భారతదేశాన్ని గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానందని చదవండి చాలు; ఆయనలో అన్నీ ఆశాజనక భావనలే, నిరాశవాదమన్న మాటే లేదు’ అంటారు.
ఆ స్ఫూర్తితో భారతీయ సన్యాస వ్యవస్థకు ఒక సంఘాన్ని రూపకల్పన చేయాలన్న సంకల్పంతో స్వామి వివేకానంద తన గురుదేవుల పేరుతో ఓ సన్యాస సంఘాన్ని స్థాపించదలచారు. మతానికి, మోక్షానికి సరికొత్త నిర్వచనాన్నిస్తూ ‘ఆత్మనోమోక్షార్థం జగతీహితాయచ’ అంటూ, సాటి మానవుడికి సేవ చేసి తరిస్తూ, ఆ మార్గంలోనే మోక్షాన్ని ప్రాప్తించుకోమన్నారు. ఇదే ఉద్దేశంతో తన చికాగో చారిత్రక ఉపన్యాసం అనంతరం అక్కడి నుంచి భారతదేశంలోని మైసూరు మహారాజుకు ఉత్తరం రాస్తూ స్వామి వివేకానంద ‘ఈ జీవితం అత్యల్పం; ఇందులోని మన కీర్తిప్రతిష్ఠలన్నీ అశాశ్వతం. పరుల కోసం జీవించే వారే నిజంగా జీవించినట్లు; ఇతరులంతా జీవన్మృతులతో సమానమే’ అంటారు. ఆ నినాదంతోనే 1897లో రామకృష్ణ సంఘాన్ని స్వామీజీ స్థాపించారు.
వేలాది మంది త్యాగమూర్తులు తమ జీవితాన్ని జీవారాధనలో తరింపచేసుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించారు. సామాజిక సేవతో మమేకమై ఆధ్యాత్మికోన్నతికి పాటుపడే అరుదైన ఆ సన్యాస సంఘం నేడు ప్రపంచవ్యాప్తంగా 170 పై చిలుకు శాఖోపశాఖలతో వర్ధిల్లుతున్నది. ఇలా తన ధీరవచనాలతో నాటికీ, నేటికీ, ఏనాటికీ అదృశ్యశక్తిగా ఉత్తేజాన్ని ఇచ్చినా… ఇస్తున్న ఆ మహాప్రవక్త 39వ ఏటనే భౌతికంగా తన తనువును చాలించారు. ‘చినిగిన వస్ర్తాన్ని వదిలి పారవేసినట్లు, ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టవచ్చు; కానీ నా ఆత్మ అక్షరాల రూపంలో మీకు అండగానే ఉంటుంది, మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూనే ఉంటుంది’ అంటూ అభయమిచ్చిన స్వామి వివేకానంద ఆశయాలను ఆచరణలో ప్రతిఫలింపజేయటమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.
– నరేశ్ చనమల 95054 56125