ప్రతీ ముస్లిం సమాజమనే నిర్మాణంలో ఇటుక లాంటి వాడు. అందుకే దైవ ప్రవక్త (సల్లం) విశ్వాసులు పరస్పర కట్టడం లాంటి వారని… వారు ఒకరికొకరు ఊతంగా, ప్రేమ-వాత్సల్యాలు కలిగి ఉంటారని తెలిపారు. నిజానికి వారంతా ఒక శరీరం లాంటివారు. అందులో ఏ అవయవానికి దెబ్బ తగిలినా మిగతా శరీరమంతా బాధను అనుభవిస్తుంది. ప్రతి ముస్లిం తోటి ముస్లింలపై ప్రేమాభిమానాలతో పాటు దయ చూపి, వారికి అవసరమైన సహకారం అందించాలి. నమాజ్‌కు సారథ్యం వహించే వ్యక్తి అక్కడున్న వారిలో పిన్నలు, వ్యాధిగ్రస్తులు, ముసలివారు ఉంటే వారిని దృష్టిలో పెట్టుకొని నమాజును సంక్షిప్తంగా చేయించాలి. తన అనుచరుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్విరామంగా ఉపవాసాలు పాటించొద్దని వారిని ఆదేశించారు. ప్రతి ముస్లిం తాను తోటి ముస్లింకు సోదరుడినని భావించాలి. ఇలాంటి భావన ఉన్నవారు పరస్పరం ఒకరి అవసరాల్లో ఒకరు సహకరించుకొంటారని దైవప్రవక్త(స) ఏనాడో చెప్పారు. తోటి ముస్లింకు వచ్చిన కష్టాన్ని తొలగించిన వారికి ప్రళయ దినాన వచ్చే కష్టాన్ని అల్లాహ్ తొలగిస్తాడు.
కాబట్టి దైవ ప్రవక్త ఆదేశాల మేరకు ముస్లింలందరూ ఒకరిపై ఒకరు దౌర్జన్యానికి, మోసానికి పాల్పడకుండా స్నేహ సహకారాలతో కలిసిమెలిసి ఉండాలి. తోటి ముస్లింలను ఎన్నడూ నిస్సహాయ స్థితిలో వదిలేయకూడదు. ‘నీ సోదరుడు దౌర్జన్యం చేసేవాడైనా, పీడితుడైనా అతనికి సహాయం చెయ్యి’ అని ప్రవక్త ఆదేశించారు. అంటే దౌర్జన్యం చేసే వ్యక్తిని ఆ పని చేయకుండా ఆపడమే మనం అతడికి చేసే సాయం కావాలనేది ఆయన బోధన పరమార్థం. సలాం చెప్పిన వారికి ప్రతి సలాం చేయడం, మన పరిచయస్తుల్లో రోగాలతో బాధపడుతున్న వారిని పరామర్శించడం, తెలిసిన వ్యక్తి శవయాత్రకు హాజరవడం, ఆప్తుల శుభకార్యాల ఆహ్వానాలను అంగీకరించడం, తుమ్మినప్పుడు ఇస్లాం సూచించిన జవాబు చెప్పడం, ఇతరులు మన మంచిని ఆశిస్తే తిరిగి వారి బాగును కోరుకోవడం ప్రతి ముస్లింకు ఉన్న ఆరు హక్కులు. ఇవి ముస్లింల మధ్య ప్రేమానుబంధాలను బలోపేతం చేస్తాయి.