తిరుమల : భక్తుల సౌకర్యార్ధం టీటీడీ ( TTD ) కల్పిస్తు్న్న నెలవారి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల తేదీని ప్రకటించింది. మూడు నెలల ముందుగా విడుదల చేసే ఆగస్టు టికెట్ల కోటాను ( August Quota ) ఈనెల 18న ఉదయం ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నామని, ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం ఈనెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు వివరించారు. లాటరీలో ఎంపికైన భక్తులు ఈ నెల 20 నుంచి 22 వ తేదీ మధ్యాహ్నంలోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని వెల్లడించారు.
ఈనెల 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్స ఏవ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు వాటి దర్శణ స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తామన్నారు. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం కోటా, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శన కోటా విడుదల చేస్తామన్నారు.
ఈనెల 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తామని వివరించారు. భక్తులు http://ttdevasthanams.ap.gov.in/ వెబ్సైట్లో మాత్రమే సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు.