Srisailam | ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైల పుణ్యక్షేత్రంలో వివిధ అభివృద్ధి పనులకు ఆలయ ట్రస్ట్‌బోర్డు సమావేశం ఏకగీవ్రంగా ఆమోదించింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి (Chairman Chakrapani Reddy ) అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 28 ప్రతిపాదనలకు ఆలయ ట్రస్ట్‌బోర్డ్(Trust Board) ఆమోదం తెలుపగా ఒకటి తిరస్కరణ, మరొక అంశాన్ని వాయిదా వేసింది. భక్తుల వసతి కోసం గణేశ సదనం వద్ద రూ. 52 కోట్లతో 200 గదుల వసతి నిర్మాణపు పనులకు ఆమోదం తెలిపింది. రూ. 39లక్షల అంచనాతో శిఖరేశ్వరస్వామి ప్రహారీగోడను పెంచి బండపరుపు తదితర అభివృద్ధి పనులు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది.
శిఖరేశ్వర ఆలయం వద్ద ఆర్చ్‌గేట్, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు, పలు చోట్ల రూ. 29 లక్షలతో సీసీ రోడ్లు , రూ. 38.50 లక్షలతో ప్రీకాస్ట్ సెంటర్ డివైడర్లు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు రాజుల సత్రం వద్ద నుంచి సిద్దరామప్ప పాదాల వరకు బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదనకు సమావేశం ఆమోదం తెలిపింది.
మల్లికార్జున సదన్ నుంచి టోల్గేట్ వరకు, టోల్గేట్ నుంచి రామయ్య టర్నింగ్ వరకు ఫ్లై ఓవరు బ్రిడ్జి ఏర్పాటుకు , రహదారి విస్తరణకు ఆమోదం తెలిపింది . మహాశివరాత్రి , ఉగాది పండుగల సందర్భంగా ఆయా సివిల్, ఎలక్ట్రికల్, జనరల్ పనుల కోసం రూ.10.50 లక్షలు, కల్యాణకట్ట మరమ్మతులు, అభివృద్ధి పనులకు రూ. 13 లక్షలు ఖర్చు చేయనున్నట్లు ధర్మకర్తల మండలి వెల్లడించింది . ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, సభ్యులు పాల్గొన్నారు.