Sri Ramanavami Special | మన నాగరికతకు మార్గదర్శకంగా నిలిచిన పురాణాల్లో రామాయణం ఒకటి. ఏడు వేల పైచిలుకు సంవత్సరాల నుంచీ మన జీవితాలను రాముడు ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. ఈ దేశానికి రాముడు సాంస్కృతిక, ఆధ్యాత్మిక చిహ్నం. ఆయన చేపట్టిన ప్రతి కార్యంలోనూ స్థిరత్వం,సమతుల్యత, శాంతి, సత్యం, ధర్మం, కరుణ, న్యాయం నిబిడీకృతం. భారత స్వాతంత్య్రసంగ్రామంలో కూడా మహాత్మా గాంధీ ‘రామరాజ్య’ నినాదాన్ని వినిపించాడు.
రాముడి జీవితంలో అన్నీ విపత్తులే. సింహాసనాన్ని అధిష్ఠించడానికి సకల అర్హతలూ ఉన్నా, రాజ్యాన్ని కోల్పోయాడు. అడవికి వెళ్లాడు. అక్కడ భార్య సీత అపహరణకు గురైంది. ఆమెను తిరిగి పొందడానికి యుద్ధం చేశాడు. సీతతో అయోధ్యకు తిరిగి వచ్చాక కూడా సంతోషం దక్కలేదు. నిందలను ఎదుర్కొని ఇల్లాలిని అడవులకు పంపాడు! పట్టపురాణి సీతమ్మ కారడవిలో బిడ్డలకు జన్మనివ్వాల్సి వచ్చింది. ఇది చాలదన్నట్టు.. వారెవరో తెలియక, రాముడు తన సొంత పిల్లలతో యుద్ధం చేశాడు. ఆపై సీత భూమిలో కలిసిపోయింది. స్పష్టంగా, ఇది ఒక విపత్తుల పరంపర. ఎన్ని వైఫల్యాలు ఎదురైనా హుందాగా, ధైర్యంగా,స్థైర్యంగా వ్యవహరించి మనందరికీ ఆదర్శంగా నిలిచాడు రాముడు.
వేల ఏండ్ల కిందట పాలకులంటే ఆక్రమణదారులే. అలాంటి కాలంలో రాముడు ఆదర్శవంతమైన మానవత్వాన్నీ, త్యాగాన్నీ, న్యాయాన్నీ ప్రదర్శించాడు. ఆయనను మనమంతా గౌరవిస్తున్నది బాహ్య ప్రపంచాన్ని జయించినందుకు కాదు, అంతర్ముఖ జీవితంలో విజేత అయినందుకు. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా స్థిరత్వాన్ని కోల్పోలేదు. చివరికి రావణ సంహార సమయంలోనూ విర్రవీగలేదు. ఆ వీరుడి మృతదేహం దగ్గరి నిలబడి అతడిని చంపాల్సి వచ్చినందుకు పశ్చాత్తాపం చెందాడు. ఎన్ని సవాళ్లు ఎదురైనా మానసిక సమతౌల్యం కోల్పోలేదు. ద్వేషాన్ని, పగను పెంచుకోలేదు. రాజకీయ అవసరాల కోసం నైతికతను విడిచిపెట్టలేదు. రాజ్యాభిషిక్తుడు అయ్యాక కూడా, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. ప్రజల కోసం తన సొంత ఆనందాన్ని త్యాగం చేస్తూ, మార్గదర్శకంగా నిలిచాడు. రాముడు న్యాయానికి, ధర్మానికి నిదర్శనంగా ఉండటం వల్లే రామరాజ్యం ఆదర్శప్రాయమైంది. దేశాన్ని రామరాజ్యంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిదీ. ధర్మ, న్యాయ ప్రతిష్ఠాపనే రామరాజ్యానికి భూమిక.
ప్రేమాశీస్సులతో..
సద్గురు ఈశా ఫౌండేషన్
“Sri Ramanavami Special | శ్రీ రామతత్వమ్ మనకు ఏం బోధిస్తున్నది?”
“శివుడు- విష్ణువు ఒకటే.. వారిద్దరినీ ఎందుకు కలిపి చూడాలో చెప్పే సందర్భాలివే..”
జపం చేసేటప్పుడు జపమాలను చూపుడు వేలుతో ఎందుకు తిప్పకూడదు?