ఆదరేణ యథా స్తౌతి ధనవన్తం ధనేచ్ఛయా
తథా చే ద్విశ్వకర్తారం కో న ముచ్యేత బంధనాత్
(వరాహోపనిషత్తు 3-13)
ధనం కోసం ధనవంతుని ఎంతో ఆదరంతో ఎలా స్తుతిస్తారో అలాగే జగత్కర్తయైన పరమాత్మను స్తుతిస్తే ఎవరు బంధాలనుంచి విముక్తుడు కాకుండా ఉంటారు?.. అని పై శ్లోకానికి భావం. కవులు ఏవేవో రాస్తుంటారు. దేవుళ్లను స్తోత్రం చేస్తూ ఉంటారు. ఇదంతా ఏదో కాలక్షేపం కోసమే కదా! అనేవాళ్లు పై శ్లోకాన్ని పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది. కవులు రాసే స్తోత్రాల వల్ల కలిగే మహత్ ప్రయోజనం ఏమిటో అవగతమవుతుంది. స్తోత్ర ప్రియుడైన పరంధాముడు భక్తుల బంధాలన్నీ తొలగించగలడు.
పదకవితా పితామహుడైన అన్నమయ్య భక్తి సంకీర్తనలకు ప్రజలు ముగ్ధులయ్యేవారు. ఆయన కీర్తి ఆనాటి ప్రభువైన సాళువ నరసింహరాయల దాకా పాకింది. రాజు.. అన్నమయ్యను తన ఆస్థానానికి రప్పించుకున్నాడు. పాట పాడమన్నాడు. ‘ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను’ అనే శృంగార కీర్తనను.. భక్తి రసభరితంగా ఆలపించాడు అన్నమయ్య. రాజు పరవశించిపోయి తన మీద కూడా ఒక కీర్తన పాడమన్నాడు. తన జిహ్వ వెంకటరమణుని తప్ప మరొకని కొనియాడదన్నాడు అన్నమయ్య.
రాజు కోపించి, అన్నమయ్యను చెరసాలలో బంధించాడు. బాధాతప్త హృదయంతో అన్నమయ్య కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ‘ఆకటి వేళల అలుపైన వేళల తేకువ హరినామమే దిక్కు.. మరి లేదు’ అనే కీర్తన ద్వారా తన మనోవేదన అంతా స్వామికి నివేదించుకున్నాడు. తక్షణమే అత్యాశ్చర్యకరంగా అందరూ చూస్తుండగానే అన్నమయ్య సంకెళ్లు పుటపుటమంటూ తెగి పడిపోయాయి. రాజు పశ్చాత్తాపంతో పరమ భాగవతోత్తముడైన అన్నమయ్య పాదాలపై పడి శరణు వేడుకున్నాడు. అనేక జన్మలుగా కొనసాగి వస్తున్న భవబంధాల నుంచే జీవుని విడిపించగలిగే పరంధాముని కరుణా కటాక్షాలు.. అన్నమయ్య మామూలు సంకెళ్లను విడిపించడంలో నిజానికి ఆశ్చర్యం ఏమున్నది?
– డా.వెలుదండ సత్యనారాయణ