సంభాషణలే మన ఆలోచనలను తీర్చిదిద్దుతాయి. అయితే, మనకు తెలియని ప్రపంచం మౌనంలో, నిశ్శబ్దంలో ఉందనే సంగతిని మనం గమనించం. ఇక మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. మౌనం అనేది మనల్ని మన మనసులో గూడుకట్టుకుపోయిన భావాలను గమనించేలా చేస్తుంది. అలా మన ఆలోచనల్ని పరిశీలిస్తున్న కొద్దీ అవి మన భావోద్వేగాల్ని ఎలా ప్రేరేపిస్తున్నాయో, మన ప్రవర్తనను ఎలా నడిపిస్తున్నాయో తెలుస్తుంది.
మన అంతరంగంలోకి మనం తొంగిచూసుకుంటే లోలోతుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికివస్తుంది. మౌనం ద్వారానే మన చెవులు వినలేని దానిని మనం వినగలుగుతాం. కాబట్టి, కేవలం మాట్లాడకపోవడమే మౌనం కాదు. మన అంతరంగాన్ని వినడం అలవాటు చేసుకుంటే మౌనం గొప్పతనం నెమ్మదిగా అర్థమవుతుంది. అది మనల్ని విశ్వ సందేశాన్ని వినేలా చేస్తుంది.