Vaikunta Ekadashi | కొల్లాపూర్, ఆధ్యాత్మిక చరిత్రలో ప్రతిరోజు ఓ ప్రత్యేకత ఉంటుంది అలాంటిది ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తున్న కాలంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి చాలా పురాతన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నది. ప్రతి ఏడాది ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున రాక్షసులు ద్వార పాలకులుగా ఉన్న ఉత్తర ద్వారం ద్వారా మహావిష్ణువును దర్శించుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణ గాథల ద్వారా తెలుస్తుంది.
పద్మ పురాణం గాథ ద్వారా వైకుంఠ ఏకాదశి విశిష్టత తెలుస్తుంది. పూర్వం మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు వీరు బ్రహ్మ దేవుడి వద్ద నుంచి వేదాలను తస్కరించి సముద్ర గర్భంలో దాక్కున్నారు. వేదాల ద్వారా లభించిన శక్తి సామర్థ్యాలతో ముక్కోటి దేవతలను సముద్ర గర్భంలో దాక్కుని ముప్పు తిప్పలు పెట్టారు. ఆ రాక్షసుల వేధింపులు భరించలేక శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకున్నారు. శ్రీ మహా విష్ణువు రాక్షసగణాన్ని ఓడించేందుకు సుదీర్ఘ కాలం పాటు యుద్ధం చేసి ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తున్న వేళలో ధనుర్మాసంలోని శుక్లపక్షం రోజైన ఏకాదశి రోజు మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులను సంహరించే సమయంలో శ్రీ మహా విష్ణు నిజరూప దర్శనం చూసిన ఆ రాక్షసులు తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడ్డారు.
పశ్చాత్తాప పడిన రాక్షసులకు శ్రీ మహావిష్ణువు ఒక వరం ప్రసాదించగా ఏకాదశి నాడు ఏ ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చి మాకు దర్శనమిచ్చారో, అదే ద్వారం గుండా ఈ రోజున మిమ్మల్ని దర్శించుకునే భక్తులందరికీ పునర్జన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు. ఆ రోజు నుంచి ఏకాదశి నాడు ఆలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచడం ఆచారంగా మారింది. ఆ రాక్షసులిద్దరూ స్వామివారి ఉత్తర ద్వారానికి ద్వారపాలకులుగా మారి వైకుంఠంలోనే ఉండిపోయారని పద్మ పురాణం ద్వారా తెలుస్తున్నది. అందుకే ఉత్తరం అనేది ఆధ్యాత్మిక భావనలో ఉన్నతమైనదని అర్థం ఉన్నది. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు మళ్లీనా ఉత్తర ద్వారనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తెలియజేస్తున్నది.
ఉత్తర ద్వార దర్శనం చేసుకునే రోజును వైకుంఠ ఏకాదశిగా కూడా భక్తులు పిలుస్తారు. ఉత్తర ద్వారం గుండా వెళ్లి మహావిష్ణువు అవతారాలను దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతలను దర్శనం చేసుకున్న ఫలితం దక్కుతుందనే విశ్వాసం కూడా ఆధ్యాత్మిక భావనలో ఇమిడి ఉన్నది