Akshaya Tritiya | హిందూమతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని మూడో తదియ తిథి రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అక్షయ తృతీయను అఖా తీజ్‌గా పిలుస్తుంటారు. ఈ సారి ఈ నెల 30న అక్షయ తృతీయ వస్తున్నది. హిందువులకు ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ రోజున బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసిన సంపద, ఆస్తిపాస్తులు ఎప్పటికీ మనతోనే ఉంటాయని.. దాంతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారని విశ్వాసం. ఈ క్రమంలోనే బంగారం దుకాణాల వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్, మేకింగ్ చార్జీలపై ఆఫర్స్‌ను ప్రకటించే విషయం తెలిసిందే.
సంస్కృతంలో ‘అక్షయ’ అంటే శాశ్వతమైంది.. క్షయం లేనిదని అర్థం ఉన్నది. ఇక తృతీయ అంటే మూడో తిథి అని అర్థం. అక్షయ తృతీయ రోజున ఏ పని ప్రారంభించినా.. చిన్న పెట్టుబడి పెట్టినా అనంతమైన శ్రేయస్సుతో పాటు అదృష్టాన్ని తీసుకువస్తుందని ప్రజల విశ్వాసం. బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తుంటారు. వాస్తవానికి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనే నిబంధన లేదు. ఈ క్రమంలో ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తున్నది. బంగారాన్ని సంపదకు, భద్రతకు చిహ్నంగా భావించి కొనుగోలు చేస్తూ వస్తుంటారు. బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే కుటుంబంలో సంపద, సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. ఇదిలా ఉండగా.. అక్షయ తృతీయకు పౌరాణికంగానూ ఎంతో ప్రాధాన్యం ఉంది. నాలుగు యుగాల్లో రెండోదైన తేత్రాయుగం ఈ రోజునే ప్రారంభమైందని ఓ నమ్మకం. శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించింది సైతం ఇదే రోజునని.. మహాభారతాన్ని రచించిన వేదవ్యాస మహర్షి.. గణేశుడికి మహాభారతాన్ని చెప్పడం మొదలుపెట్టింది సైతం ఇదే రోజునేనని చెబుతుంటారు. శ్రీకృష్ణుడు చిన్నతనంలో తన మిత్రుడైన కుచేలుడిని కలిసింది కూడా అక్షయ తృతీయ రోజునేనని చెబుతుంటారు. పవిత్ర గంగానది సైతం భూమి పైకి వచ్చింది ఇదే రోజునని హిందువుల విశ్వాసం. అలాగే, పాండవుల వనవాసం సమయంలో వారికి చాలా ఆకలి వేస్తుంది. అప్పుడు సూర్య భగవానుడిని ప్రార్థించి తమకు ఆహారం కావాలని కోరుతారు. అప్పుడు సూర్య భగవానుడు వారికి ఒక అక్షయపాత్రని ఇస్తాడు. పాండవులు వారికి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు అక్షయపాత్రను పూజించగానే ఆహారం అందిస్తుందనేది నానుడి.
అక్షయ తృతీయ రోజున పలువురు ఉపవాసం ఉంటూ వస్తారు. మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. పసుపు, కుంకుమలతో కలిపిన అక్షతలను స్వామికి సమర్పిస్తారు. విష్ణువు, గణపతికి నైవేద్యం సమర్పిస్తారు. సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని పూజించడం సైతం శుభప్రదంగా భావిస్తారు. అత్యంత శుభపద్రంగా పరిగణించడం వల్ల అనేక మంది బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. వివాహాలకు అనుకూలమైందిగా భావిస్తారు. అలాగే, దానధర్మాలు చేస్తుంటారు. పేదలకు ధాన్యం, వస్త్రాలు, ఇతర నిత్యావసర వస్తువులను దానం చేయడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే, అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్, అల్యూమినియం పాత్రలు, ఇనుప వస్తువులు, నలుపు రంగు దుస్తులను కొనుగోలు చేయొద్దని పండితులు సూచిస్తున్నారు. అలా చేస్తే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని.. గ్రహ, వాస్తు దోషాలు పెరుగుతాయని చెబుతున్నారు. అలాగే, శుభ్రత పాటించాలని.. అప్పులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.