అనాదిగా ఉన్నవాడు శివుడు… ఆదిదేవుడు. నిరాకారంగా ఆయన ఈ సృష్టి అంతా నిండి ఉన్న స్థాణువు. సాకారంగా చూద్దామంటే.. ఆద్యంతాలు లేని మహాలింగమూర్తిగా ఆవిర్భవిస్తాడు. శివయ్య రూపంలోనే ఇంత వైవిధ్యం ఉంటే.. ఆ మహాస్వామి తత్త్వం అంతుచిక్కని రహస్యం కాక మరి ఏమవుతుంది. ఆ మర్మాన్ని బ్రహ్మ ఛేదించలేకపోయాడు. విష్ణుమూర్తి తన వల్ల కాదని ఊరుకున్నాడు. చివరికి ఆ చిదానంద మూర్తి చిద్విలాసంగా తానేంటో చెప్పి లోకాన్ని అనుగ్రహించాడు. ఆ సచ్చిదానందతత్త్వాన్ని తమ తపో దీక్షతో ఎంతో కొంత దర్శించగలిగారు మన పూర్వ రుషులు.
అపూర్వ భావనకు లోనై… అద్భుతమైన మహేతిహాసాన్ని ఆవిష్కరించారు. అదే ‘శివరహస్యమ్’. ఆ ఎంతో కొంత ఎంతంటే.. ఏకంగా లక్షా ఇరవై ఆరువేల సంస్కృత శ్లోకాలంత! తాటాకు ప్రతులు దాటి… దేవనాగరి లిపిలో రహస్యంగా దాగున్నపరమాద్భుత గ్రంథాన్ని ‘శివరహస్యమ్’ పేరుతో తెలుగులో అనుగ్రహించారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన కర్త సామవేదం షణ్ముఖశర్మ. శివజ్ఞాన సర్వస్వంగా పేరొందిన ‘శివరహస్యమ్’పై చిరు పరిచయం ఇది..
అమ్మవారి తత్త్వాన్ని అయ్యవారు అనుగ్రహించారు. శక్తి దశమహా విద్యగా ఆవిష్కృతమైన వైనాన్నీ, ఆ పది రూపాల్నీ, ఉపాసనా క్రమాన్నీ అన్నీ ఆయనే అందించాడు. మరి ఆ శివుడి తత్తాన్ని ఎవరు వివరించారు? ఎవరికి చెప్పారు? ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు విశ్లేషించారు? పరమ గురువైన సదాశివుడికి ప్రణావాన్ని ఉపదేశించిన షణ్ముఖుడు శివరహస్యాన్ని జైగీషవ్యుడనే మహా తపస్వికి విశదపరిచాడు. తండ్రి రహస్యం కుమారుడికి తెలియడం ఎలా సంభవం? ఒకసారి పార్వతీదేవి అడిగిన మీదట శివుడు తన రహస్యాన్ని అమ్మవారికి ఉపదేశించాడు. ఆ సమయంలో తల్లి ఒడిలో ఉన్న సుబ్రహ్మణ్యుడు ఆ విశేషాలన్నీ ఉపాసన చేశాడు. ఆ సాధనా ఫలాన్నంతా ‘శివరహస్యమ్’గా జైగీషవ్య మహర్షికి అనుగ్రహించాడు. ఆ మహనీయుడి నుంచి మునిజనులకు విదితమైంది. సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు చెప్పడం, తద్వారా లోకానికి వ్యక్తమైంది. పురాణ, ఇతిహాస, కావ్య లక్షణాలు మూడూ కలిగిన ‘శివరహస్యమ్’ పరమశివుడి తత్తాన్ని కండ్లముందు ఉంచుతుంది.
అష్టాదశ పురాణాల్లో లేని పురాణం ఇది. ఇతిహాసం కాని మహేతిహాసం ఇది. వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తూ, వైదికమైన అంశాలను ప్రస్తావిస్తూ, శ్రుతి, స్మృతి, ఆగమ, పురాణ ప్రస్తావనలు, ప్రమాణాలు ఉటంకిస్తూ, వైదికమైన రుషులు, దేవతల ప్రస్తావనతో సాగిపోయే ఈ ఉద్గ్రంథాన్ని మహేతిహాసం అని ప్రాజ్ఞులు అంగీకరించారు. శివరహస్యమ్లో భక్తి, యోగం, వేదాంతం అన్నీ కనిపిస్తాయి. ఈ అంశాలన్నిటినీ ఉపాసన, జ్ఞానం అని రెండు విభాగాలుగా, పన్నెండు అంశాలు (పర్వాలు)గా ఆవిష్కరించారు సామవేదం వారు.
దేవనాగరి లిపిలో ఉన్న ఈ అద్భుత పురాణం శతాబ్దాలుగా ఏ వివరణలు, ఎలాంటి టీకాలు, తాత్పర్యాలు లేకుండా గ్రంథాలయాలకే పరిమితమైంది. శివరహస్య ఖండం స్కాంద పురాణాంతర్గతంగా ఉన్నది. కానీ, అది లభ్యంగా లేదు. ఒక ప్రేరణ కావొచ్చు, సదాశివుడి సంకల్పమే అనుకోవచ్చు.. ‘శివరహస్యమ్’ తెలుగులో మనకు చేరువైంది. వేద వేదాంగాలు, అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు ఇలా సమస్త ఆధ్యాత్మిక విశేషాలూ ఈ మహేతిహాసంలో పొందుపరిచి ఉన్నాయి. ప్రతీ అంశం (పర్వం)లోనూ ఎన్నెన్నో విషయాలు ప్రతిపాదించి ఉన్నాయి.
ఇందులోని కైలాస వర్ణన అంశంలో ఓ చిత్రమైన కథ కనిపిస్తుంది. లింగ రూపుడు అయిన శివుడు కొలువై ఉన్న వెండికొండపై అనేక శివలింగాలు ఉన్నాయట. అక్కడ ఓ దివ్యమందిరం. అందులో చంద్రస్ఫటిక సంభవం- చంద్ర, స్ఫటిక కాంతులతో దేదీప్యమానంగా వెలుగులీనే మహాలింగం ఉందట. అనంత బ్రహ్మాండాలలో ఉన్న లింగాల్లో కల్లా సర్వోతత్కృష్టమైన లింగమది. దీనికి కైలాసేశ్వర లింగం అని పేరు. కైలాసంలోని రత్నవనాలలో పూసిన పూలు, బిల్వ దళాలతో అలంకరించి ఉన్న ఆ మహాలింగాన్ని స్వయంగా మహాశివుడు సతీసమేతంగా వెళ్లి అర్చన చేస్తూ ఉంటాడట. శివుడే మహా లింగం అయితే.. ఆయన వెళ్లి మళ్లీ లింగాన్ని అర్చించడం ఏమిటి? ఇదే రహస్యమ్. శివరహస్యమ్.
‘సర్వాకారతయా స్థితః’- సర్వాకారాలు తానై ఉన్నవాడు, మరి లింగార్చన ఎందుకు చేశాడంటే.. లింగార్చన వల్ల జగత్తులో ఎవరైనా ముక్తి పొందగలరని చెప్పడానికి తాను ముందు పూజించాడు. శివలింగాన్ని వ్యక్తపరచాలంటే తానే వ్యక్తపరచాలి. అది ఎలా ఆరాధించాలో.. తానే చెప్పాలి. జగదాది అయినవాడు కాబట్టి… తానే ఆ విధానాన్ని ఏర్పరిచాడు. ‘నారుద్రో రుద్రమర్చయేత్’ అన్నారు. అంటే ‘రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకానికి అర్హుడు కాదు’ అని ప్రమాణ వచనం. ఈ వచనానికి ప్రమాణం ఏంటో ఇదిగో ఇక్కడ తెలుస్తుంది.
ఈ మహా పురాణం ద్వితీయాంశ (భగ)లో మరో అందమైన రహస్యమ్ కనిపిస్తుంది. సమస్త విశ్వంలో కైలాసం అంత సుందరమైన ప్రదేశం మరొకటి లేదని పురాణాలు విశదపరిచాయి. శివుడున్న ప్రతి నెలవూ అతి సుందరమే! అలాంటి చోట ఆదిదంపతులు కులాసాగా కబుర్లు చెప్పుకొంటున్నారు. అప్పుడు శివాని.. శివుణ్ని ఓ వరం కోరుతుంది. ‘నువ్వు ఉంటున్న కైలాసం కన్నా గొప్పదైన ఓ సుందరమైన లోకాన్ని నాకోసం నిర్మాణం చేసి ఇవ్వమ’ని అడుగుతుంది. కోరింది అర్ధాంగి మాత్రమే కాదు, ఆదిపరాశక్తి. సృష్టి కర్తనే సృష్టించిన శక్తి ఆమె. కనుసైగతో లోకాలను సృజించగలిగే యుక్తి ఆమె సొంతం. అదే అంటాడు శివుడు.
‘నీకు అశక్యం ఏదైనా ఉన్నదా! నువ్వు కైలాసాన్ని సృజించుకోలేవా! కైలాసాన్ని మించిన లోకాన్ని సృష్టించలేవా!’ అని ప్రశ్నిస్తాడు. చివరికి అమ్మవారి కోసం మణిద్వీపాన్ని సృష్టిస్తాడు. కోటి సూర్యుల వెలుగుతో, కోటి పున్నమి చంద్రుల వెన్నెలలతో సమానంగా, కోట్లకొలది ఇంద్రధనువులతో సమానంగా భాసించిన ఆ జ్యోతి హఠాత్తుగా ఉద్భవించగానే సమస్త దేవతలూ ఆశ్చర్యం పొందారు. కైలాసం దిశగా తిరిగి.. ఇదంతా ఆయన లీలే అని శివుణ్ని స్తుతించారు. అలా సృజించిన మణిద్వీపానికి శివుడు పార్వతీ సమేతుడై, సుబ్రహ్మణ్యుడు, గణపతి, ముఖ్యమైన దేవీగణాలు, రుద్రగణాలు సహా చేరుకుంటాడు. మణిద్వీప విశేషాలు, అక్కడ ఆదిదంపతుల విలాసాలు అన్నీ.. అలా సాగిపోతాయి.
కార్తికం రాగానే.. రుద్రం మార్మోగుతుంది. లయబద్ధమైన గమకాలతో సాగిపోయే నమకం-చమకం ఇంటింటా వినిపిస్తాయి. రుద్రం మహిమ ఎలాంటిదో ఈ గ్రంథంలో సవివరంగా కనిపిస్తుంది. ఇలా ఒకటేమిటి… ప్రతి అంశంలోనూ పరమాత్మ లీలను చెబుతూనే, అందులోని ఆంతర్యాన్ని లోతుగా విశ్లేషించిందీ గ్రంథం. శివధర్మాలు, శివతత్తం, భస్మధారణ, రుద్రాక్ష వైభవం, శివ స్తోత్రాలు, ఆయన మహిమలు ఇలా ఎన్నెన్నో ప్రస్తావించింది. శివరహస్యమ్ సాగే ఈ గ్రంథం.. అద్వైత భావనను బలంగా స్థిరీకరిస్తుంది. అద్వైతమే పరమ సిద్ధాంతమని ప్రబోధిస్తుంది. అంతేకాదు ఆసేతుశీతాచలం ఉన్న శివక్షేత్రాల విశేషాలు, మహిమాన్విత స్తోత్రాలు, నామాలు ఇందులో సవిస్తరంగా కనిపిస్తాయి.
తొమ్మిదో అంశ (సదాశివ)లో ఆదిశంకరుల, అప్పయ్యదీక్షితుల చరిత్రలతో పాటు నాయనార్ల వృత్తాంతాలు చదివిస్తాయి. ‘మహా లింగార్చన’, ‘సహస్ర లింగార్చన’, ‘పార్థివ లింగార్చన’ ఇత్యాదులు చేసే ముందు సంకల్పంలో శివరహస్యోక్త విధానేన అని చెబుతుంటారు. అంటే ఈ అర్చనలన్నిటికీ మూలం శివరహస్యమ్లో ఉన్నాయన్నమాట! ఇలా సదాశివ అనుభూతి పొందగలిగే శివుడికి సంబంధించిన సమస్త రహస్యాలూ ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఈ మహేతిహాసం శ్రద్ధగా చదివితే.. శివుడు అర్థమవుతాడు. శివతత్తం అర్థమవుతుంది.
శివసంబంధమైన సమస్త పురాణాల సారం ‘శివరహస్యమ్’లో పొందుపరిచి ఉంది. 1245 పేజీలతో సిద్ధమైన ఈ ఉద్గ్రంథం చదివితే.. శివతత్తం మనసుకు చేరుతుంది. జగమంతా జంగమయ్యే అనిపిస్తుంది. ఈ గ్రంథం వెల: రూ.1,200. ప్రతుల కోసం 040- 7965 8274 (ఋషిపీఠం) నంబర్‌ను సంప్రదించండి. https://rushipeetham.org/ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
– కణ్వస