ప్రవక్త (స) సతీమణి ఒకసారి అర్ధరాత్రి నిద్రలేచి చూసేసరికి ఆయన కనిపించలేదు. ఆమె వెతుక్కుంటూ బయటికి వెళ్లింది. జన్నతుల్ బఖీ అనే ఖనన వాటికలో సమాధుల మధ్య ప్రవక్త (స) కనిపించారు. హుటాహుటిన ఆయన దగ్గరికి వెళ్లింది. భార్యను చూసిన ప్రవక్త (స) ‘ఆయిషా! నన్నే అనుమానిస్తున్నావా? అల్లాహ్ మన్నింపు, కారుణ్యం కురిసే రేయి ఇది, అందుకే ఈ సమాధుల్లో శాశ్వతంగా నిద్రిస్తున్న వారి మన్నింపు కోసం అల్లాహ్ను వేడుకుంటున్నాను’ అని తన సతీమణికి వివరణ ఇచ్చారు ముహమ్మద్ ప్రవక్త (స).
షాబాన్ నెల 15వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఇస్లామీయ చరిత్రలో నిలిచిపోయింది. రంజాన్ నెలకు 15 రోజుల ముందు జరిగిన ఈ ఘటనను ‘షబే బరాత్’గా జరుపుకొంటారు. ఆ రోజు రాత్రంతా ముస్లింలు జాగారం చేస్తూ మసీదుల్లో నమాజులు ఆచరిస్తారు. తమ పూర్వీకుల సమాధులను సందర్శిస్తారు. వారి మగ్భిఫిరత్ (మన్నింపు) కోసం దువా చేస్తారు. దువా అంటే వేడుకోలు. షాబాన్ నెల తొలి పదిహేను రోజులు ప్రవక్త (స) ఉపవాసాలు పాటించి రమజాన్కు సంసిద్ధులయ్యేవారు. శుభాలు సమృద్ధిగా వర్షించే షాబాన్ నెలలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదు. రంజాన్ నెలను స్వాగతించే విధంగా ఎవరికి వారు సన్నద్ధం కావాలి. వీలైనన్ని ఎక్కువ ప్రార్థనలు చేసి దైవ సాన్నిధ్యాన్ని పొందాలి’ అంటారు అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహ్మాలై) మహనీయులు.
సమాధులను సందర్శించడం వల్ల కనువిప్పు కలుగుతుందని ఉలేమాలు షబే బరాత్ సందేశాన్ని వివరిస్తారు. ఖబరస్తాన్ (ఖనన వాటిక)లో ప్రవేశించేటప్పుడు ‘అస్సలాము అలకుం యా అహలల్ ఖుబూర్’ అని చెబుతూ లోనికి ప్రవేశించాలి. ‘సమాధుల్లో నిద్రిస్తున్న మీపై శాంతిశుభాలు కురియుగాక’ అన్నది దాని అర్థం. ‘కాసేపు ఖబరస్తాన్లో మౌనంగా కూర్చోండి. సమాధుల్లో ఉన్న మౌన సందేశాన్ని వినండి’ అని మౌలానా జలాలుద్దీన్ రూమీ చెబుతారు. ‘మన తుది ప్రయాణం సమాధి, కొన్ని మంచి పనులైనా చేసుకో. ఒకరింటికి వెళ్లినప్పుడు ఒట్టి చేతులతో వెళ్లం కదా’ చివరి మజిలీకోసం ఏర్పాట్లు చేసుకోవాలని ఉలేమాలు చెబుతారు.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076