సాధనలో రెండు ముఖ్యమైన అంశాలు ఉండాలి. మొదటిది అచంచలమైన లక్ష్యం. రెండోది నిరంతర ప్రయత్నం. ఈ నిరంతరత మళ్లీ రెండు విధాలు. ఒకటి శ్వాసలా ఎప్పుడూ సాగేది, రెండు నియమిత దేహకాల బద్ధంగా సాగేది. అయితే సాధనలో మధ్యమధ్య అనేకమైన బాహ్య, ఆంతరంగిక విక్షేపణలు, అడ్డంకులు వస్తుంటాయి. పట్టుదలతో వీటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఉద్వేగాలను నియంత్రించే సాధనలో రెండు జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి.
మొదటిది మనసును ఇబ్బందిపెట్టే విషయాల నుంచి సున్నితమైన నిరాకరణతో దూరంగా ఉండగలగాలి. రెండోది మనం ఎవరికి ఏ సాయం చేసినా… వారినుంచి లబ్ధిని, ప్రశంసను ఆశించకుండా ఉండగలగాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ సత్సంగం, సత్ గ్రంథ పఠనం, ఆరాధన, ధ్యానం, దానం చేస్తూ ముందుకుసాగితే ఉద్వేగాలు క్రమంగా మన వశంలోకి వస్తాయి. సాధన నిర్విఘ్నంగా కొనసాగుతుంది.