Bathukamma | సద్దుల బతుకమ్మ సందడిలో పెద్ద బతుకమ్మకు జంటగా చిన్నదానిని కూడా ఉంచుతారు. కారణం? – జయలక్ష్మి, నాగుపల్లి
బతుకమ్మ అంటే అమ్మవారిని పూలరూపంలో ఆవాహన చేసి ఆరాధించే పండుగ. మహాలయ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజులపాటు ఊరూవాడా సందడి నెలకొంటుంది. బతుకమ్మ పండుగ నుంచి..
వర్షరుతువు ముగిసి శరత్ రుతువు మొదలవుతుంది. రకరకాలైన పూలు విరిసి భూమాత ఆహ్లాదం పొందుతుంది. ‘చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః- సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ వంటి పూల పరిమళాలతో ప్రకాశించే శిరోజ సంపద కలిగిన ఓ జగన్మాతా!’ అంటూ అమ్మవారిని నవరాత్రులు ఆరాధిస్తారు భక్తులు. ఇందులో భాగంగా అమ్మవారిని పూలతో బతుకమ్మగా కొలువు దీర్చి ఆటపాటలతో కొలుస్తారు. సద్దుల బతుకమ్మ నాడు పెద్ద బతుకమ్మను పేరుస్తారు.
ఆ తల్లిని ఆడబిడ్డలకు ప్రతిరూపంగా భావిస్తారు. ఈ పండుగ నాటికి విధిగా ఆడబిడ్డలను పుట్టింటికి ఆహ్వానిస్తారు. పెద్ద బతుకమ్మకు జంటగా రెండో బతుకమ్మను గౌరీదేవికి ప్రతిరూపంగా పేరుస్తారు. పసుపుతో గౌరమ్మను చేసి అందులో ఉంచి, పూలతో అలంకరిస్తారు. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేసే సందర్భంలో పసుపు గౌరమ్మను వెనక్కి తీసుకొని, పూల బతుకమ్మను నీటిలో వదులుతారు. ఆ పసుపు గౌరమ్మను ఆడబిడ్డలు కళ్లకు అద్దుకొని, అమ్మవారి ప్రసాదంగా అలంకరించు కుంటారు. అందుకే, గౌరీదేవికి ప్రతిరూపంగా చిన్న బతుకమ్మను (గౌరమ్మను) పేర్చే సంప్రదాయం ఏర్పడింది.