రుక్మిణీ ప్రణయ సందేశం ‘నవ విధ భక్తి’లోని, భక్తికి పరాకాష్ఠగా- అంతిమ సోపానంగా పేరుగాంచిన ‘ఆత్మనివేదన’కి ఉజ్జలమైన ఉదాహరణ. ఇది ప్రణయ మూలకమైనా, ఇందు అందమైన ఒక ప్రియురాలి ఐహికత- ప్రాపంచిక భావం కన్నా పరమేశ్వర- పారమార్థిక భావంతో కూడిన హుందాతనం మిన్నగా- ఉన్నతంగా అందగించింది. సాధకులకు మనశ్శోధకరమైన, భక్తి- జ్ఞాన వైరాగ్య వర్ధక దివ్య బోధ ఈ కల్యాణ గాథలో ఏధమానమై- విలసిల్లుతూ ఉన్నది.
శుకుడు పరీక్షిన్మహారాజా! వైదర్భి రుక్మిణి ఆపన్నయై పన్నగశాయికి ఇలా విన్నవిస్తోంది… కులకన్యలకు ఇంత తెగింపా అని సందేహిస్తున్నావా పుణ్యమూర్తీ? దామోదరా! నేను దీనురాలనై హీనంగా మిమ్ము అర్థించడం లేదు. నేను కూడా మీతో సమానమైన ప్రతిపత్తి స్థాయి కలదానను. ‘ధీరా ధీర సమర్చితా’ (లలితా సహస్రనామం) శ్రీధరా! నేను ధీరను. అధీర చంచల నాయికను కాదు. మరి మీరో, ‘నరలోకమనోభిరాములు’. అందుకే అరవిందాక్షా! నేను మీ పొందు ప్రాప్తి కోరుతున్నా.
శా॥ ‘ధన్యున్ లోకమనోభిరాము గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
కన్యల్ గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
జన్యానేకప సింహ! నా వలననే జన్మించెనే మోహముల్.’
‘శత్రు రాజులనే సింధురా (ఏనుగు)లను సంహరించే సింహమా! నీవు ఆకుల కలత పడు లోకుల చిత్తాలను ఆహ్లాద పరచువాడవు. గోకులేశా! కులము వంశము, విద్య, సౌందర్యం, తారుణ్యం యవ్వనం, సౌజన్యం మంచితనం, సంపద, బలం, దానం, పరాక్రమం, కారుణ్యం మొదలగు అనంత కల్యాణ గుణాలతో శోభిల్లు అలరారు ఓ కంత జనకా! శ్రీకాంతా! నీవు ధన్యుడవు కృతార్థుడవు. జగజెట్టివైన నందుపట్టీ! ఇట్టి నిన్ను ఏ కన్యలు భూదేవి, నీళాదేవి, రాధాది గోపికలు చేపట్టకుండా ఉండగలరు? గరిత స్త్రీలలో ఉత్తమురాలైన హరిప్రియ లక్ష్మి అలనాడు నిన్ను చెట్టబట్ట లేదా? అంచిత (పవిత్ర)మైన ఈ మోహాలు వలపులు నా నుంచే జన్మించాయా ఓ శిఖిపింఛమౌళీ!’ ‘పుంసాం మోహనరూపాయ’ ఆహా! పురుషులను కూడా మోహ పరవశులను చేసే నీ ముగ్ధ మనోహర రూపం, ఓ వరారోహా! (శ్రేష్ఠమైన అంకం ఒడి గలవాడా) వారిరుహాననల స్త్రీలలో నీ యెడల ఈహ (కోరిక) పుట్టించడం ఊహాతీతం కాదు గదా!
‘నా వలననే జన్మించెనే మోహముల్?’- ఈ మాటలో పంచమీ విభక్తి ‘వలన’ అని అర్థం చెప్పితే సమంచితం- ఒప్పిదంగా ఉండదు. నా (రుక్మిణి) వల్లనే మోహాలు పుట్టినవా- అని వాడుకలో లేదు కదా! కాన, పోతన గారు ‘వలను- దిక్కు, దెస’ అనే అర్థంలో ఇంపెసలారే- వేడుక గొలిపే విధంగా చాలా సొంపుగా సముచితంగా వాడారు. అపారమై ఏపారు (అతిశయించు, ఒప్పు) ఈ ప్రేమధార, ఓ చిరశుభాకారా! మార జనకా! నా దిక్కు నుంచే గాక నీ దెస నుంచి కూడా ఆరుగాలం- ఎల్లకాలం పారుతూనే ఉంది కదా! అనగా ఇది అనాదిగా సదా సర్వదా అన్యోన్యం కాదా? అని మహార్థం! ‘కన్నియ మీద నా తలపు గాఢము’- ఓ బ్రాహ్మణోత్తమా! రుక్మిణి మీద నాకూ అగ్గలమైన- మిక్కిలి మక్కువ. నా మనసు కూడా ఆమెయందు లగ్నమై ఉంది- అని ఇందీవరశ్యాముడు కృష్ణచంద్రుడు కూడా మున్ముందు సిగ్గువిడిచి అగ్నిద్యోతనుల వారికి తన వలపు తెలపడం గమనార్హం. మూల శ్లోకంలో ‘నృసింహ’ అని మాత్రమే సంబోధన. సుశ్లోకుడు అమాత్యుడు ‘రాజన్యానేకపసింహ’ అని విస్తరించి, రుక్మిణి సంబోధనలో.. ఓ వనమాలీ! అవసరమనిపిస్తే నీవు యుద్ధావనిలో శిశుపాలాదులను శమనుని యముని సదనానికి పంపి, అదను చూసి నన్ను గ్రహించమని కూడా ధ్వని.
ఉ॥ ‘శ్రీయుత మూర్తి! యో పురుష సింహమ! సింహము పాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడి దా గొని పోయెద నంచు నున్న వా
డా యధమాధముం డెఱుగ డద్భుతమైన భవత్ప్రతాపమున్’
.. ఓ లక్ష్మీపతీ! మంగళమూర్తీ! పురుషులలో సింహం వంటి వాడవు నీవు పురుషోత్తముడవు. తెలి మెకానికి ధవళ మృగమైన సింహానికి చెందవలసిన బలిని ఆహారాన్ని ఆయువుమూడిన గోమాయువు నక్క పొందగోరు చందాన నీ పద కెందామర (రక్త కమలా)లను సదా స్మరించే, నీతో అవినాభావ సంబంధ కలిగి ఉన్న నన్ను మదమత్తుడైన చైద్యుడు శిశుపాలుడు, ఓ బృందావిహారీ! అత్తరం వేగంగా హరించుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అధమాధముడు అధములలో ప్రథముడు, అల్పులలో అల్పుడైన ఆ శిశుపాలుడు, పసిబాలుడు అజ్ఞాని అద్భుతమైన నీ ప్రతాపం ఎరుగడు. ఆబ (దురాశ)తో దేబరించే ఘూక వెలుగుకు నోచుకోని గూబ వంటి ఆ శిశుపాలుడు రాక ముందే, వచ్చి నన్ను తాకక ముందే, ఓ లోకనాథా! నీవు వచ్చి నన్ను పత్నిగా స్వీకరించు.
భగవత్సంబంధమైన సర్వమూ అఖర్వమే అమితము, అపారమే. అద్భుతం, ఆశ్చర్యమే. సహస్రనామాలలో విష్ణువుకు ‘అద్భుతః’ (ఆశ్చర్యకరమైన స్వరూప, స్వభావ, శక్తి, యుక్తి, కార్యములు కలవాడు) అనికూడా ఒక సార్థక నామం. ‘ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనమ్’ (ఏ ఒక మహాపురుషుడో ఈ అద్భుత ఆత్మను ఈశ్వరుని ఆశ్చర్యకరమైనదిగా చూచును) అని గీతావాక్యం. ‘శ్రీయుతమూర్తి’ అని శ్రీమహావిష్ణువుకు శ్రీదేవి సంబోధన పిలుపు. ఆయన శ్రీవత్సవక్షుడు, శ్రీవాసుడు, శ్రీమతాంవరుడు, శ్రీదుడు, శ్రీశుడు, శ్రీనివాసుడు, శ్రీనిధి, శ్రీవిభావనుడు, శ్రీధరుడు, శ్రీకరుడు. కనుకనే యథార్థమైన శ్రీమాన్ శ్రీమంతుడు. శ్రీదేవి నిత్యానపాయిని స్వామిని విడువకుండా ఉంటుంది. వారి ఎడబాటు లీలామాత్రం.
మ॥ ‘వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్
గత జన్మంబుల నీశ్వరున్ హరి జగత్కల్యాణు గాంక్షించి చే
సితినేనిన్ వసుదేవ నందనుడు నా చిత్తేశుడౌగాక ని
ర్జితులై పోదురుగాక సంగరములో జేదీశ ముఖ్యాధముల్’
“గత జన్మలలో నేను జగత్పతి, సర్వలోకాలకూ శుభాలు కల్గించువాడు, శోకనాశకుడు, రతిపతి శతకోటి సుందరుడు, సతాంగతి (వైదిక ధర్మానుష్ఠాన పరులైన సత్పురుషుల పురుషార్థ సాధనకు హేతుభూతుడు) అయిన శ్రీకృష్ణుని పతిగా కోరి వ్రతాలు నోములు నోచి ఉంటే, విబుధు దేవతలకు, గురువులకు, భూదేవత బ్రాహ్మణులకు, బుధు పండితులకు, ఆర్యు పెద్దలకు సేవలు; విధి విధానంగా దాన ధర్మాది సుకృతాలు పుణ్యకార్యాలు చేసినదాననైతే, జగదీశుడు దేవేశుడు ఆ వాసుదేవ కృష్ణుడే నాకు ప్రాణేశుడగు గాక! చేది దేశాధీశుడు శిశుపాలుడు ఇత్యాది అల్పులు ఆజి యుద్ధంలో పరాజితులౌదురు గాక!’ ‘నా భక్తులకు నేనే ప్రాణం. నాకూ నా భక్తులే ప్రాణం’ అని బ్రహ్మవైవర్త పురాణంలో భగవంతుని వచనం.
ఉ॥ ‘అంకిలి సెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్’
శుకదేవుడు రాజా! రుక్మిణి ఇంకా ఇలా పలుకుతోంది… ఓ పంకజనాభా! అంకిలి సెప్పలేదు నీకు ఇక్కడ అడ్డమేమీ లేదు. ఎల్లి రేపే రథ గజ తురగ (అశ్వ) పదాతు (కాల్బలం)లనే చతురంగ బలాలతో వచ్చి, శిశుపాల జరాసంధులను సంగరంలో జయించి, ఓ పురుషోత్తమా!.. ‘ఒక దుర్బలుడు తీసుకు వెళ్లాడు, రుక్మిణి ఒక అసమర్థుని వరించి వెళ్లింది’ అన్నమాట లేకుండా, వీర్యశుల్కనైన నాకు నీ శౌర్యమే ఉంకువ ఓలి (కన్యాశుల్కం)గా ఇచ్చి, ఓ లీలామానుషా! ఈ బాలామణిని రాక్షస వివాహ పద్ధతిలో బలవంతంగా బల ప్రదర్శన పూర్వకంగా తీసుకువెళ్లి, వాసుదేవా! నన్ను వివాహం చేసుకో. నీతో రావడానికి నేను సిద్ధంగా ఉన్నా!