శుకుడు పరీక్షిత్తుతో- రాజా! ఇలా ద్వారకాధీశుడు శ్రీహరి రాకకొరకై నిరీక్షిస్తూ అవసర- నిత్యకృత్యాలయందు కూడా ఆసక్తి-అపేక్ష లేక చెరకు విలుకాని చిచ్చర (మన్మథాగ్ని)లో మగ్గుతున్న ఆవరవర్ణిని, తరళలోచన రుక్మిణికి శుభ సూచకంగా ఎడమ కన్ను, భుజం అదిరాయి. త్వరితం- శీఘ్రంగా వచ్చిన అగ్నిద్యోతనుని ముఖ లక్షణాలుపరికించి, మిక్కిలి ఉత్కంఠతో,ముఖాన మందస్మితం- చిరునవ్వు చిందులాడగా ఆ ఇందీవరాక్షి అతనికి ఎదురేగింది. ఆమెను వీక్షించి ఆ విప్రుడు ఇలా పలికాడు…
ఉ॥ ‘మెచ్చ భవద్గుణోన్నతి కమేయ ధనాదుల నిచ్చె నాకు దా
వచ్చె సుదర్శనాయుధుడు వాడె సురాసురులెల్ల నడ్డమై
వచ్చిన నైన రాక్షస వివాహమునన్ గొనిపోవు నిన్ను నీ
సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించె గన్యకా!’
‘ఓ బాలామణీ! ఆ లీలా మానుష విగ్రహుడు వనమాలి నీ వాల్లభ్యాన్ని- వలపును, నీ ఉత్తమ గుణాలను చాలా మెచ్చాడు. నాకు అంతులేని ధనావళులు- సంపదలిచ్చాడు. ఓ మదిరాక్షీ! ఆ యదువీరుడు ఇదుగో ఇప్పుడే కదిలి వచ్చాడు. దేవదానవులందరూ ఏకమై ఎదురొడ్డి నిలిచినా, కదన రంగంలో వారిని ఎదిరించి, అవసరమైతే యమసదనానికి పంపించి ఐనా సరే, ఆ సారసాక్షుడు చక్రధారి రాక్షస వివాహ పద్ధతిలో నిన్ను గొనిపోతాడు. అమ్మా! అంచితమైన నీ మంచి నడవడి, నీ సంచిత పుణ్యరాశి, నీ భాగ్యము- అన్నీ ఓ కన్నియా! నేడు ఫలించాయి.’ అగ్నిద్యోతునుల వారి అమృత గుళికల వంటి ఆ పలుకులు ఆలకించి ఆ కలికి ఇలా పలికింది…
మ॥ ‘జలజాతేక్షణు దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి నన్
నిలువం బెట్టితి నీ కృపం బ్రతికితిన్ నీ యట్టి పుణ్యాత్మకుల్
గలరే? దీనికి నీకు బ్రత్యుపకృతిన్ గావింపనే నేర నం
జలి గావించెద భూసురాన్వయమణీ! సద్బంధు చింతామణీ!’
‘ఓ బ్రాహ్మణోత్తమా! సాధు బంధువులకు చింతామణి వంటివాడా! నా సందేశాన్ని తోయజాక్షునికి వినిపించి ఆ స్వామిని తోడ్కొని వచ్చావు. ఇంతటి సాయం చేసి నా కాయాన్ని ప్రాణాలతో నిలిపావు. నీ కృపతో నేను బతికాను. నీవంటి పుణ్యాత్ములు ఈ పుడమిలో లేరు. నీవు చేసిన ఈ ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేయజాలను. ఓ భూసురోత్తమా! నీకు దోసిలొగ్గి నమస్కరిస్తా అంటూ కంజదళాక్షి అంజలి గావించింది’. ‘అంజలీ పరమాముద్రా సద్యోదేవ ప్రసాదినీ’- జగత్పతి పరమాత్ముని సద్యః- అప్పటికప్పుడు ప్రసన్నుని గావించే అంజలి ముద్ర ముద్రలన్నింటిలో అతి భద్రమైనది. అగ్నిద్యోతనుని వంటి నిరంతర భగవల్లగ్న మానసుడైన బ్రహ్మవేత్తకు- సుజ్ఞానికి బ్రహ్మవిద్యా స్వరూపిణి యైన నారాయణి కూడా మనసారా నీరాజనాలు- మంగళారతులు సమర్పిస్తుంది.
శుకుడు- రాజా! భీష్మకుడు బలరామకృష్ణులకు చక్కని వేశ్మ- విడిది గృహాలను ఏర్పరచి వారిని శాస్ర్తోక్తంగా పూజించాడు. కుండిన నగర ప్రజలు, అండజవాహనుడు బ్రహ్మాండ జనకుడు శ్రీకృష్ణుడు అరుదెంచాడని విని, అవలోకించి- కని, తమ నేత్రాలనే పాత్రలతో గోవిందుని వదనారవింద సౌందర్య మరందాన్ని గ్రోలుతూ ఇలా అనుకున్నారు-
మ॥ ‘తగు నీచక్రి విదర్భరాజ సుతకుం, దథ్యంబు వైదర్భియుం
దగు నీచక్రికి, నింతమంచి దగునే? దాంపత్య మీ యిద్దరిం
దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా! దర్పాహతారాతియై
మగడౌ గావుత జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్’
‘వైదర్భి రుక్మిణికి ఈ చక్రి- చక్రపాణి ఎంతో ఈడైన వాడు. ఈ త్రివిక్రమునికి మన భైష్మి కూడా ఎంతైనా జోడైనది. ఆహా! లోకానికే పరమానందకరమైన ఎంత అందమొలికే దాంపత్య బంధమిది? వీరిద్దరినీ సతీపతులుగా జతగూర్చిన మతిమంతుని, పితామహుని- బ్రహ్మదేవుని చతురత అతి ప్రశంసనీయం కదా! మా పుణ్యఫలంగా ఈ సర్వ శరణ్యుడు చక్రధారి తన అవక్ర పరాక్రమంతో పగవారిని- విరోధులను పారదోలి మా రాకుమారి రుక్మిణమ్మను పరిణయమాడు గాక!’.
ఇంతలో వీరభటుల రక్షణలో అంతఃపురం నుంచి సుందరాంగి రుక్మిణి సపరివారంగా మందగమనంతో అపరాజితాదేవి- అంబిక ఆలయానికి బయలుదేరింది. వారకాంతలు బారులు తీరి ఉపహారాలతో పురవీధులలో ముందు సాగుతుండగా, చెలికత్తెలు, దాదులు, బాంధవ స్త్రీలు, బ్రాహ్మణ సువాసినులు, సూత వంది మాగధ గాయక బృందాలు వాద్య ఘోషలతో సందడి చేస్తూ వెంబడించగా, ఆద్యుడైన అరవింద నేత్రుని ‘ఆకాశగంగ అనే మకరందం, సచ్చిదానందమనే సుగంధం’తో రాజిల్లు పాదారవిందాలు డెందంలో స్మరిస్తూ ఆలయానికి వచ్చింది. కాలు సేతులు కడుగుకొని ఆ వాలుగంటి రుక్మిణి పరిశుద్ధురాలై పరమేశ్వరి సన్నిధికి చేరింది. ముత్తయిదువలు భవ (శివ) సమేత యైన భవానిని అలంకరించి, నైవేద్యాలు కానుకలు సమర్పించి, హారతులిచ్చి మత్తపుష్పంధయ వేణి రుక్మిణిచే మృడాని- దుర్గాదేవికి మొక్కించారు. అప్పుడు రుక్మిణి రుద్రాణిని ఇలా ప్రార్థించింది…
ఉ॥ ‘నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ! పేటి పె
ద్దమ్మ! దయాంబు రాశివి గదమ్మ! హరింబతి సేయుమమ్మ! నిన్
నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ! ఈశ్వరీ!’
‘అమ్మా! గౌరీ! అనాది సనాతనులూ- శాశ్వతులూ, ఆది దంపతులూ- ప్రపంచ సృష్టికి కారణభూతులూ అయిన పార్వతీ పరమేశ్వరులు- మిమ్ములనే నేను నెమ్మది- నిండుమనసుతో నమ్ముకొని ఉన్నాను. నిన్నే భక్తితో సేవిస్తున్నాను. అమ్మలలో నీవు మేటి పెద్దమ్మవు- ఇచ్ఛా, జ్ఞాన, క్రియాది సర్వశక్తులకు మూలమైన ఆదిశక్తివి. జగదంబా! నీవు దయాంబురాశివి- దయా సముద్రురాలవు. ఓ కన్నతల్లీ! వెన్నుని ప్రసన్నుని గావించి నాకు విభునిగా- పతిగా చెయ్యి. నిన్ను నమ్మిన వారికి ఎన్నటికీ నాశం- నష్టమనేది లేదు కదమ్మా! ఈశ్వరీ!’.
ఈ ఉత్పలమాల తెలుగువారి మదిలో సదా సుగంధపు పరిమళాల వెలుగులీనే ప్రసిద్ధమైన చెలువంపు- అందమైన పద్యం. ఇందు భూషణుని (శివుని) డెందానికి కూడా అమందమైన ఆనందం కలిగించే ఈ పద్యపు అందమంతా అక్షరాల పొందిక- కూర్పులో ఉంది. ప్రాస స్థానంలో పొదిగిన ద్విరుక్త మకారం (మ్మ) పలు మారులు రావడం వల్ల ఈ సొబగు, సోయగం! పదిసార్లు పద్యం చదివితే ప్రాణం సుఖపడుతుంది. ఇది అనుభవైకవేద్యం. అంతేకాక, ఈ పద్యమొక మహావిద్య. శక్తివంతమైన ఈ దుర్గాదేవి మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో జపించినచో, అమ్మ అనుగ్రహంతో కన్యలకు యోగ్యుడైన జీవిత భాగస్వామి లభిస్తాడు. మీదు మిక్కిలి ఈ పద్యం మూల శ్లోకానికి కేవల అనువాదం కాదు. మహాకవి పోతన అమాత్యుని భక్తి భరిత విశ్లేషణతో కూడిన రసాత్మకమైన అనుసరణ ఇది!
శుక ఉవాచ- రాజా! ఇలా వేడుకుంటూ వైదర్భి గౌరీదేవికి మొక్కి పతులతో కూడిన బ్రాహ్మణ పత్నులకు ఉప్పు, అప్పాలు, తాంబూలాలు, మంగళసూత్రాలు, చెరకు గడలు సమర్పించి అర్చించింది. వారల ఆశీస్సులు పొంది మంగళాక్షతలు ధరించి, పూనిన మౌనవ్రతం మాని ఆ మానిని రుక్మిణి గుడి నుండి వెడలింది. మబ్బుల నడుమ నుంచి వెలువడి వెలిగే తొలకరి మెరుపువలె గోచరించింది. విధు- చంద్ర మండలం నుంచి వెలికి వచ్చి సంచరించు లేడివలె ఉంది. అమృత మథన సమయంలో క్షీరాంబుధి- పాలకడలి నుండి వెడలి వచ్చిన అంబుజాసన- లక్ష్మీదేవి వలె విరాజిల్లింది. ఇలా పలు కాంతులతో విలసిల్లుతూ ఆ ఇంతి రుక్మిణి కాళికాలయం నుండి బయల్దేరింది. అందమైన కాలి అందెల రవళి వీనులకు విందు చేయగా, ఆ సుందరి ముకుందుని వీక్షణానికి నిరీక్షిస్తూ, వీర మోహినియై గంభీరంగా కాలి నడకన వస్తున్నది.
మ॥ ‘ఆలి నీలాలక బూర్ణచంద్రముఖి నేణాక్షిం బ్రవాలాధరం
గల కంఠిన్ నవ పల్లవాంఘ్రి యుగళన్ గందేభకుంభస్తనిం
బులిన శ్రోణి నిభేంద్రయాన నరుణాంభోజాత హస్తన్ మహో
త్పల గంధిన్ మృగరాజు మధ్యగని విభ్రాంతాత్ములై రందరున్’
‘గండు తుమ్మెదల వంటి నల్లని ఉంగరాల ముంగురులు, నిండు చంద్రుని వంటి నెమ్మోము, లేడి చూపుల వంటి చూడ్కులు, పగడాల వంటి పెదవులు, అవ్యక్త మధురమైన కంఠం, కొత్త చిగుళ్ల వంటి అడుగుల జంట, మత్తగజ కుంభాల వంటి కుచములు, ఇసుక తిన్నెల వంటి పిరుదులు, గజరాజ గమనం వంటి నడక, కెందామరల వంటి కరములు, సింహపు నడుము వంటి సన్నని నడుము కలిగి పద్మపు సుగంధాలు వెదజల్లే (పద్మిణీం పద్మ గంధినీం) సుదతి రుక్మిణీదేవిని చూచి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అక్కడ చేరి ఉన్న రాజకుమారుల మానసాలైతే ఒక్కసారిగా చలించాయి. వారంతా సోలి- మైమరచి, ఆయుధాలు జార విడిచి ధారుణి (భూమి)పై వాలిపోయారు. లేడి చూపుల ఆ పూబోడి రుక్మిణి తన కటాక్షాలతో- కడగంటి చూడ్కులతో రాజ సమూహాన్ని వీక్షించింది. అందు ఇందీవర శ్యాముడు ఎందున్నాడని అన్వేషిస్తున్న ఇందుముఖి రుక్మిణి..
మ॥ ‘కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖుం గంఠీరవేంద్రావ ల
గ్ను నవాంభోజదళాక్షు జారుతర వక్షున్ మేఘసంకాశ దే
హు నగారాతి గజేంద్ర హస్తనిభబాహుం జక్రి బీతాంబరున్
ఘన భూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్’
‘చంద్రబింబం వంటి మోము, సింగపు నడుము, నూతన పద్మదళాలవంటి నేత్రాలు, చక్షువులకు పరమ రమణీయమైన విశాల వక్షము, నీల నీరదం- నల్లని మేఘం వంటి నెమ్మేను, ఐరావతగజ తుండం వంటి బాహుదండాలు, పచ్చని పట్టు పుట్టాలు, ఘనమైన ఆభరణాలు, శంఖం వంటి కంఠం, విజయంలో ఉత్కంఠ- ఆసక్తి, ఉత్సాహం కలవాడు, చక్రాయుధుడు, జగాలను మోహపెట్టేవాడు, మన్మథ మన్మథుడైన చిన్మయ మూర్తి శ్రీకృష్ణ చంద్రుని దర్శించింది.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006