తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం (Tirumala Laddus ) విక్రయాలు జూన్ నెల ( June Month ) లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1,11,96,170 లడ్డూలు, మే నెలలో 1,21,35,528 లడ్డూలు, జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయించామని అధికారులు వెల్లడించారు. గత మూడు నెలలతో పోలిస్తే జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయని వివరించారు.
2024 జూన్ నెలలో 1,02,64,364 లడ్డూలు, 2025 జూన్ నెలలో 1,19,21,353 లడ్డూలు విక్రయాలు జరగగా, 2026 జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయించడం విశేషమన్నారు. గత ఏడాది జూన్‌తో పోలిస్తే 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయ మవ్వడంతో 6.37 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీలో టీటీడీ సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.