తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) సర్వం సిద్ధం చేసింది. తిరుమల కొండపై బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత వైభవోపేతంగా జరిగే రథసప్తమి వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేసింది. మంగళవారం సూర్య భగవానుడి పుట్టినరోజు కావడంతో సూర్యోదయానికి ముందే వేడుకలు ప్రారంభం కానున్నాయి. శ్రీ మలయప్ప స్వామి అవతారంలో శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం సప్త వాహనాలపై దేవేరులతో కలిసి దేవదేవుడు తిరుమల మాఢవీధుల్లో ఊరేగనున్నాడు. వేకువజామున 5.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామి వారు భక్తుల మధ్యనే ఉండి దర్శన భాగ్యం ఇస్తారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు రాత్రికి చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 5వ తేదీవరకు మూడు రోజుల పాటు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసింది. అలాగే రథసప్తమి రోజు తిరుమల శ్రీవారికి నిత్యం జరిపించే అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలను కూడా రద్దు చేసిన టీటీడీ ఏకాంతంగా సేవలను నిర్వహించనుంది. అదేవిధంగా ప్రవాస భారతీయులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు కల్పించే ప్రివిలేజ్ దర్శనాలను కూడా నిలిపివేసింది. వీటితోపాటు ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు మినహాయించి మిగిలిన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టోకెన్లు ఉన్న భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లలో వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్టు చేయాలని భక్తులకు సూచించింది.
మాఢవీధుల్లో భక్తులకు ఎండ, చలి నుంచి రక్షణ కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తున్నది. అదేవిధంగా 8 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచనుంది. గ్యాలరీల్లోకి వచ్చి భక్తుల కోసం ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటుచేసింది. 1,250 మంది పోలీసులు, వెయ్యి మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నది.