Sri Rama Navami | తెలుగు రాష్ట్రాలైనా తెలంగాణ, ఏపీలో ఎన్నో ప్రముఖ రాముడి ఆలయాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో శ్రీరాముడు సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో కలిసి పూజలందుకుంటున్నాడు. కానీ, ఆలయంలో హనుమంతుడు లేకుండానే రామచంద్రమూర్తి సీత, లక్ష్మణుడితో కలిసి కొలువుదీరాడు. ఈ ఆలయంలో ఏపీలోని కడప జిల్లాలో ఉన్నది. అదే ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం.
ఈ ఆలయం గర్భగుడిలో ఆంజనేయస్వామి మూర్తి కనిపించదు. దీని వెనుక కథ ఉన్నది. హనుమంతుడిని కలుసుకోక ముందే సీతారామలక్ష్మణులు ఇక్కడ సంచరించారని.. అందుకే ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని చెబుతున్నారు. వనవాస సమయంలో సీతారామ, లక్ష్మణులు ఇక్కడ సంచరిస్తుండగా.. సీతామాతకు దాహం చేసింది. ఆ సమయంలో శ్రీరాముడు తన బాణంతో పాతాళగంగను రప్పించాడు. ప్రస్తుతం ఆ తీర్థం ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తుంది.
ఈ ఆలయం మిట్టమీద నిర్మించారు. అందుకే ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక ఆలయంలోని విగ్రహాలన్ని ఒకే శిలపై తీర్చిదిద్దారు. అందుకే దీన్ని ఏక శిలా నగరంగా పేరు వచ్చింది. మరో కథనం ప్రకారం.. ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామభక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత తమ జీవితాలను అంతం చేసుకున్నారు. వారిద్దరి విగ్రహాలు ఆలయంలో ప్రవేశించే ముందు చూడొచ్చు.
రామలక్ష్మణులు చిన్న వయసులోనే కాకుండా.. సీతారాముల కల్యాణం తర్వాత మృకండ మహర్షి, శృంగి మహర్షి కోరిక మేరకు యాగ రక్షణకు, దుష్ట శిక్షణకు శ్రీరామ లక్ష్మణులు ఇక్కడకు వచ్చి యాగరక్షణ చేసినట్లుగా కథనం. అందుకు ఆ మర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై చెక్కించారని.. తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేశాడని స్థానికుల నమ్మకం.
ఆలయానికి వచ్చిన భక్తులను ఇమాంబేగ్ బావి ఆకర్షిస్తుంటుంది. ఇక్కడికి వచ్చిన వారంతా తప్పనిసరిగా ఈ బావిని సందర్శిస్తారు. 1640 సంవత్సరంలో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధే ఇమాంబేగ్. ఆయన ఓసారి ఈ ఆలయానికి వచ్చి భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడట. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని భక్తులు సమాచారం ఇచ్చారట. ఆయన మూడుసార్లు రాముడిని పిలిచారట. అందుకు ప్రతిగా మూడుసార్లు ఓ సమాధానం వచ్చిందని.. దాంతో ఆశ్చర్యపోయిన ఆయన స్వామివారికి భక్తుడిగా మారి బావిని తవ్వించాడు.
ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని దర్శించి, భారత దేశంలో పెద్ద గోపురాల్లో ఈ ఆలయ గోపురం ఒకటిగా కీర్తించాడు. ఈ ఆలయాన్ని పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్టిరాజులు ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించారు. మూడు గోపురాలతో, విశాలమైన ఆవరణలో అలరారే ఈ ఆలయం ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు ఉంటుంది. ఆలయంలో మధ్య మండపంలో 32 స్తంభాలున్న రంగమంటపం ఉన్నది. స్తంభాలపై శిల్ప కళ చోళ, విజయనగర శిల్ప శైలిని పోలి ఉంటుంది. స్తంభాలపై రామాయణ, మహాభారత కథలను చూడొచ్చు.
ఒంటిమిట్టకు చెందిన ఆంధ్రవాల్మీకిగా పేరుపొందిన వావిలికొలను సుబ్బారావు (1863 – 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించారు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఆయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు రూ.10లక్షల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి సహా ఎందరో తమ కవితలో అర్చించారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి, దానికి మందరం పేర పేర వ్యాఖ్యానం రాశారు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం పక్కనే రథశాల ఉన్నది.
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుంచి బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కల్యాణం, పౌర్ణమి రోజున రథోత్సవం ఉంటాయి. నవమి రోజున పోతన జయంతి నిర్వహిస్తారు. అయితే, చాలాచోట్ల సీతారాముల కల్యాణం మధ్యాహ్నం సమయాల్లో జరిగితే.. ఒంటిమిట్టలో మాత్రం చంద్రుడి వెలుగుల్లో జరుగడం విశేషం. దీని వెనుక ఒక పురాణగాథ ఉన్నది. క్షీరసాగర మథనం తర్వాత మహాలక్ష్మీదేవిని నారాయణుడు తన అర్ధాంగిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని లక్ష్మీదేవి సోదరుడైన చంద్రుడు.. స్వామి అమ్మవార్లకు మొరపెట్టుకోగా.. ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని చూసేలా వరమిచ్చాడని కథనం.