Rakhi Pournami | అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షాబంధన్. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకొనే ఈ పండుగ వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలకు, రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. ఆ సమరంలో దేవతల గెలుపు కోరి శ్రావణ పౌర్ణమినాడు లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి.. శచీదేవి తన భర్త దేవేంద్రుడికి రక్ష కడుతుంది.
దాని ప్రభావంతో దేవేంద్రుడు ఆ యుద్ధంలో గెలుస్తాడు. ద్వాపరయుగానికి చెందిన మరో కథ కూడా రక్షాబంధన్ గొప్పదనాన్ని తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడికి ద్రౌపది సోదరి వరుస అవుతుంది. ఒకసారి కృష్ణపరమాత్మ సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు ఆయన వేలుకు గాయం అవుతుంది. అప్పుడు అక్కడే ఉన్న ద్రౌపది తన చీర చెంగును చింపి.. రక్తమోడుతున్న కృష్ణుడి వేలుకు కట్టు కడుతుంది.
సోదరి ప్రేమకు చలించిపోతాడు కృష్ణుడు. ఈ రక్షే.. తర్వాత వస్ర్తాపహరణ సమయంలో ద్రౌపదికి రక్షణగా నిలిచిందని చెబుతారు. రక్షాబంధన్‌కు సంబంధించిన చారిత్రక కథలు కోకొల్లలుగా వినిపిస్తాయి. అలెగ్జాండర్ భార్య రుక్సానా తన భర్త ప్రాణాలకు అభయం కోరుతూ.. పురుషోత్తముడికి రాఖీ కట్టిందని కథ. ఇవన్నీ ఎలా ఉన్నా.. రాఖీ పౌర్ణమి తోబుట్టువుల బాధ్యతలను గుర్తింపజేసే పండుగ. సోదరి బాగోగులు చూసుకోవడం సోదరుల కర్తవ్యం అని తెలియజేస్తుంది.