అరవిందాక్షుడు గోవిందుని స్వరూపానందాన్ని వైష్ణవ శాస్ర్తాలలో ‘ఆహ్లాదినీ శక్తి’ అని అంటారు. ఈ శక్తి సార సర్వస్వమే ప్రేమ. ఈ ప్రేమ యొక్క పరమ ఫలమే భావం. ఈ భావ పరిపూర్ణతయే మహాభావం. ఈ మహాభావమే రాధాదేవి! ఆరాధనా స్వరూపురాలైన రాధను కూడా కాదని వదలి యాదవ శిరోరత్నం అబాధంగా- అడ్డులేక అంతర్ధానమవడానికి ప్రధాన కారణాలు రెండు అని వ్యాఖ్యానం.. రాధను వదలివేస్తే ఆమెను చూచిన యెడల భగవానుని వియోగ బాధను అనుభవిస్తున్న గోపికల ప్రాణాలు నిలుస్తాయి. రెండోది.. రామావతారంలో సతీ-సీతా వియోగంలో రాముడు రోదించాడు. ప్రతి (మారు)గా కృష్ణావతారంలో రాధ, గోపికలు విలపించారు. శుక ఉవాచ..
మ॥ ‘అని యిబ్భంగి లతాంగులందరును బృందారణ్యమం దీశ్వరున్
వనజాక్షుం బరికించి కానక విభున్ వర్ణించుచుం బాడుచున్
మనముల్ మాటలు జేష్టలుం గ్రియలు నమ్మానాథుపై జేర్చి వే
చని ర య్యామున సైకతాగ్రమునకున్ సంత్యక్త గేహేచ్ఛలై’
పరీక్షిన్మహారాజా! ఈ విధంగా ఆ గోప వనితలందరూ బృందావనంలో భగవంతుని, వనజాక్షుని- నందసూనుని ఎంత వెదికినా కనలేకపోయారు. ఆ ఘనశ్యాముని వైభవోపేతమైన గుణగణాలను, లీలలను వర్ణించి పాడుతూ తమ మనోవాక్కాయ కర్మలను ఆ మా-లక్ష్మీ పతి కృష్ణుని మీదనే చేర్చి, ఇళ్లకు వెళ్లాలన్న ఇచ్ఛలు- కోరికలు కూడా వీడి, స్వచ్ఛమైన ఆ యమునా తీరంలోని ఇసుక తిన్నెల వద్దకు వచ్చారు. సిరిమగని- వెన్నుని (హరి) సాక్షాత్కారానికై పరితపిస్తూ గోప గరిత (వనిత)లు గీతములు పాడారు. గానంలో రోదనం, రోదనంలో గానం- అవే గోపీ హృదయ గీతికలు. ఇందు (చంద్ర)ముఖులు ఎందరున్నా అందరి ఆంతర్యం సమానమే కాన, అందరి గళమూ, గానమూ ఒక్కటయ్యాయి. పరమాత్మకు పన్నీరు కన్నా భక్తుల కన్నీరంటేనే మక్కువ ఎక్కువ. సంస్కృత భాగవతంలో ఈ గోపికా గీతికలు ‘కనక మంజరి’ అనే ఛందస్సులో కూర్చబడినాయి. కనక మనగా ధత్తూరం- ఉమ్మెత్త. ఉమ్మెత్తను తింటే ఉన్మాదం- మత్తు కలుగునట్లుగ ఈ ఛందస్సులో మాధవుని స్తుతిస్తే మనిషి మనసు ప్రపంచాసక్తిని వదలి, విరక్తి చెంది పరమాత్మయందు నిశ్చలమై నిలిచిపోతుంది.
క॥ ‘నీవు జనించిన కతమున
నో వల్లభ! లక్ష్మి మంద నొప్పె యధికమై
నీ వెంటనె ప్రాణము లిడి
నీ వారరసెదరు చూపు నీ రూపంబున్’
నాథా! నీవు జన్మించినందున ఈ మంద- గోకులంలో సిరి (సంపద, శోభ) పెంపు సొంపొందు- అందగించుతోంది. నీయందే అసువులు- ప్రాణాలు నిలిపి, ఓ నంద తనయా! నీ వారమైన మేము నీ వియోగంలో వసివాడి- మిక్కిలి వడలి, పస చెడి నీ కోసం వెదుకుతున్నాము. నీ కొరకే బ్రతికి ఉన్నాం. నీ రూపు మాకు చూపు. గోపకుమారా! శరణార్థులను కాపాడుట నీ ధర్మం కాదా? అజామిలుని వంటి పాపిని కరుణించి కాపాడిన నీవు మాకు సజావు- సవ్యంగా దర్శనమిచ్చి కావవా?
ఆ॥ ‘విషజలంబు వలన విషధర దానవు
వలన రాల వాన వలన వహ్ని
వలన నున్న వాని వలనను రక్షించి
కుసుమ శరుని బారి గూల్ప దగునె?’
పదిమంది వాడుకొనే కాళిందీ నదీ జలాలను విషం కక్కి కలుషితం చేసే కాళీయుని నుండి, అజగర- కొండచిలువ రూపుడైన అఘాసురుని నుంచి, కులిశి (ఇంద్రుడు) కురిపించిన రాళ్లవాన నుండి, కాననం- అడవిలో చెలరేగిన కార్చిచ్చు నుండి, సుడిగాలి రక్కసి (తృణావర్తుడు) నుండి, ఇంకా ఇలాంటి ఎన్నో ఆపదల నుండి వడివడిగా మమ్ములను కాపాడావు. అంతమంది అసురులను అంతమొందించి మమ్ము రక్షించింది ఇప్పుడీ కంతు- మారు (మన్మథు)ని బారికి గురిచేయడానికా శ్రీకాంతా! ఇది న్యాయమా?
‘బిసరుహ (కమల) నయనా! నీవసలు కేవలం యశోదా కుమారుడవే కావయ్యా. అఖిల దేహధారుల హృదయాలలో అంతర్యామిగా ఉన్న అంతరాత్మవు. బుద్ధికి సాక్షీభూతుడవు. లక్ష్మీనాథుడవు. పూర్వం విరించి- బ్రహ్మదేవుడు నిన్ను స్మరించి. విశ్వరక్షణ గావించమని ప్రార్థించగా భారాన్ని హరించి భూమండలాన్ని ఉద్ధరించడానికి నీవిలా సాటిలేని మనోహర రూపంతో మేటి యదువంశంలో నందు పట్టివై పుట్టావు. సంసారానికి వెరచి శరణాగతులైన మునులకు, ముముక్షువులకు అభయమిచ్చే నీ హస్తాన్ని మా మస్తకాలపై ఉంచి మమ్ము బ్రతికించు. ఓ మాధవా! నీ పాదాలు సమస్త సౌందర్య మాధుర్య నిధులు. అవి మహాలక్ష్మికి నివాస స్థానాలు. ఆమెచే నిత్య పూజలందుకునేవి. అట్టి పాదాలపై పడ్డవారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. గోవులకు సులభమైన పాదాలు మాకు దుర్లభాలా? దురిత నివారకా! మేము ధేనువుల కన్నా దీనలమై ఈ కాననంలో నిన్ను వెదుకుతున్నాం. కాన, ఓ జలరుహా (కమలా)ననా! సాధనహీనలమైన మా హృదయాలపై నీ పాదాలు ఉంచి, వానిలోని కామ వాసనలను రామానుజా! తొలగించు. ‘మీ హృదయాలలోని అహంకారమనే విష ప్రభావం నా పాదాలపై పడే ప్రమాదం ఉన్నది కదా!’ అని అంటావేమో దామోదరా! కాళీయుని పడగలపై వదలకుండా నృత్యం చేసిన వాడవు కదా! మా ఎదలలోని విషం నిన్నేమి చేస్తుంది? నీ చరణాల అమృత స్పర్శతో మా విషపూరిత హృదయాలు అమృత మయాలవుతాయి. మధుసూదనా! నీ అధరామృతం జుర్రజేసి మా మదనతాపం తొలగించు.’ వామనేత్రలైన గోపభామలు కామసుఖం కాదు, సంపూర్ణ కామ విరామం కోరుతున్నారన్నది విజ్ఞులకు విస్పష్టం.
ఉ॥ ‘నీవు యశోద బిడ్డడవె? నీరజనేత్ర! సమస్త జంతు చే
తో విదితాత్మ! వీశుడవు తొల్లి విరించి దలంచి లోకర
క్షా విధమాచరింపు మని సన్నుతి సేయగ సత్కులంబునన్
భూ వలయంబుగావ నిటు పుట్టితి గాదె మనోహరాకృతిన్’
భాగవత మహాపురాణం ఎల్లెడల (అంతటా) బాదరాయణుడు వ్యాసుడు ప్రయోగించింది ‘సమాధి భాష’ అన్నారు వల్లభాచార్యులు. ధరా అనగా భూమి. ధరామృతం భూమి మీద లభించే దైహిక, భౌతిక అధర (పెదవి) అమృతం- మోవి తేనె. గోపికలు కోరింది (న+ధరా) ధరామృతం కానిది. అధరామృతం. అనగా భూ సంబంధం లేని అమృతం. భగవత్ కథామృతం, ప్రేమామృతం, జ్ఞానామృతం, భక్త్యమృతం, దివ్య అద్వైతామృతం!
భగవానుడు… నా వియోగంలో మీరు బ్రతికే ఉన్నారు. మీ ప్రేమ నిష్కపట- నిజమైనదైతే, రామ వియోగంలో దశరథుని వలె మీరు ప్రాణాలు విడిచి ఉండేవారు కదా! గోపికలు… మా ప్రాణాలు నీ వద్ద ఉంటే మాకు మరణం ఎలా సంభవిస్తుంది అశరణ శరణా? కృష్ణా! నీ విరహాన మాకు ప్రాణహాని కలిగేదే. కాని, నీ కథామృత పానం చేయించే పుణ్యాత్ములచే ఆ మరణం రాకుండా ప్రతారణం- పెద్ద మోసం జరిగిపోయింది. నీ కథామృతం గ్రోలు వారు అపమృత్యువు పాలుగారు. ఆ ప్రలోభం వల్లనే మా ప్రాణాలు ఇంతవరకు పోకుండా ఆగినాయి. స్వర్గంలోని అమృతం అమరులకు, కర్మిష్ఠులకు మాత్రమే లభించేది. అది పుణ్యాన్ని క్షీణింపజేస్తుందే కాని పాపక్షయకరం కాదు. స్వర్గామృతం తాగినా ఎప్పటికైనా మరణం అనివార్యం. కాని, నీ కథామృతం అఘ- పాప నాశకమూ, అపవర్గ- మోక్ష ప్రదం కూడా! సనకాది జీవన్ముక్త మహాపురుషులు సైతం భగవత్ కథలంటే చెవి కోసుకుంటారు. అశన (అన్న) దానం, వసన (వస్త్ర) దానం కన్నా కథామృత దానం మిన్న. కృష్ణా! స్వర్గామృతం తాగాలి. కైవల్యామృతం అనుభవించాలి. కాని, ఇదో ‘వినన్ శుభదం’- శ్రవణ మాత్రాన శుభాలనిచ్చేది. నిరంతర తపముచే తపిస్తున్న పురుష పుంగవులకు హృదంతరం- మానసంలో సంజీవనమై ఒప్పునట్టిది. నీ కథ విన్నవారి జీవనాలు- బ్రతుకులు ఆరిపోతాయి. కాలే పెనం మీద నీటి చుక్కలలాగా అవి ఆవిరైపోతాయి. తెల్లవారిపోతాయి- ‘తమసోమా జ్యోతిర్గమయ’.
ఆ॥ ‘భక్తకామదంబు బ్రహ్మసేవిత మిలా
మండనంబు దుఃఖమర్దనంబు
భద్రకరమునైన భవదంఘ్రి యుగము మా
యురములందు రమణ! యునుప దగదె?’
ప్రియతమా! భక్తుల అభీష్టాలను తీర్చేది, బ్రహ్మచే పూజింపబడేది, భూమికి భూషణమైనది, దుఃఖాలను భంజించేది, శుభాలను అనుగ్రహించి ఆదుకొనేది అయిన నీ పాదయుగాన్ని మా రొమ్ములపై ఉంచి మా కమ్మవిల్తుని- మన్మథుని వ్యథను బాపరాదా? (సశేషం)