(భగవద్గీత 12-13)
సమస్త ప్రాణులయందు ద్వేష భావన లేకపోవడం, కరుణ మైత్రి భావనను కలిగి ఉండటం, అహంకార మమకారాలకు దూరంగా ఉండటం, సుఖదుఃఖాలను సమంగా తీసుకోవడం ఉత్తముల లక్షణం. అలాంటివారు తనకు ప్రియమైన వారని చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. ద్వేషభావన లేకపోవడం వేరు, మైత్రీ భావనను కలిగి ఉండటం వేరు. క్షమ చేత మైత్రీ భావన వెలుగు చూస్తుంది. తన కుమారులను చంపిన అశ్వత్థామను కూడా క్షమించింది ద్రౌపది. ఉన్నత సంస్కారం సంతరించుకున్న వ్యక్తిలో కరుణాపూరితమైన మనసు చైతన్యవంతం అవుతుంది. ఎక్కడైతే కరుణ, మైత్రి పెనవేసుకుపోతాయో అక్కడ మమకారాలు, అహంకారాలు పొడచూపే అవకాశం ఉంటుంది. కాబట్టి మనసును ఈ రెంటికీ దూరంగా ఉంచగలగాలి.
‘క్షురస్య ధారా నిశితా దురత్యయా, దుర్గం పథస్థాత్ కవయో వదంతి’ అంటుంది కఠోపనిషత్తు. దుర్గమమూ అగమ్యమూ అయిన మానవ జీవన ప్రస్థానం నల్లేరు బండిపై నడక కాదు. అది వైరుధ్యాలకు నిలయం. జీవితం నిరంతరం ప్రవహించే జీవనది లాంటిది. ఆ నదీ ప్రవాహంలో రాళ్లూరప్పలు, మైదానాలు, మురికి కాల్వలు.. జీవన ప్రవాహం లక్ష్యం వైపు సాగాలంటే దానికి రెండు దరులు అవసరం. ఒకటి సరైన దక్పథం కాగా, రెండోది క్రమశిక్షణ. ఈ రెండిటి మధ్యనుంచి ప్రవహించే జీవితమనే నదీ గమనం ఎప్పుడూ పెడదారి పట్టదనే సత్యాన్ని అక్షర పూర్వకంగా కాక అనుభవ పూర్వకంగా గ్రహించ గలిగినదే జ్ఞానం. ఆ ‘ఎఱుక’ కలిగిన వ్యక్తులు ద్వంద్వాలకు అతీతమైన స్థితిలో జీవిస్తూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలలో కుంగిపోవడం, పొంగిపోవడం కాకుండా.. రెండిటినీ సమభావనతో స్వీకరిస్తారు. అదే స్థిత ప్రజ్ఞత.
కష్టాలు వేదనకు దారి తీస్తాయి. వేదన తీవ్రమైతే దుఃఖంగా పరిణమిస్తుంది. వేదనాభరిత చిత్తంలో చీకట్లు కమ్ముకుంటాయి. వెళ్లే దారి మంచిదే కావచ్చు. కానీ, ఆ దారిలో చీకట్లు కమ్ముకున్న సమయంలో తోవ కనిపించదు. దానికి అస్మిత(అహంకారం) తోడైతే మనసు జడత్వాన్ని ఆశ్రయిస్తుంది. సర్వసమర్పణా భావనతో భగవంతుడిని ఆశ్రయించిన భక్తుడు.. అజ్ఞానానికి ఆలవాలమై, సుఖదుఃఖ భరితమైన జీవన గమనంలో పాపక్షయకారుడైన పరమాత్మను ఆశ్రయించి ద్వంద్వాలను సమన్వయం చేసుకుంటాడు. నిజానికి బాధ వేదనలు సత్య శోధనకు, ఆత్మ దర్శనకు దారి తీస్తే అవి వ్యక్తి పరిణామ క్రమంలో దివ్యత్వంగా రూపాంతరం చెందుతాయి.
జీవుని వేదన, ఆత్మ మూలాలను తెలుసుకోవాలనే లక్ష్యంతో సాగి, తత్వ రహస్యాలను అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కర్మానుభవాన్ని పొందడం కోసం అవ్యక్తమైన అపరిమితత్వం నుంచి పరిమితులతో కూడిన వ్యక్తంగా అవతరించడం ‘పుట్టుక’. భౌతిక జీవన పరిమితులను అధిగమించి అవ్యక్తంలో లయం కావడం ‘మరణం‘. గమ్యం, గమనం నిశ్చయమయ్యాక జరిగేది పుట్టుక, గమ్యం చేరాక కలిగేది మరణం. మరణానికి పుట్టుకకు మధ్య వ్యాప్తి చెందిన జీవ చైతన్యం తన లక్ష్య నిర్దేశన, సాధనల కోసం తపిస్తుంది. ప్రతి జీవికీ పుట్టుక, మరణం తన చేతులలో లేనివి. ఈ రెండిటి మధ్య జీవితాన్ని ఎలా నిర్వహించుకుంటామన్నది మాత్రమే తన చేతులలో ఉన్నది. జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, అనుభూతులు అన్నీ కర్మఫలితాన్ని ఇచ్చేవే. కర్మఫలితాలే సుఖదుఃఖాలకు కారణాలు. జిజ్ఞాస కలిగిన సాధకులు ఏ అనుభవాన్నయినా, అనుభూతినైనా ఆత్మాన్వేషణా ఉపకరణంగా మలుచుకుంటూ, ప్రలోభాలను, అడ్డంకులను అధిగమిస్తూ, భౌతిక ఆధ్యాత్మిక జీవిత పార్శ్వాలను సమన్వయం చేసుకుంటూ, తనను తాను ‘ఎఱుక’ పరుచుకుంటూ, సాధనా పర్వంలో ముందుకు సాగుతారు.
తనకున్నది ఇతరులతో పంచుకోవడం ప్రకృతి. ఇతరులది సొంతం చేసుకోవాలను కోవడం వికృతి. తనకున్నది పంచుకొనడంలో ఆనందం ఉంది. ఒక చిలుక తాను చాలా కష్టపడి ఒక జొన్న కంకిని సాధించుకొని చెట్టు చిటారు కొమ్మపై పెట్టుకొని ఆనందంగా ఆరగిస్తూ మధ్య మధ్యలో కొన్ని గింజలు కిందపడే విధంగా తన రెక్కలను టపటపా కొట్టుకుంటుంది. అదే ఒక చీమ ఒక్కొక్క గింజను లాక్కొని వెళ్లి తన పుట్టలో భద్రంగా దాచిపెట్టుకుంటుంది. జాగృతి పొందిన చిలుక తానార్జించిన దానిని పదుగురితో పంచుకోవాలని తపిస్తుంది. చీమ స్వార్ధంతో దాస్తుంది. అలా దాచిన ద్రవ్యం వానాకాలంలో వరదలలో కొట్టుకుపోయి ఎవరికీ పనికి రాకుండా పోతుంది.