ఇబ్రహీంపట్నం, మే 20 : ఇబ్రహీంపట్నం సాగర్ రహదారి వెంట భారీ వాహనాల రద్దీ తగ్గించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు నిర్మాణం కోసం నిధులు విడుదల చేయించారు. అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు హయాంలో ఈ రోడ్డు విస్తరణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి. ఇబ్రహీంపట్నం ఖానాపూర్ గేటు నుంచి మంచాల రోడ్డులో భారత్ గార్డెన్ నుంచి రాయపోల్, నాగన్‌పల్లి రోడ్డు వరకు పనులు చేపట్టి పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ కేవలం ఖానాపూర్ గేటు నుంచి మంచాల రోడ్డులోని భారత్ గార్డెన్ వరకు మాత్రమే పనులు ప్రారంభించారు. కాని, ఈ పనులు పూర్తిచేయడంలో కూడా కాంట్రాక్టర్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు.
రోడ్డు పనులు ప్రారంభించి నాలుగు నెలలు కావస్తున్నప్పటికీ ముందుకు సాగడంలేదు. రోడ్డు వెంట కంకర పోసి వదిలేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిలోనూ ట్రాఫిక్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పనులు పూర్తయితే కళాశాలల బస్సులు, ఇతరత్రా భారీ వాహనాల రద్దీ పూర్తిగా తగ్గుతుందని.. దీనిపై అధికారులతోపాటు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు పనులు వెంటనే పూర్తిచేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పనులు వెంటనే పూర్తిచేయాలి
ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం కోసం నాటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి బీఆర్ఎస్ సర్కారు నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చారు. కాని అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ పనులను త్వరితగతిన పూర్తిచేయించడంలో విఫలమవుతున్నారు. రోడ్డు పనులు ప్రారంభించి నాలుగు నెలలు గడుస్తున్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. రోడ్డు పనులు పూర్తయితే ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.
– మడుపు వేణుగోపాల్‌రావు, బీఆర్ఎస్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి