తిరుమల కొండ మీద ప్రతి పౌర్ణమికి లాగే ఆనాడూ గరుడసేవ ఘనంగా జరుగుతున్నది. మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగుతూ మహాద్వారం దగ్గర నుంచి బయల్దేరారు. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఉత్తర మాడ వీధిలో స్వామి దర్శనం కోసం వేచి ఉన్నాడు. అతని పక్కనే ఒక యువకుడు కూడా నిలబడి ఉన్నాడు. ఇద్దరి మధ్యా మాటలు కలిశాయి. ‘నా జీవితం సమస్యల కొలిమి. పరిష్కారాలే కనబడటం లేదు’ అని బాధగా చెప్పాడు ఆ యువకుడు. ‘మీరేం చేస్తుంటారు?’ అని అడిగాడు ప్రొఫెసర్. ‘ముంబయిలో పెద్ద తాళాల కంపెనీ ఉంది. వెయ్యిమందికి పైగా అందులో పని చేస్తున్నారు’ అని గొప్పగా చెప్పాడు ఆ యువకుడు.
వెంటనే ప్రొఫెసర్, ‘మీ కంపెనీలో తాళాలు మాత్రమే తయారుచేస్తారా, తాళం చెవులు కూడా చేస్తారా?’ అని సూటిగా ప్రశ్నించాడు. ‘ఉత్త తాళాలు తయారుచేస్తే ఎలా? తప్పకుండా తాళం చెవులు కూడా చేస్తాం. రెండూ చేస్తేనే మా వ్యాపారం’ అని బదులిచ్చాడు యువకుడు. అప్పుడు ప్రొఫెసర్ నవ్వుతూ.. ‘మన జీవన పోరాటంలో ఎన్నో సమస్యలు వస్తాయి. సమస్యలతో పాటు పరిష్కారాలు కూడా ఉంటాయి. కానీ మనం, దేవుడే సమస్యలు సృష్టిస్తున్నాడని నిష్ఠూరమాడతాం. నిజానికి మనం గుర్తించాల్సింది ఏమిటంటే, సమస్యలు సృష్టించిన దేవుడు వాటికి పరిష్కారాలు కూడా ఏదో ఒక రూపంలో ఏర్పాటుచేసి ఉంటాడని. దానికోసం మనం ఓపికగా వేచి ఉంటే చాలు.
సమస్యలు మంచులా కరిగిపోతాయి. మేఘాల్లా తేలిపోతాయి. అయినా దేవుడు మన హితం ఆశించేవాడే కానీ, చెడు కోరేవాడు కదు కదా’ అని ధైర్యం చెప్పాడు. ప్రొఫెసర్ మాటలతో ఆ యువకుడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇంతలో వెండి వెన్నెల వెలుగులో స్వామివారు వాహనంలో ఊరేగుతూ ఉత్తర మాడవీధిలోకి వచ్చారు. మంగళవాద్యాలు, వేద మంత్రాలు, గోవింద నామస్మరణల మధ్య ‘నేనుండగా భయమేల నీకు…’ అన్నట్లుగా స్వామి చిరు మందహాసంతో కనిపించాడు. కర్పూర నీరాజనం సమర్పించిన ఆ యువకుడు గోవింద నామాలు చెబుతూ స్వామికి చేతులెత్తి నమస్కరించాడు.
-ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821