శివపూజకు కార్తిక మాసం ప్రాధాన్యం. మహావిష్ణువు ఆర్చనకు మార్గశిరం విశేషం. జ్యేష్ఠ మాసం శివకేశవులతోపాటు బ్రహ్మదేవుడి పూజకూ ప్రశస్తమని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే జ్యేష్ఠం బ్రహ్మకు ప్రీతికరం. కాబట్టి, ఈ నెలలో బ్రహ్మను కూడా అర్చించాలని చెబుతారు. మరి కలియుగంలో బ్రహ్మకు ఆలయాలూ, అర్చనలూ లేవు కదా! అయినా ఈ నెలలో ఇంటి పూజామందిరంలో బ్రహ్మ అర్చన చేయవచ్చని శాస్త్ర వచనం. బియ్యపుపిండితో గానీ, గోధుమపిండితో గానీ బ్రహ్మదేవుడి మూర్తిని సిద్ధం చేసుకోవాలి. నెలంతా నిత్యం షోడశ ఉపచారాలతో బ్రహ్మను పూజించి, నివేదనలు అర్పించాలి. ఇలా చేసినవారికి ఇహలోకంలో శుభాలు సిద్ధిస్తాయనీ, ఆపై సూర్యలోక నివాసం లభిస్తుందనీ పెద్దలు వివరించారు. అయితే తార్కికంగా ఆలోచిస్తే ఇందులోని అంతరార్థం అవగతమవుతుంది.
బ్రహ్మ నాలుగు ముఖాలు కలవాడు. వాటితో నాలుగు వేదాలనూ గానం చేసినవాడు. వేదం అంటే తత్వం, తపస్సు, యోగం, సత్యం! తత్వచింతనతో కాలం గడపడం తత్వం. మనసును, ఇంద్రియాలను ఏకాగ్రం చేసుకోవడం తపస్సు, అలా ఏకాగ్రమైన మనసును దైవానికి చేరువ చేయడం యోగం, దానికి ఫలితం సత్యం. ఇక్కడ సత్యం అంటే అబద్ధాలు ఆడకపోవడం, నిజాలు చెప్పడం మాత్రమే కాదు. యథార్థాన్ని గుర్తించి రుజుమార్గంలో పయనించడమే సత్యం. ఈ నాలుగు అలవర్చుకోవడమే బ్రహ్మదేవుడి అర్చన. ఇక సూర్యలోక నివాసం అంటే… మనసులో చీకటి అనే అజ్ఞానాన్ని తొలగించి, వెలుగులు నింపుకోవడం. ఏ జీవన విధానాన్ని మనం అనుసరిస్తే, జ్ఞానం లభిస్తుందో దానిని బ్రహ్మదేవుడి అర్చనగా పెద్దలు సూచించారు. అంటే జ్ఞాన పూర్వకమైన కర్మాచరణ చేయాలన్నమాట!
– శ్రీచరణ్