క్రీస్తు పుట్టుకకు నెల రోజులూ తెల్లవారుజాము నుంచే ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ ఆయన రాకకై ఎదురు చూసే సమయమే ఆగమన కాలం. క్రీస్తు పుట్టక ముందు ఎప్పుడో మూడు వేల సంవత్సరాల క్రితం.. ప్రవక్తలు భక్తులూ ‘వస్తాడు.. వస్తాడు.. అదిగో వస్తున్నాడ’ంటూ ఎదురు చూచి ఆయన్ను చూడలేక అలానే నిరుత్సాహంతో తనువులు చాలించి లోకం విడిచి వెళ్లిపోయారు. ప్రభువు పుట్టాక ఏటా జరుపుకొనే క్రిస్మస్ పర్వదినం కోసం అలాగే ఆనాటి ప్రవక్తల మాదిరిగానే భక్తులు నిరీక్షిస్తూ, ఎదురేగుతూ ఆశాభావంతో స్వాగతం చెబుతూ ఉంటారు.
ఇది ప్రతి సంవత్సరం జరిగే ముచ్చటే. పూర్వ ఆగమన కాలానికీ ప్రస్తుత ఆగమన కాలానికీ అనంతమైన తేడా ఉన్నా.. ఉద్దేశం మాత్రం ప్రభువును దర్శించాలనే! క్రీస్తును తమ జీవితాల్లోకి ఆహ్వానించాలనే!! ఒక ఆశ కోసం, శాంతి కోసం, సంతోషం కోసం, ప్రేమ కోసం ఎదురు చూస్తారు క్రైస్తవులు. ప్రత్యేకంగా పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తారు. తమలో ఆ క్రీస్తు పుట్టాలని ఆశిస్తారు.
ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా తండ్రి-కుమారపరిశుద్ధాత్మలు- అనే త్రయైక దేవుని చింతించే క్రమంలో ‘తండ్రి దేవుడు’. ఈ అందాల విశ్వానికి సృష్టి కర్త. ఆయనే ఇది ఎలా నడవాలో దీనికి విధి విధానాలు నేర్పించాడు. అయితే, ఇది దారి తప్పి భిన్నంగా ప్రవర్తించే దశలో దీన్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి తనలో ఓ భాగం తన ప్రియ కుమారుడైన క్రీస్తును పంపిస్తాడు.
ఆ క్రీస్తు రాక కోసం అప్పట్నుంచీ ఎదురు చూసే సంస్కృతే ఆగమన కాల లక్ష్యం. సాధారణంగా నవంబరు చివరి ఆదివారం మొదలుకొని డిసెంబర్ 25 వరకు మధ్యలోని ఆదివారాల కాలం ఈ ఆగమన కాలంగా క్రైస్తవులు పాటిస్తారు. తమకు సంబంధించిన ఒక ముఖ్య ఆత్మీయ చుట్టం వస్తున్నాడంటే ఇంటిని ఎలా ముస్తాబు చేసుకొంటామో, అలా మానసికంగా క్రీస్తును ఆహ్వానించడానికి సదా సిద్ధంగా ఉంటారు. ఆగమన ఘడియలు పరిపూర్ణం కాకుంటే క్రిస్మస్ పండుగకు అర్థం ఉండదు.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 94945 75024