ఆలయాన్ని చేరుకోగానే భక్తులు సాధారణంగా చేసే ప్రక్రియ ప్రదక్షిణ. కేవలం ప్రదక్షిణలు చేయటం కోసమే గుడికి వెళ్లే భక్తులు కూడా ఉంటారు. తమ కోరిక తీరటం కోసం దైవానికి మొక్కే వాటిలో ప్రదక్షిణ కూడా ఒకటి. జాతకరీత్యా గ్రహానుకూలం లేకపోయినా, ఏవైనా అరిష్టాలు జరుగుతున్నా కూడా ఆలయాల్లో ప్రదక్షిణలు చేస్తుంటారు. భక్తుడు పరిపూర్ణంగా భగవంతుడికి దాసుడయ్యే క్రమంలో వారిద్దరికి మధ్య అనుసంధానంగా నిలిచే వ్యవస్థల్లో ఉన్నతమైంది ‘ప్రదక్షిణ’. ఇదొక రకమైన శరణాగతి.
భక్తుడు తనను తాను దైవానికి సమర్పించుకున్నట్టు ప్రకటించే విధానం ఇది. భగవంతుడికి చేసే ఉపచారాల్లో పరిపూర్ణమైన ఉపచారం కూడా ఇదే. గుడికి వచ్చిన భక్తుడి మానసిక స్థితి సాధారణ స్థాయికి రావాలంటే అక్కడి దైవికమైన శక్తి వలయంలో ఒక మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే మంచిది.
ప్రదక్షిణ అనే పదానికి ‘తిరగటం’ అనే అర్థం ఉంది. ప్రదక్షిణ క్రియారూపంలో చేసే ప్రణవ (ఓంకారం) జపం అని శివపురాణం చెబుతున్నది. అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు. బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు. దేవుడికి చేసే షోడశ ఉపచార పూజలో చివరి అంకం కూడా!
ఆలయానికి చేరుకోగానే భక్తులు అక్కడి ఏర్పాటును అనుసరించి ప్రదక్షిణలు చేస్తారు. ఆలయంలో కొలువైన దైవాన్ని స్మరిస్తూ, ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు చదువుకుంటూ తాము అనుకున్న సంఖ్య ప్రకారం ప్రదక్షిణలు చేస్తారు. మెల్లగా నడవటం, మనసులోకి ఇతరమైన ఆలోచనలు రానివ్వకపోవటం, చేతులు జోడించి నమస్కరించటం ప్రదక్షిణలో ప్రధాన అంశాలు. ఇంట్లో నిత్యవిధుల్లో భాగంగా చేసే పూజ పూర్తయిన తర్వాత ఆత్మప్రదక్షిణ తప్పనిసరిగా చెయ్యాలి. ఆలయాల్లో ఆత్మ ప్రదక్షిణ చెయ్యకూడదు.
ఆత్మ ప్రదక్షిణ: తనచుట్టూ తానే చేసుకొనే ప్రదక్షిణ
పాద ప్రదక్షిణ: పాదాలతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణ
దండ ప్రదక్షిణ: దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణ
అంగ ప్రదక్షిణ: సాత్విక అవయవాలు నేలను తకేలా దొర్లుతూ చేసేవి.
గిరి ప్రదక్షిణ: దేవుడు కొలువుండే కొండ చుట్టూ చేసేది
ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో చాలా విధానాలు ఉన్నాయి. మామూలుగా ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి చివరికి ధ్వజస్తంభం వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ క్రమం. చండీశ్వరుడు ఉన్న శివాలయంలో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది. దానికి చండీ ప్రదక్షిణం అని పేరు. దీనికే సోమసూత్ర ప్రదక్షిణం అనే పేరు కూడా ఉంది.
ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తి కేంద్రబిందువుకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ప్రపంచంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణలు. జీవితం అంటే ఒక చుట్టు (ఆవృతం). జననం నుంచి మరణం వరకు జరిగే తంతులో మన జీవితమే ఒక ప్రదక్షిణ. ఇలా ఎన్నో జన్మల్లో సంపాదించుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తాం. ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వల్ల జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగించుకునేందుకు అవకాశం చిక్కుతుంది. కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే ప్రదక్షిణ ప్రధాన ఉద్దేశం. వేదాంత పరంగా ఆలోచన చేస్తే ప్రదక్షిణ ప్రక్రియలో అద్భుతమైన అంతరార్థం కనిపిస్తుంది. ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మొదటి ప్రదక్షిణలో మనిషి తనలో ఉండే తమోగుణాన్ని త్యజించాలి. రెండో ప్రదక్షిణ చేసేటప్పుడు రజోగుణాన్ని, మూడో ప్రదక్షిణలో సత్త్వగుణాన్ని వదిలేయాలి. అంటే మొత్తంగా మూడు ప్రదక్షిణలు పూర్తయ్యే సరికి మనిషి త్రిగుణాలకు అతీతమైన స్థితికి చేరుకోవాలి. ఆ విధంగా త్రిగుణాతీతమైన స్థితికి చేరుకున్న తర్వాత ఆలయంలో ప్రవేశించి అక్కడ కొలువైన త్రిగుణాతీతుడైన దైవాన్ని దర్శించుకోవాలి. ప్రదక్షిణ చెయ్యటం వెనుక పరమార్థం ఇది.
– డా॥ కప్పగంతు రామకృష్ణ