శ్రావణ అమావాస్య సందర్భంగా పొలాల అమావాస్య (పోలాల అమావాస్య) జరుపుకొంటారు. పిల్లల యోగక్షేమాలు, తమ సౌభాగ్యం కోసం మహిళలు పొలాల వ్రతం చేస్తారు. వ్రతంలో భాగంగా కంద పిలకలను పూజలో ఉంచుతారు. పెద్ద కంద మొక్కను తల్లిగా, చిన్నదాన్ని పిల్లగా భావించి పూజిస్తారు. ఈ పిలకలను అమ్మవారిగా తలచి వాటికి తోరాలు కడతారు. ముందుగా వినాయకుడి పూజ చేస్తారు. తర్వాత సంతాన లక్ష్మిని గానీ, మంగళగౌరీదేవిని గానీ కంద పిలకల్లోకి ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజ నిర్వహిస్తారు. తర్వాత వ్రతకథ చదివి అక్షతలు శిరస్సుపై చల్లుకుంటారు. వ్రతం పూర్తయిన తర్వాత సంతానవతి అయిన ముత్తయిదువను పూజించి అమ్మవారికి నివేదించిన తొమ్మిది పూర్ణాలను, ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పిస్తారు.
పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుగా భావిస్తారు. స్త్రీకి మాతృత్వం మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయినంగా ఇవ్వాలని పెద్దలు నిర్ణయించారు. మన రాష్ట్రంలో పొలాల అమావాస్య సందర్భంగా పోలేరమ్మను పూజించే సంప్రదాయం ఉంది. పోలేరమ్మ అనుగ్రహంతో సంతానం చల్లగా ఉంటుందని నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో గోడకు పసుపు, కుంకుమతో అలంకారం చేసి, పత్తి వత్తులను అమర్చి అమ్మవారిగా భావించి పూజిస్తారు. కొంతమంది పసుపు గౌరమ్మను, మరికొంత మంది కంద గౌరమ్మను ఆరాధిస్తారు. ప్రాంతీయ ఆచారాలు ఎలా ఉన్నా.. ఏ రూపంలో పూజించినా వ్రతం ఉద్దేశం మాత్రం ఒకటే.
జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏరువాక పున్నమి నుంచి తెలుగు రాష్ర్టాల్లో వ్యవసాయం పనులు జోరందుకుంటాయి. రెండున్నర నెలలుగా రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచిన పశువులకు పొలాల అమావాస్య నాడు పూర్తి విశ్రాంతి ఇస్తారు. పొలం పనుల్లో అలసిపోయిన ఎడ్లకు ఆటవిడుపులా ఈ అమావాస్య నాడు నాగలి, బండి కట్టరు. పశువులకు కడుపు నిండా మేతపెట్టి, పూజిస్తారు.