‘‘నన్ను నమ్ము.. నా మార్గాన్ని అనుసరించి.. ధన్యుడివికా.. నువ్వు నాకు ఇష్టమైనవాడివి … నీకు నేను మాట ఇస్తున్నాను … నువ్వు నన్నే చేరుకుంటావు ! ” (గాడ్ టాల్క్స్ విత్ అర్జున: ద భగవద్ గీత XVIII:65). అని జగద్గురువు అయిన శ్రీకృష్ణుడు తన భక్తుడైన అర్జునుడికి చెబుతున్నట్టుగా మనందరికీ తెలియజేశాడు. జన్మాష్టమి నిజమైన గొప్పదనం ఏంటంటే శ్రీ మహావిష్ణువు గొప్ప అవతారం.. శ్రీకృష్ణ భగవానుడి జీవితం ప్రాముఖ్యత, ప్రతి మనిషీ … తన జీవితాన్ని, కర్మఫలాలను దేవుడికి మాత్రమే అంకితం చేయవలసిన అవసరాన్ని మనందరికీ చెబుతుంది.
అర్జునుడికి ఉపదేశిస్తూ..
“ఎక్కడ కృష్ణభగవానుడు ఉంటే, అక్కడ విజయం ఉంటుంది!” భారతదేశంలో శతాబ్దాల తరబడి, ఒక తరం నుంచి ఇంకో తరానికి వారసత్వంగా వస్తున్న ఈ అమర వాక్కులు.. నిరంతరం మన మార్గంలో వచ్చే సవాళ్లను, పరీక్షలను ఎదుర్కొంటున్న వేళ మన మనస్సులను ఎల్లప్పుడూ భగవంతునిపైనే కేంద్రీకరించేలా మనకు ప్రేరణనిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతమైన ఆధ్యాత్మిక గ్రంథం, ఒక యోగి ఆత్మకథ రచయిత శ్రీ శ్రీ పరమహంస యోగానంద, భగవద్గీతపై ‘గాడ్ టాక్స్ విత్ అర్జున’ అనే రెండు సంపుటాల గ్రంథాన్ని రచించారు. ఈ లోతైన ఆధ్యాత్మిక పుస్తుక పరిచయంలో యోగానంద.. “భగవంతుని కోసం జరిగే అన్వేషణలో భక్తుడు, సాధకుడు ఎక్కడ ఉన్నప్పటికీ, వారి ప్రయాణంలో ఆ భాగంపై భగవద్గీత తన కాంతిని ప్రసరింపచేస్తుంది.”
కురుక్షేత్రంలో అర్జునుడికి రథ సారథిగా
యోగానంద చెప్పిన గీత వ్యాఖ్యానంలో భగవంతుడి అంతర్గత సందేశాన్ని మరింత విశదీకరిస్తూ : కురుక్షేత్ర యుద్ధం.. యుద్ధానికి ముందు అర్జునుడి నైరాశ్యం. ఇందులో నిజమైన అంతరార్ధం ఏమంటే.. ప్రతి మనిషీ తన కోరికలను, అలవాట్లను వదలుకోవడానికి చూపే అయిష్టత. అంతిమంగా ఆత్మ విముక్తి కోసం జరిగే ధర్మయుద్ధంలో ముందుగా ఈ అయిష్టతను జయించాలి. భగవానుడైన శ్రీ కృష్ణుడ్ని మహా యోధుడైన అర్జుడు వేడుకుంటున్నాడు. “నా ఆంతరంగిక స్వభావాన్ని బలహీనమైన జాలి ఆవరించడం వల్ల, నా మనస్సు కర్తవ్యం గురించి అయోమయంలో పడింది. నేను అనుసరించవలసిన అత్యుత్తమ మార్గమేదో నాకు తెలియజేయమని వేడుకుంటున్నాను. నేను నీ శిష్యుడ్ని. నీ శరణాగతిలో ఉన్న నాకు ఉపదేశించు.” (గాడ్ టాల్క్స్ విత్ అర్జున: ద భగవద్ గీత II:7).
ఇందుకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు దివ్య, భవ్య, నవ్య మార్గాన్ని తెలియజేస్తాడు. అదే భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుడు బోధించిన ప్రతి పదం మానవాళి ఎదుర్కొంటున్న అన్ని సవాళ్లను, కష్టాలను ఎలా అధిగమించాలో తెలియజేస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో విశేషాలను, అతి సూక్ష్మమైన యోగ రహస్యాలను అలతి అలతి పదాలలో తేలికగా అర్ధం అయ్యేలా అర్జునుడికి దృఢంగా నొక్కి చెబుతాడు. “శరీరాన్ని నియంత్రించే తపస్సు చేసే వారికంటే, జ్ఞానమార్గాన్ని అనుసరించే వారి కంటే, కర్మమార్గానువర్తుల కంటే, యోగి ఉత్తముడు. అందుకే అర్జునా, నీవు యోగిగా మారు !” (గాడ్ టాల్క్స్ విత్ అర్జున: ద భగవద్ గీత VI:46).
మానవాళికి అత్యున్నత ఆధ్యాత్మిక విజ్ఞానమైన ‘క్రియాయోగం’ గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో రెండుసార్లు ప్రస్తావించాడు. క్రియాయోగం పరమహంస యోగానంద బోధనల సారాంశము. పరమహంస యోగానందులు తమ గురువు, స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి వద్ద శిక్షణ పొందారు. శ్రీ స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి యోగావతార్ లాహిరీ మహాశయుల శిష్యులు, శ్రీ లాహిరీ మహాశయులు శ్రీ మహావతార్ బాబాజీ శిష్యులు. పరమహంస యోగానందగారిచే స్థాపితమైన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.), ముద్రిత, డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ మహాగురువుల బోధనలను ప్రచారం చేస్తుంది. వై.ఎస్.ఎస్. యొక్క ‘జీవించడం ఎలా’ బోధనలు ఈ బృహత్కార్యంలో ఒక ముఖ్యమైన భాగం.
‘క్రియాయోగం’ అనే శాస్త్రీయ మార్గాన్ని అనుసరించడం ద్వారా ఏ కాలానికి, జాతీయతకు, నేపథ్యానికి చెందిన సత్యాన్వేషకులైనా ఆధ్యాత్మిక విముక్తి కోసం కృషి చేసి అంతిమంగా దేవునితో ఐక్యం కావచ్చు.
అందువల్ల భగవంతునితో ఏకత్వం కోసం మనం పరితపించాలని, మన జీవిత ప్రయాణాన్ని ఆ లక్ష్యం వైపు నడిపించాలని మనకు దృఢంగా గుర్తు చేయడమే జన్మాష్టమి అసలు సిసలైన లక్ష్యం. జన్మాష్టమి గురించిన
మరింత సమాచారం yssofindia.org లో లభ్యమవుతుంది.