e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home చింతన 21వ తేది శ్రీరామనవమి రామపదమే ధర్మపథం!

21వ తేది శ్రీరామనవమి రామపదమే ధర్మపథం!

‘రూపు దాల్చిన ధర్మస్వరూపుడే శ్రీరామచంద్రుడు. సకల ప్రాణికోటికి హితాన్నే కలిగించే సాధువర్తనుడు. తిరుగులేని పరాక్రమ సంపన్నుడు. దేవతలకు ఇంద్రుడు రాజైనట్లు ఈ సమస్త చరాచర సృష్టికి శ్రీరాముడే ప్రభువు’. ఈ మాటలన్నది ఎవరో కాదు, శ్రీ రామునిచేత చావుదెబ్బలు తిని దాదాపు మృత్యుముఖంలోకి వెళ్లివచ్చిన మారీచుడు. తన ప్రభువైన రావణాసురునితో పలికిన పలుకులివి. శత్రువు చేతకూడా ప్రస్తుతింపబడే అమేయ పరాక్రమవంతుడే కదా అసలైన వీరుడు. ఆ సత్యపరాక్రముడు శ్రీరామచంద్రుడు.

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం ॥

21వ తేది శ్రీరామనవమి రామపదమే ధర్మపథం!

‘రామకథ, రామనామం అన్ని ఆపదలనూ తొలగిస్తుంది. అన్ని విధాల అభివృద్ధులను కలిగిస్తుంది. లోకానికంతటికీ ప్రియాతి ప్రియమైంది. అంతటి శ్రీ రామునికి పదేపదే అనేకానేక నమస్కారాలు’. శ్రీమద్రామాయణ పారాయణాన్ని వేదపారాయణంతో సమానంగా భావిస్తారు. శ్రీరాముని ధర్మమార్గమే రామాయణం. ఈ మహాకావ్యాన్ని అన్ని వేదాల సమాహారంగా అర్చిస్తారు. పార్వతీమాతకు పరమశివుడు ‘శ్రీరామాయణ మాహాత్మ్యం’తోపాటుగా ఉపదేశించింది రామనామమే. అదే అందరి ఆపదలను తొలగించే దివ్యమంత్రమై రామ తారకమై మానవాళికి అలౌకిక ఫలదాయకమైంది.

‘అన్ని ధర్మాలు తెలిసినవాడు, కృతజ్ఞతతో మెలిగేవాడు, సత్యమేవ్రతంగా కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, అన్నివేళలా సత్ప్రవర్తనతో నడిచి నడిపించే వాడు, జీవులందరి మేలు కోరేవాడు, విద్వాంసుడు, సర్వసమర్థుడు, ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొని ధైర్యంగా నిలబడేవాడు, ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యవంతుడు, ఆయుధం ధరించి రణరంగంలో నిలిస్తే ఎదురే లేనివాడు.. ఎవరైనా ఉన్నారా?’ అని దేవముని నారదులవారిని వాల్మీకి మహర్షి అడిగితే, సమాధానంగా నిలిచిన వాడొక్కడే శ్రీరామచంద్రుడు! ఒకే వ్యక్తిలో ఇన్ని సద్గుణాలు రాశి వోసిన పెన్నిధి శ్రీరాముని సన్నిధి.

వేదాలచేతనే తెలియదగినవాడైన శ్రీరామునిగా పరమాత్మ అవతరించాడు. ఆయనను స్తుతించే వేదం సాక్షాత్తు రామాయణ రూపంలో వాల్మీకినుంచి వెలువడింది. రామాయణానికి శరణాగతి శాస్త్రమనే మరో పేరుంది. తనను శరణని వేడిన వారికెవరికైనా అభయం ఇవ్వడం శ్రీరాముని నియమం. ఒకవేళ రావణుడైనా సరే, శరణు వేడితే అభయం ఇచ్చేవాడు. అవతార వరిష్ఠుడైనప్పటికీ శ్రీరాముడెప్పుడూ ఒక మానవ మాత్రునివలె ఉన్నాడేకానీ, తన పరబ్రహ్మ తత్త్వాన్ని ప్రకటించి లీలలను ప్రదర్శించలేదు. రాముడు సకలసద్గుణ వందితుడు. అక్షరాలా అందరివాడు. ఎప్పుడో లక్షలాది తరాలముందు త్రేతాయుగంలో జరిగిన వాస్తవగాథ నాటికీ, నేటికీ, ఏనాటికీ అనుసరణీయమై అలరారడానికి కారణం శ్రీరాముడు స్థాపించి అనుసరించిన మానవతా విలువలే. ఒకేమాట, ఒకేబాణం, ఒకేసతి అన్నది రాముడు నెలకొల్పిన సమున్నతాదర్శం. తండ్రి, తల్లి కిచ్చిన మాట జవదాటక పోవడం, సింహాసనాన్ని అధిష్టించి చక్రవర్తి కావలసినవాడు చిద్విలాసంగా కారడవులకు పయనం కావడం రాముని స్థితప్రజ్ఞతకు నిదర్శనం. తాను నడిచిన ప్రతి అడుగు దుష్టశిక్షణ- శిష్టరక్షణ కోసం, లోకక్షేమానికే కావడం పరోపకార పరాయణుడైన రాముని రాజధర్మం.

ఋషులపట్ల, గురువులపట్ల, శత్రుమిత్రులపట్లనేకాదు, సామాన్యులపట్లకూడా చూపిన సమభావం, ఆదరాభిమానాలు, భక్తిప్రపత్తులు, స్నేహవైఖరి, స్మితపూర్వభాషిగా, నమ్రతతో కూడిన ఆకట్టుకొనే మాటతీరు మహోన్నత మానవతామూర్తిగా శ్రీరాముని సుగుణాభిరాముని చేశాయి. ద్వంద్వాతీతునిగా, నిశ్చలునిగా, శాంతికాముకునిగా, ధర్మాత్మునిగా రాముడు నెలకొల్పిన ఆదర్శాలు ఆయనను పురుషోత్తమునిగా నిలిపాయి. గురుభక్తి, యోగశక్తి, స్వధర్మానురక్తి వంటి సల్లక్షణాలు రాముని ధీరగంభీరునిగా మలిచాయి.

మరుమాముల దత్తాత్రేయశర్మ

Advertisement
21వ తేది శ్రీరామనవమి రామపదమే ధర్మపథం!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement