రోజూ క్రీస్తును దర్శించడానికి ఎంతోమంది ప్రజలు వచ్చేవారు. చాలామంది తమ వెంట పిల్లలనూ తీసుకొచ్చేవారు. కారణం.. ప్రభువు పిల్లలను చూసి తమను దగ్గరికి ఆహ్వానిస్తాడని, దీవిస్తాడని, కొన్ని మంచి మాటలు చెబుతాడని తల్లిదండ్రుల తాపత్రయం. అయితే, ప్రభువు అనుయాయులు కొందరు పిల్లలతో వచ్చేవారిని అసహనంగా చూసేవారు. ‘క్రీస్తు బోధనలు పిల్లలకు అర్థం కావు’ అంటూ కోప్పడేవారు. దీంతో ఆ తల్లిదండ్రులు బాధతో వెనుదిరిగేవారు.
శిష్యుల ప్రవర్తన ఒకసారి ప్రభువు కంటపడింది. వారితో ‘పిల్లలను నా దగ్గరకు రాకుండా అడ్డగించకండి. వారిని ఆశీర్వదిస్తాను. పెద్దలను పరామర్శించినట్లే.. చిన్నపిల్లలకూ నాలుగు మంచి మాటలు చెబుతాను. ఆ చిన్నారులను ఆహ్వానించండి. ప్రేమ, నమ్మకం నిండుగా ఉన్నవాళ్లే.. దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. పిల్లల మాదిరిగా వినయశీలురై ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. నేర్చుకోవడానికి పిల్లల్లా కుతూహలం చూపాల’న్నారు ప్రభువు.
– సునీల్ రాజు