ఏసు అంటే రక్షకుడు.ఆయన జననం రక్షణోదయం.ఆ మహనీయుడి పుట్టుక ఒక సంచలనం.ప్రభువు రాకతో విశ్వాసుల ఎదురుచూపులు ఫలించాయి. క్రీస్తు ఉదయించిన క్రిస్మస్ సందర్భంగా ప్రభువును ప్రస్తుతించుకుందాం.
దేవుడు ఐదు రోజులపాటు ఈ అందమైన విశ్వాన్ని సృష్టించాడని బైబిలు చెబుతున్నది. ఆరో రోజు ఈ విశ్వం అనుభవానికి మహా మేధా సంపన్నుడిగా మానవుడిని సృష్టించాడు. వారిని, వాటన్నిటినీ చూసి ఆనందించమన్నాడు. ఆ తోట మధ్య ఉన్న చెట్టు ఫలాలు మాత్రం తాకొద్దనీ, తినొద్దని హవ్వా, ఆదాములను హెచ్చరించాడు దేవుడు. ‘మంచి చెడ్డల వృక్షమొకటి ఉంచినాను ఈ తోట లోపల. ముట్టవలదు ఈ ఫలము మీరలు గట్టి యాజ్ఞ ఇదే!’ (రక్షణోదయం) అని ఆజ్ఞాపించాడు. సాతాను సర్పం. హవ్వా, ఆదాముల మధ్యలో ప్రవేశించింది. దేవుడు తినొద్దన్న ఫలాన్ని హవ్వ చేతికి అందించింది. దేవుడి ఆదేశాన్ని మీరారు. మోయలేని మాయ ఇద్దరినీ ఆవహించింది. ఆజ్ఞ మీరిన హవ్వా, ఆదాములు దేవుడి ముఖం చూడలేక దుఃఖ క్రాంతులైపోయారు. తమను రక్షించమని వేడుకున్నారు. పూర్వభాగ్యం కలుగజేయమని కోరుకున్నారు.
సాతాను ప్రభావానికి లోనైన హవ్వా, ఆదాములను దేవుడు మన్నించాడు. సర్పానికి (సాతానుకు) ఘాటైన హెచ్చరికలు చేశాడు. ‘నీకునూ (సర్ప సాతానుకు), స్త్రీ (మరియ) సంతానమునకు వైరము కలుగజేసెదను’ (ఆది: 3:15) అన్నాడు. ఈ మానవ సంతానానికి దేవుడి రక్షణ కావాలని సూచించారు ప్రవక్తలు. ‘ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును (యెషయా 7:14 )’ అని ప్రవచించాడు యెషయా ప్రవక్త. ప్రవక్త మీకా బెత్లెహేం గురించి, దాని భాగ్యం గురించి చెప్పినప్పుడే క్రీస్తు రాక గురించి సూచన జరిగింది. ఆయన వచ్చి మానవాళికి మహా మార్గంగా నిలుస్తాడన్న సూచన జరిగింది. ఇలా సాక్షాత్తూ యెహోవా దేవుడు సూచన చేశాక, ఇర్మియా లాంటి ప్రవక్తలు, మోషే లాంటి విమోచకులు, క్రీస్తుకు ముందు రాజైన దావీదు మహారాజు, భక్తులూ ఎంతో కాలం క్రీస్తు రాకకోసం ఎదురుచూశారు.
ఆ నిరీక్షణ ఫలితమే క్రిస్మస్ పర్వం. బెత్లెహేంలో దైవ కుమారుడైన క్రీస్తు ఉదయించాడు. ఒక పశువుల పాకలో కన్యక గర్భం నుంచి జన్మించాడు. పచ్చిక పొలాల్లో తమ పశువులకు కాపలా కాస్తున్న కాపర్లకు దూతలు వచ్చి శుభవార్త చెప్పారు. ఎవరూ నమ్మలేదు. ఆ వెంటనే నీలి నింగిలో ఒక పెద్ద చుక్క పొడిచింది. దానికో పెద్ద తోక. ఈ తోక చుక్క ఉదయించడానికీ, మహాత్ముల జననానికీ చాలా సంబంధాలు ఉన్నాయని దూతలు చెబితే కాపర్లు విన్నారు. అందుకే బెత్లెహేంలో ఏదో జరుగుతుందని హుటాహుటిన వెళ్లారు. మరియ చేతి పొత్తిళ్లలోని శిశువును దర్శించారు. బాలయేసు కాంతి చూసి ‘అర్ధరాత్రి సూర్యుడు పొడిచాడా’ అని ఆశ్చర్యపోయారు. తమ పేద ఊరిలో ఇదో వింతైన సంఘటన అని ఎగిరి గంతులేశారు.
‘ఇంతటి మహనీయుడు ఈ పశువులు మేసే కొట్టంలో పుట్టడం ఏమిటా?’ అని బాధపడ్డారు. కానీ, యోసేపు, మరియలు పుణ్య దంపతులు. వీరు నజరేతు నివాసులు. జనాభా లెక్కలు రాయించుకోడానికి తమతమ పూర్వికుల ప్రదేశాలకు వెళ్లాలి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తమ పూర్వుల భూమియైన బెత్లెహేం పురానికి వచ్చారు. బెత్లెహేం, నజరేతు మధ్య దూరం 90 కిలోమీటర్లు. నిండు గర్భిణి మరియ. ఒక్క సత్రం కూడా ఖాళీ లేదు. మనసున్న ‘మనిషి’ కనిపించలేదు. ఆ రాత్రి విషమ పరీక్ష. చేసేది లేక, ఆ దగ్గరలోని పశువుల పాకలోనికి వెళ్లారు. అక్కడే కన్య మరియ ప్రభువుకు జన్మ ఇచ్చింది. ఆ చీకటి రాత్రి కాస్త పట్టపగలల్లే మారిపోయింది. పుట్టగానే వెలుగులు పంచిన ప్రభువు.. ఈ శకానికి కర్త అని విశ్వాసుల నమ్మకం. ఆయన జీవితం ఆదర్శమయం. ఆయన మాటలు సదా స్మరణీయం. క్రీస్తు మార్గం సదా ఆచరణీయం.
-ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024