భగవంతుని ప్రీత్యర్థం చేసే యజ్ఞాలలో, వేద మంత్రాలు పఠించే సమయంలో సంజ్ఞార్థకంగా ‘ఓం తత్ సత్’ ఉచ్చరిస్తుంటారు. వీటిలో మొదటిది ‘ఓం’కారం. శాస్త్రవిధులను బట్టి యజ్ఞం, దానం, తపస్సు చేసేవారు ఆ కర్మలను ఓంకార నాదంతో ప్రారంభిస్తారు. అప్పుడా కర్మలు పరమపురుషుడిని పొందడానికి తోడ్పడతాయి. ‘ఓం’కారం ద్వారా భగవత్ సన్నిధి అక్కడ సిద్ధిస్తుంది. ఇక ‘తత్’ అనడం ద్వారా కర్త తాను చేస్తున్న యజ్ఞం, దానాల ప్రయోజనం భగవంతుడి ప్రీతి కోసమే అని తెలియజేస్తాడు.
‘తత్’ అంటే పరతత్వం, పరబ్రహ్మం. ఆ కారణంగా కర్త తాను సంకల్పించిన కార్యం స్వీయ ఆధ్యాత్మికోన్నతికి, లోక కల్యాణానికి, సర్వజన సంక్షేమానికే ఉద్దేశించిందని ప్రకటించినట్టు అవుతుంది. లోక కల్యాణం కోసం చేసే కార్యాలు నిశ్చయంగా పరిపూర్ణం అవుతాయి. వాటిని నిర్వహించిన కర్త కూడా పరిపూర్ణుడు అవుతాడు. ఇదే విషయాన్ని విశదీకరిస్తుంది ‘తత్’. ‘సత్’ అంటే నిత్యత్వమనీ, శాశ్వతమైనదనీ అర్థం. అది పరమపురుషుడి భావంలో ఉపయోగిస్తుంటారు. భగవంతుడు సత్, చిత్, ఆనంద విగ్రహుడు. అంటే.. నిత్యుడు, జ్ఞానమయుడు, ఆనందమయుడని భావం. భగవంతుని ప్రీతి కోసం చేసే కార్యం కాబట్టి ‘సత్’ అంటారు. ఇక్కడ కార్యమే కాదు, దానిని నిర్వర్తిస్తున్న కర్త కూడా ‘సత్’ స్వరూపమే!
…? టి. వేంకట ఫణీంద్రకుమార్