ఒక గ్రామంలో జాతర జరుగుతున్నది. ఆ జాతరకు ఊళ్లోని పదేండ్లలోపు పిల్లలంతా ఏదో ఒక వేషం వేస్తారు. ఆ సమయంలో అక్కడ గుమికూడిన గ్రామస్తుల్లో ‘ఏ దేవుడు గొప్ప?’ అనే చర్చ మొదలైంది. ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్న మేకప్ చేసే వ్యక్తి ఇదంతా గమనించాడు. గ్రామస్తులందరినీ కాసేపు శాంతంగా కూర్చోమని చెప్పాడు. గంట సమయం తనకిస్తే… ఏ దేవుడు గొప్పో తెలియజేస్తానని వారిని ఒప్పించాడు. వేషం వేయడానికి వచ్చిన పిల్లల్లో ఒకరిని పిలిచాడు.
‘నీ పేరేమి?’ అని అడిగాడు మేకప్ చేసే వ్యక్తి. ‘రామచంద్రం’ అని బదులిచ్చాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడిని తెర వెనుకకు తీసుకెళ్లి తన సిబ్బందితో కృష్ణుడి వేషం వేయించాడు. వేదికపైన నిలబెట్టి గ్రామస్తులకు చూపిస్తూ ఇతడు ఎవరు? అని అడిగాడు. కృష్ణుడు అని అందరూ ఒకేసారి చెప్పారు. వెంటనే ఆ పిల్లవాడికి మేకప్ తీయించి బుద్ధుడి వేషం వేయించాడు. ‘ఇతను ఎవరు?’ అని మళ్లీ అడిగాడు. ‘బుద్ధుడు’ అని అందరూ సమాధానం ఇచ్చారు. ఆ పిల్లవాడికి మేకప్ తొలగించి మళ్లీ వేదికపైకి తీసుకొచ్చాడు. అబ్బాయిని చూపుతూ.. ‘ఇప్పుడు ఇతను ఎవరో చెప్పండి?’ అన్నాడు.
‘మాకెందుకు తెలియదు, మన ఊరి రామచంద్రుడు కదా!’ అన్నారు. మేకప్ ఆర్టిస్టు చిన్నగా నవ్వి.. ‘నిజమే, రామచంద్రుడనే పిల్లవాడికి కృష్ణుడి వేషం వేసి కృష్ణుడు అన్నాం, బుద్ధుడి వేషం వేసి బుద్ధుడు అన్నాం. మనకి నచ్చిన వేషం వేసి వేరువేరు పేర్లతో మనం ఈ పిల్లవాడిని పిలవవచ్చు. కానీ, అసలైన రామచంద్రుడు ఒక్కడే కదా! అలాగే మనం దేవుళ్లని రకరకాలుగా వర్ణించుకుంటాం. పూజలు చేస్తాం. ఎవరు ఎన్ని చెప్పినా సత్యం ఒక్కటే, సృష్టికర్త ఒక్కడే. ఉన్నది ఒకే శక్తి. మనకు వచ్చే భేదాలు, కలతలు, కల్లోలాలు అన్నీ దృష్టి భేదం వల్ల కలిగేవే’ అని వివరించాడు. ఆయన మాటలతో గ్రామస్తులకు కనువిప్పు కలిగింది. జాతర జోరుగా సాగిపోయింది.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు 93936 62821