ఉగ్రం.. వీరం.. శాంతం
వైకుంఠంలో శ్రీహరి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం.. ఆ ప్రశాంత వదనుడు.. స్తంభ సంభవుడిగా ఆవిర్భవించగానే ప్రళయమూర్తిగా దర్శనమిచ్చాడు. జూలు విదిల్చాడు. ప్రళయ గర్జన చేశాడు. వచ్చీరాగానే అసుర భంజనం గావించాడు. శ్రీమహావిష్ణువు నరకేసరిగా విచిత్రాకృతి పూనిన వైనం అద్భుతం.
బుధవారం నృసింహ జయంతి
వైకుంఠంలో శ్రీహరి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం.. ఆ ప్రశాంత వదనుడు.. స్తంభ సంభవుడిగా ఆవిర్భవించగానే ప్రళయమూర్తిగా దర్శనమిచ్చాడు. జూలు విదిల్చాడు. ప్రళయ గర్జన చేశాడు. వచ్చీరాగానే అసుర భంజనం గావించాడు. శ్రీమహావిష్ణువు నరకేసరిగా విచిత్రాకృతి పూనిన వైనం అద్భుతం. అదే మృగేంద్రలీల. తలచుకునే కొద్దీ మనసంతా పులకితమయ్యే నృసింహలీల పరమోన్నతం.
శ్రీకృష్ణుడు బృందావనంలో నందుని ఇంట అవతరించినపుడు కంసుడు పలు రాక్షసులతో దాడి చేయించాడు. ఆ అసుర శక్తులనుంచి తన పుత్రుడిని రక్షించుకునే మార్గం చూపమని నంద మహారాజు గర్గ మునిని వేడుకున్నాడు. అప్పుడు ఆయన నరసింహస్వామిని ఆరాధించమని చెప్పాడు. ఆ విధంగా నంద యశోదలు సైతం తమ పుత్రుని సంరక్షణార్థం నరసింహస్వామిని ఆరాధించడం విశేషం!
‘గోవిందం ఆదిపురుషం తం అహం భజామి’ అంటూ దేవాదిదేవుడైన గోవిందుడిని కొనియాడింది బ్రహ్మ సంహిత. ఆదిపురుషుడంటే దేవాదిదేవుడైన మహావిష్ణువు. నరమృగ శరీరుడై మృగేంద్రలీలను గావించినది ఆయనే! మృగాలలో రాజు సింహం! అందుకే ఈ నరసింహ ఆవిర్భావం, ఆయన గావించిన అసుర సంహార ఘట్టం మృగేంద్రలీలగా ప్రాశస్త్యం పొందింది. వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేసే మునులకు కూడా అంత తేలిగ్గా ప్రసన్నం కాని ఆ పరంధాముడు ఐదేండ్ల పసి ప్రహ్లాదుడు తలచిన వెంటనే తరలివచ్చాడు. కాగల కార్యం అన్నీ తానే అయి చేశాడు. అధర్మాన్ని ‘చీల్చి’చెండాడాడు. ధర్మాన్ని నిలబెట్టాడు.
సత్యయుగంలో చోటు చేసుకున్న నృసింహ లీలలోని అంతర్గత సంఘటనలు నేటికీ మరోవిధంగా మనమంతా అనుభూతి చెందుతున్నవే! అవును! అత్యంత కఠోర తపస్సు ఆచరించి శక్తియుక్తులను పొంది తానే సర్వేశ్వరుడనని, తనను మించిన దైవం మరొకటి లేదని భావించాడు హిరణ్యకశిపుడు. ‘ఎక్కడిది రా నీకీ శక్తి?’ అని కొడుకును ఉరిమాడు. ‘ఏది నీ శక్తికి ఆధారమో, ఆ స్వామే నా శక్తికీమూలం తండ్రీ!’ అని బదులిచ్చాడు ప్రహ్లాదుడు. భగవంతుడు ఏర్పరచిన ప్రకృతి నియమానుసారం పూర్వ సుకృతి కారణంగా తగిన ఉన్నత స్థానాన్ని పొందిన జీవుడు, ఆ కారణాన్ని మరచి, తానే సమస్తానికి కర్తనని తలచినపుడు అహంభావానికి లోనవుతుంటాడు.
ఈ సృష్టిని నియంత్రించే శక్తి మరొకటి ఏదీ లేదని, ఇదంతా కేవలం స్త్రీ-పురుషుల మైథునం కారణంగానే ఏర్పడిందని తలచడం అసుర లక్షణాల్లో ఒకటి. ప్రకృతి పలు విధాలా ఇటువంటి భావనల నుంచి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేసినా, వాటిని గ్రహింపలేని జీవుడు తగిన ప్రతిఫలాన్ని పొందక తప్పదు. అలా హిరణ్యకశిపుడు ఎల్లప్పుడూ తనను తాను పరమేశ్వరుడనని చెప్పుకొన్నప్పటికీ, ప్రహ్లాదుడికి మాత్రం నిజమైన పరమేశ్వరుడు, సర్వకారణ కారణుడు ఆ శ్రీహరేనన్న సత్యం తెలుసు. ఇదే పరమసత్యమని భగద్గీత ఉవాచ.
యస్మాత్ క్షరమతీతోహమక్షరాదపి చోత్తమః
అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః
(భగవద్గీత 15.18)
‘నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్థానికీ, నాశరహితమైన జీవాత్మకూ అతీతమైనవాడను. కాబట్టి వేదాల్లో, స్మృతుల్లో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగావెలుగొందాను’ప్రహ్లాదుని మాటలకు మరింత ఆగ్రహించిన హిరణ్యకశిపుడు ‘ప్రహ్లాదా! నీవు నిరంతరం ఎవనినో నన్ను మించిన ఉత్తముడని, సమస్త సృష్టికీ అతీతుడని, చరాచర జీవులను నియంత్రిస్తాడని, సర్వాంతర్యామి అని వర్ణిస్తుంటావు. ఎవడు వాడు? ఎక్కడున్నాడు?’ అని ప్రశ్నించాడు. ‘నా స్వామి ఎక్కడ లేడు తండ్రి! అంతటా ఉన్నాడు’ అని ప్రసన్నవదనంతో సమాధానమిచ్చాడు ప్రహ్లాదుడు. ‘అండాంతరస్తం పరమాణు చయాంత రస్తం- సమస్త బ్రహ్మాండాలు అతనిలోనే ఉన్నాయి. బ్రహ్మాండంలోని అణువణువూ ఉన్న సర్వాంతర్యామి ఆ పరమాత్మ’ అని బ్రహ్మసంహిత తెలియజేస్తున్నది.
కొడుకు సమాధానం విని కోపంతో ఊగిపోయిన హిరణ్యకశిపుడు ‘అంతటా ఉన్నట్లయితే.. ఈ స్తంభంలో ఉన్నాడా?’ అని ప్రశ్నించాడు. ‘నిస్సందేహంగా’ అన్నాడు ప్రహ్లాదుడు. ఆ జవాబు విని ఒక్క పిడికిలితో స్తంభాన్ని ముక్కలు చేశాడు అసురుడు. అంతలో స్తంభజుడై, సర్వాద్భుతమైన నరమృగ శరీరంతో నరసింహుడు అవతరించాడు. మరుక్షణంలో లోకకంటకుడైన హిరణ్యకశిపుడిని వధించాడు. నరసింహుని దివ్య ఆవిర్భావాన్ని భాగవతం ‘తన సేవకుడైన ప్రహ్లాదుడి మాటను వాస్తవమని నిరూపించడానికి శ్రీహరి కనీవినీ ఎరుగని అద్భుతరూపంతో అవతరించాడు’ అని తెలిపింది.
రాధాకృష్ణుల పాదారవిందాలను ఆశ్రయించి సేవించడమే జీవిత పరమ లక్ష్యమైన గౌడీయ వైష్ణవులు శ్రీకృష్ణుడి అనంతమైన అవతారాలలో ఒకటైన నరసింహ స్వరూపాన్ని ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు. హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులు కృష్ణ మందిరాల్లో స్వామివారి ఆరాధన విధిగా ఏర్పర్చడంలో కారణాన్ని ఇలా వివరించారు. ‘నిత్యం శ్రీహరి గుణగణ వైభవాన్నే కీర్తించిన ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు అనేక విఘ్నాలను కలిగించాడు. హరేకృష్ణ ఉద్యమం లోకకల్యాణం కోసం నిర్వహిస్తున్న సంకీర్తన యజ్ఞం. అయితే, లోకంలో అధర్మాన్ని ప్రోత్సహించే శక్తులూ ఉన్నాయి.
ఇవి భగవంతుడు ఏర్పరచిన ధార్మిక నియమాలను ఉల్లంఘించటమే గాక ధార్మిక మార్గాన్ని ఆచరిస్తున్న వారికీ అనేక విఘ్నాలను కలిగిస్తాయి. భగవంతుడు అనుగ్రహించిన వనరులను స్వార్థప్రయోజనాల కోసం కొల్లగొడతాయి. ఎలాగైతే హిరణ్యకశిపుని హింసాత్మక ధోరణి నుంచి నరసింహుడు తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడో, అదే విధంగా ప్రహ్లాదుడు చూపిన మార్గాన్ని అనుసరిస్తున్న ఈ హరేకృష్ణ ఉద్యమాన్ని సైతం దుష్టశక్తుల నుంచి సదా రక్షింపమని వేడుకోవటమే నరసింహుడిని ఆరాధించడంలోని మూల విశేషం’ అని పేర్కొన్నారు. శ్రీల ప్రభుపాదుల వారు హరేకృష్ణ ఉద్యమాన్ని ప్రపంచమంతా విస్తరిస్తున్న సమయంలో పలు ఆరోగ్య కారణాల రీత్యా వారు చేపట్టవలసిన రచనలకు అంతరాయం ఏర్పడింది. అప్పుడు శిష్యులంతా నరసింహస్వామిని ఆరాధించారు.
సమస్త ప్రపంచానికీ మేలుచేసే విధంగా మనమంతా నరసింహ భగవానుడిని సేవించే మార్గాలైన ‘శ్రవణం, కీర్తనం’తో ప్రారంభమయ్యే నవవిధ భక్తిమార్గాలను ప్రహ్లాదుడు లోకానికి ఉపదేశించాడు. భగవంతుడిని గురించి విన్నంత మాత్రాన, ఆయన నామం స్మరించినంత మాత్రాన భక్తియుత సేవలను ప్రారంభించగలం. ఈ పద్ధతి మన హృదయాన్ని పరిశుద్ధం గావించడమే గాక సమస్త విశ్వానికీ శుభాన్ని చేకూరుస్తుంది.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
…? శ్రీమాన్ సత్యగౌర
చంద్రదాస ప్రభూజీ
93969 56984
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

