ఖలీఫా ఉమర్ ఫారూఖ్ పరిపాలనా కాలమది. ఒక యువతి రోజూ నమాజు కోసం మదీనా నగరంలో ప్రవక్త పేరుతో ఉన్న మస్జిదె నబవీకి వెళ్లేది. దారి మధ్యలో రోజూ ఓ యువకుడు ఆ యువతి కోసం కాపుగాసి ఉండేవాడు. ఆ అమ్మాయి నమాజుకు వెళుతుంటే అడ్డుతగిలేవాడు. ఆ పోకిరి చూపులు ఆ అమ్మాయిని ఇబ్బందిపెట్టేవి. ఓ రోజెలాగైనా అతనికి బుద్ధి చెప్పాల్సిందేనని భావించిందామె. రోజులాగే దారి మధ్యలో ఆ యువకుడు అడ్డుపడ్డాడు. ‘రోజూ ఎందుకిలా అడ్డుతగులుతున్నావు?’ అని నిలదీసింది యువతి. ‘నాకు నువ్వంటే ప్రాణం. నువ్వు నా సొంతం అయ్యే వరకూ నిన్ను వదిలేదు లేదు. నీకోసం ఏమైనా చేస్తాను’ అని ప్రాధేయపడ్డాడు. దానికా యువతి ‘సరే నువ్వింతగా నా మీద మనసుపడ్డావు కాబట్టి నేను నీ సొంతం కావాలంటే ఒక షరతు. దానికి అంగీకారమైతే నన్ను నేను.. నీకు అర్పించుకుంటాను’ అన్నది.
యువకుడిలో ప్రాణం లేచివచ్చినట్టయింది. ‘నీకోసం ఎంతకైనా తెగిస్తాను! ఏం చేయాలో చెప్పు’ అని ఆమెను అడిగాడు. అప్పుడు ఆ యువతి ‘ఓ నలభై రోజుల దాకా ఖలీఫా ఉమర్ (రజి) వెనుక నమాజ్ చేయి. నలభయ్యో రోజు నేను నీకోసం ఎదురుచూస్తుంటాను’ అని చెప్పి వెళ్లిపోయింది. అదేమంత కష్టమైన పని అనిపించలేదు ఆ యువకుడికి. ఇక ఆమె తనకు దక్కినట్టేనని భావించి అక్కడినుంచి వెనుదిరిగాడు.
మర్నాటి నుంచి ఖలీఫా ఉమర్ (రజి) వెనుక నమాజులు చేయడం ప్రారంభించాడు. ఖలీఫా ఉమర్ (రజి) ఖురాన్ పారాయణం రోజూ ఆ యువకుడిలో మార్పు తీసుకురాసాగింది. నలభయ్యో రోజు రానే వచ్చింది. మాటప్రకారం ఆ యువతి దారి మధ్యలో యువకుడి కోసం నిరీక్షించసాగింది. ఆ యువకుడు మసీదు నుంచి వస్తూ ఆ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోసాగాడు.
ఆ అమ్మాయి అతణ్ని పలకరించి ‘నీకిచ్చిన మాట ప్రకారం నీ కోసమే ఎదురుచూస్తున్నాను’ అన్నది. దానికా యువకుడు ‘నువ్వు నిశ్చింతగా నిలబడు. నమాజులో ఖలీఫా ఉమర్ ఖురాన్ పారాయణం నా మనసును మార్చివేసింది. ఇప్పుడు నా మనసులో దైవప్రేమకు తప్ప మరెవ్వరి ప్రేమకు చోటు లేదు’ అని చెప్పి అక్కడి నుంచి ఆ యువకుడు కనుమరుగైపోయాడు. ఆ యువకుడిలో వచ్చిన మార్పునకు అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పిందామె!
నమాజ్ చెడు పనుల నుంచి వారిస్తుంది అని ఖురాన్ బోధనకు ఈ సంఘటన మచ్చుతునక. నమాజు అల్లాహ్ను జ్ఞాపకం ఉంచుకునే గొప్ప సాధనం. నిబద్ధతతో చేసే నమాజు వల్ల అల్లాహ్ ప్రేమ మనసులో నాటుకుంటుంది. తద్వారా మనసులో కల్మషాలన్నీ దూరమవుతాయి. నమాజులు చేస్తున్నప్పటికీ మనలో ఎలాంటి మార్పూ రావడం లేదంటే ఏదో మొక్కుబడిగా చేస్తున్నామని అర్థం. మన నమాజుల్లో ఏదో లోపం ఉందన్న విషయాన్ని గుర్తెరగాలి.
ఎవరి నమాజు సరిగా లేదో అలాంటి వారు కష్టాల్లో ఉన్నట్టే అంటారు ప్రవక్త (స). క్రమం తప్పకుండా మందులు వాడినంత మాత్రాన వచ్చిన రోగం నయమవ్వదు, వైద్యుడు చెప్పిన పథ్యం పాటిస్తేనే ఔషధం గుణం చూపిస్తుంది. అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ (స) ఏ విధంగా నమాజు చేయమని చెప్పారో అదే విధంగా చేయాలి. గుండె నిండా అల్లాహ్ ప్రేమను నింపుకొని నమాజు చేయాలి. అల్లాహ్ నన్ను చూస్తున్నాడు అనే స్పృహ కలిగి ఉండాలని ప్రవక్త సూచించారు. శ్రద్ధాభక్తులతో నమాజు చేసేవారే పరలోకంలో సాఫల్యం చెందుతారని ఖురాన్ బోధ.
– ముహమ్మద్ ముజాహిద్, 96406 22076