ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి, భక్తులకు దర్శనమిచ్చే పర్వదినం ముక్కోటి ఏకాదశి. ఈ పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆనాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే పుణ్యమని భక్తుల నమ్మకం. ముక్కోటి నాడు తప్ప.. మిగతా రోజుల్లో ఉత్తర ద్వార దర్శనం అందుబాటులో ఉండదు. సాధారణంగా దేవాలయాలకు తూర్పు, పడమరల్లో ప్రధాన ద్వారం ఉంటుంది. ఉత్తర ద్వారం ఉన్నా, వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తెరుస్తారు. కానీ ఉత్తర ద్వారమే ప్రధాన ద్వారంగా కనిపించే ఆలయాలు అరుదుగా ఉంటాయి. ఇక్కడ ఏడాదంతా ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునే అవకావం ఉంది.
అలాంటి ఆలయాలే వరంగల్ జిల్లాలోని ఎల్లంబజార్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ దగ్గర్లోని తిరుమలయ్య గుడి. ఎల్లంబజార్ శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం ఉత్తర ప్రధాన ద్వారం కలిగిన గుడి. ఇక్కడి స్వామివారి మూర్తి భద్రాచలం రామచంద్రుడిని పోలి కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఎనిమిది శతాబ్దాల చరిత్ర ఉందని శాసనాల ద్వారా తెలుస్తున్నది. ప్రతి నెలా పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాసం, శ్రీరామనవమి వసంతోత్సవాలు ఆలయంలో అంగరంగవైభవంగా సాగుతాయి. ఈ ఆలయంలో కొలువుదీరిన అష్టభుజి వేణుగోపాలస్వామి విగ్రహం తెలంగాణలోనే ప్రత్యేకమైనదని చెబుతారు.
ఇక మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో తిరుమలయ్యగుడిలో వెలిసిన వేంకటేశ్వరస్వామిని శ్రీతిరుమలనాథుడు అని పిలుస్తారు. ఇక్కడ కూడా ఏడాది పొడవునా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అందుకే ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవాన్ని ముక్కోటి వేడుకగా భావిస్తుంటారు భక్తులు. తిరుమలనాథుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విశ్వసిస్తారు. మొక్కులు చెల్లించేవారు తమ పిల్లలకు తిరుమలస్వామి పేరు వచ్చేలా తిరుమలయ్య, తిరుమలమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. మెదక్ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు.
– రంగనాథ్ మిద్దెల