e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home చింతన ధ్రువునికి తల్లి దీవెన!

ధ్రువునికి తల్లి దీవెన!

‘ధ్రువ చరిత్ర’ను మైత్రేయుడు విదురునికి వినిపించినట్లు శుకదేవుడు పరీక్షిత్తుకు ప్రవచించాడు. నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సూత మునిద్వారా భాగవత శ్రవణం చేస్తున్నారు.

‘జీవో దేవ స్సనాతనః’- జీవులకు దేవుని తోటి బంధం ‘యోగం’. ఇది సహజం, శాశ్వతం. ప్రకృతితో పెట్టుకున్న పొత్తు ‘భోగం’. అది కృత్రిమం, అనైతికం, అశాశ్వతం. ‘భోగే రోగ భయం!’- భోగం రోగ మూలకం. ‘యోగో భవతి దుఃఖహా!’- యోగం సర్వదుఃఖ నిర్మూలకం. యోగ భోగాలే సునీతి- సురుచులు. ‘స్థిరత్వాత్‌ ధ్రువః’- ధ్రువుడనగా స్థిరము, సత్యము, శాశ్వతమూ అయిన వస్తువు. ధ్రువునిది అన్వర్థ-సార్థక నామం. ఉత్తమునిది ‘నేతి బీరకాయ’ వంటి వ్యర్థ నామం. పేరుకే ఉత్తముడు. ‘జన్మాంతర శతాభ్యస్తా’ బహుజన్మల నుంచి పేరుకు పోయిన- కరడు గట్టిన తమో గుణంలో ఉత్‌ తముడు అనగా, ఉన్నతుడు, ఉన్మత్తుడు.

- Advertisement -

దేవదేవుడు దామోదరుని దయా దాక్షిణ్యాలతో ధ్రువుడు తన కడుపున పుట్టాలిట! అంటే వేదగర్భుడైన వాసుదేవుని సేవా న్యాసాలకు- పూజా త్యాగాలకు ఫలం తన గర్భవాస మన్నమాట! ఇదీ సురుచి యొక్క దురభిమానం, దురహంకారం. భగవంతునికన్నా తననే ఘనంగా- గొప్పగా భావిస్తోంది. ‘వినాశకాలే విపరీత బుద్ధిః’ అంటే ఇదేగా! దీని దుష్ఫలితాన్ని చివరకు పుత్ర సహితంగా సురుచి అనుభవించక తప్పలేదు.

తండ్రి సమక్షంలో పినతల్లి సురుచి ఆడిన (మాట్లాడిన) వేడి పలుకులు వాడి ములుకుల వలె పసివాడి మనస్సును పీడించాయి. సురుచికి వెఱచి మారు పలుక లేక ఊరకే చూస్తున్న, విరించి (బ్రహ్మ)కి మునిమనుమడైన తన తండ్రి ఉత్తానపాదుని విడిచి, కర్రదెబ్బ తిన్న కాలనాగులాగా రోషంతో రోజుతూ రోదిస్తూ ధ్రువుడు కన్నతల్లిని సమీపించాడు. కన్న కొడుక్కి జరిగిన అన్యాయాన్ని అంతఃపుర కాంతలద్వారా విన్న సునీతి నిట్టూరుస్తూ కన్నీరు కార్చింది-
సవతి తన సుతుని అన్న మాటలు మాటిమాటికీ సునీతి మనస్సులో మెలి తిప్పుతున్నాయి. ‘కార్చిచ్చు మంటల వేడికి కంది- వడలి కళ తప్పిన మాధవీ (పూగురివెంద) లత- తీగ లాగా శోకాగ్నికి కమిలి కుమిలి పోయింది.’ మూల శ్లోకంలో ‘దావాగ్నినా దగ్ధ లతేవ బాలా’- (కార్చిచ్చు మధ్యన కమిలి పోయిన తీగవలె) అని మాత్రమే ఉండగా, అమాత్యుడు పోతన ‘కందిన మాధవీ లతిక వోలె’ అని ఉపమా అలంకారంతో అలరించాడు.

కుందుతున్న- బాధ పడుతున్న బుజ్జాయిని ఒడిలోకి తీసుకొని తల నిమిరి బుజ్జగిస్తూ- ‘బంగారూ! కంగారెందుకురా? ఏడవకు నాయనా! మన దుఃఖానికి మనమేకాని మరెవరో కారణం కాదు. పూర్వజన్మల పాపం ఎంతటి వాడినైనా విడువక వెంటనంటి ఉంటుంది. అనుభవించక తప్పదు. ‘చెరపకురా చెడేవు’- ఇతరులకు చెడు చేసేవాడు తానే చెడిపోతాడు! నా పెనిమిటి నన్ను పెండ్లాముగానే కాదు, చివరకు పనిమనిషిగా కూడా పరిగణించడం లేదు. నా వంటి నిర్భాగ్యురాలి గర్భాన పుట్టడం నీ దౌర్భాగ్యం! అయినా అర్భకా! నీ సవతి తల్లి సురుచి నీతో సత్యమే పలికిందిగా.

ఏమన్నది? అడవికి వెళ్లి తపస్సు చెయ్యమన్నది. నిజమేగా! నేనైనా ఆ మాటే చెప్తాను. ‘సర్వం హి తపసా సాధ్యం’- తపస్సుతో ఏదైనా సాధించవచ్చు. తపశ్శక్తికి మించింది ఏదీ లేదు. ‘సహస్ర పాదాక్షి శిరోరు బాహవే’- ఇస్తే సహస్ర బాహువే (వెయ్యి చేతులవాడే) ఇవ్వాలి. ద్విబాహువు (మానవ మాత్రుడు) ఏమివ్వగలడు? ఎంతివ్వగలడు? అవనీపతి (రాజు- తండ్రి) అంకమును (ఒడిని) అవశ్యం అధిరోహించాలనే ఆశ, ఆకాంక్ష నీకు ఉన్నట్లయితే అందరకు ఆప్తుడైన అధోక్షజుని అంఘ్రి (పాద) పద్మాలను ఆశ్రయించి ఆరాధించు. ఆ బ్రహ్మణ్యదేవుని దీవెనలతోనే బ్రహ్మదేవుడు బ్రహ్మపదాన్ని పొందగలిగాడు. ఆ సర్వాంతర్యామిని సేవించి నీ పితామహుడు స్వాయంభువ మనువు సర్వాత్మభావాన్ని (మోక్షాన్ని) సాధించాడు.

బ్రహ్మాది దేవతలు గాలించినా గోచరించని గోవింద వల్లభ- లక్ష్మీదేవి తన కరకమలంలో లీలా కమలం ధరించి ఆ కమలాక్షునికై కలవరిస్తూ వేగిర పడుతూ వెదకుతూ ఉంటుంది. వత్సా! భక్తవత్సలుడైన ఆ శ్రీవత్సాంకుని, శ్రీమన్నారాయణుని మనస్సులో నిలిపి అర్చించు. ఆ దయామయుడే నీ దుఃఖాన్ని దూరీకరించగలవాడు’ అని ఆ మాతృదేవత అమృతోపదేశం చేసింది. ఆశీస్సులు అందించింది.

మాతృదీవెన మహాశక్తివంతం. అది ముగురమ్మల దీవెన. ముప్పది మూడు కోట్ల దేవతల మహిమ మూర్తిమంతమైన దీవెన! పంచభూతాలు ప్రతి క్షణం పరిరక్షించే దీవెన! అష్టదిక్పాలకులు అండగా నిలిచే దీవెన! కార్యసిద్ధి కలిగించే కన్నతల్లి మాటను మన్నించి, మనస్సును నియమించి ధ్రువుడు తపస్సుకు పయనించాడు.

సునీతి, సుమిత్రలు తల్లులలో సతీమతల్లులు, గుణవతీమతల్లులు. తమ బిడ్డలను బాల్యంలోనే భగవంతునికి భరన్యాసం (సమర్పణ) చేసిన భవ్యశీలలు. ఇట్టి గృహిణీ మణులున్న గృహాలలో కలియుగమైనా కలిపురుషుడు ఎట్టి పరిస్థితిలోనూ కాలు పెట్టలేడు, కలవర పరచలేడు.
(సశేషం)

తే.‘సవతి యాడిన మాటలు సారె దలచి కొనుచు బేర్చిన దుఃఖాగ్ని గుందుచుండె దావపావక శిఖలచే దగిలి కాంతి వితతి గందిన మాధవీ లతిక వోలె.’

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana